ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ప్రకటన?

విశాఖ రైల్వే జోన్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. విశాఖకే రైల్వే జోన్ ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. రైల్వే జోన్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు వెంకయ్య తెరదించారు. విభజన చట్టంలో ఉన్న కేంద్రప్రభుత్వ సంస్థలను విశాఖలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖతో తన అనుబంధం మరువలేనిదని విశాఖ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. విశాఖలోని సీజీహెచ్‌ఎస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించిన వెంకయ్య ఈ ప్రకటన చేశారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

దశాబ్దాల ఆందోళన….
విశాఖకు రైల్వే జోన్ కావాలంటూ కొన్ని దశాబ్దాలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కాని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ డిమాండ్ ను పక్కన పెట్టేసింది. ప్రత్యేక రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటయితే తమకు నష్టమని ఒడిషా రాష్ట్రం చేస్తున్న అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకునే ఇంతవరకూ ప్రకటించలేదు. ఇక రాష్ట్రం విడిపోయినప్పడు విభజన చట్టంలో కూడా విశాఖ రైల్వేజోన్ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖ కంటే తక్కువ సౌకర్యాలు, సదుపాయాలున్న ఇతర రాష్ట్రాల్లోని రైల్వే డివిజన్లను జోన్లగా ప్రకటించిన అప్పటి ప్రభుత్వాలు విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు. 600 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటే ప్రత్యేక జోన్ గా ప్రకటించే వీలుంది. 292 కిలోమీటర్ల రైల్వే లేను ఉన్న ఛత్తీస్ ఘడ్ కు, 411 కిలోమీటర్లున్న జార్ఘండ్ కు ప్రత్యేకంగా రైల్వే జోన్ లను ప్రకటించారు. విశాఖను మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రం విడిపోయాక దీనిపై అనేకరకాలు ఆందోళనలు జరిగాయి. విజయవాడను ప్రత్యేక జోన్ గా చేస్తారన్న వార్తలు రావడంతో విశాఖలోని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇప్పడు తాజాగా వెంకయ్య నాయుడు చేసిన ప్రకటనతో మళ్లీ ఆశలు చిగురించాయి.

ఎన్నో లాభాలు……
విశాఖ జోన్ వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నాయి స్థానిక ప్రజా సంఘాలు. ఈస్ట్ కోస్టల్ రైల్వే డివిజన్లో అత్యధిక లాభాలను ఆర్జించి పెట్టేదే వాల్తేరు డివిజన్. సంవత్సరానికి వాల్తేరు డివిజన్ కు సుమారు 8వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఒక్క టిక్కెట్ల ద్వారానే రోజుకు 30 లక్షల వరకూ ఆదాయం ఈ డివిజన్ కు సమకూరుతుంది. విశాఖలో రెండు పెద్ద పోర్ట్ లతో పాటు స్టీల్ ప్లాంట్, హెచ్.పి.సీ.ఎల్. వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి టన్నుల కొద్దీ సరుకు ఎగుమతులు, దిగుమతులు రైల్వేల ద్వారానే జరుగుతుంటాయి. దీంతో భారీ ఆదాయాన్ని ఆర్జించి పెట్టే వాల్తేరు డివిజన్ ను వదులుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు, ఆప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు ఎప్పటికప్పుడు అడ్డుతగులుతూనే ఉన్నారు. కొత్తగా రైల్వే జోన్ వస్తే కొత్త రైళ్లతో పాటు ప్రాజెక్టులు, లైన్లు మంజూరవుతాయి. ఉద్యోగాల నియామకం కోసం రైల్వే జోన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఫ్లాట్ ఫారంల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న విశాఖ జోన్ ను విశాఖలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎప్పుడు?
ఇంక బీజేపీ ప్రభుత్వం అధికారంలో రెండేళ్లు మాత్రమే ఉంటుంది. రైల్వే జోన్ ఎప్పుడు ప్రకటిస్తారన్నది వెంకయ్య చెప్పలేదు. విశాఖకే రైల్వే జోన్ అని మాత్రమే ప్రకటించారు. కాని ఎన్నికల ముందు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు ప్రకటించినా ఎన్నికల నాటికి అది మరుగున పడిపోతుందని…దానివల్ల ఎన్నికల్లో ప్రయోజనం ఉండదని ఆ ప్రాంతానికి చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు, మంత్రి కేంద్రం పెద్దల వద్ద చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ముందు ప్రకటిస్తే దాని ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తంపై ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనికి టీడీపీ నేతలు కూడా ఓకే చెబుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని ఒక్కొక్క అంశాన్ని తాము అమల్లోకి తెస్తున్నామని చెబుతున్న కేంద్రప్రభుత్వం ఎన్నికలకు ముందు గాని రైల్వే జోన్ ప్రకటన చేయదన్నది విశ్లేషకుల అంచనా.

1 Comment on ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ప్రకటన?

  1. 2014 నుంచి చెబుతూ వస్తూనే ఉన్నారు విశాఖ రైల్వే జోన్ గురించి.2014, 2015, 2016 అయిపోయాయి కదా ఇపుడు కొత్తగా 2017 వచ్చింది, మరొకసారి కొత్తగా చెబుతున్నారు అనిపిస్తుంది. రైల్వే జోన్ ఇచ్చినట్లు ప్రకటించాక అనేక పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి అనేక అనుమతులు,అనేక పోస్టులు క్రియేట్ చేసి సిబ్బందిని నియమించాలి.బడ్జెట్ ఇవ్వాల్సి ఉంటుంది – ఎన్నికల ముందు ప్రకటిస్తే మరో శిలాఫలకం వేసి వదిలేసినట్లే అవుతుంది. రాబోయే ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళోచ్చు లేదా మరుగున పడేయొచ్చు. కాబట్టి ఎన్నికల ముందు ప్రకటించి ఓట్లు దండుకుందామనే ఆలోచన విశాఖ కు ఎలాంటి మేలు చేయదు అని నా అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1