కాకాణి వి తప్పుడు డాక్యుమెంట్లు : నెల్లూరు ఎస్పీ

ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు తప్పుడేవనని నెల్లూరు ఎస్పీ విశాల్ తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కొందరు కాకాణికి ఇచ్చారని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన మణిమోహన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. మణిమోహన్ గతంలో సింగపూర్, మలేషియాల్లో పలు హోటళ్లో స్టీవార్డుగా పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తూ ఆ దేశాలకు సంబంధించిన రెవెన్యూ, బ్యాంకు లావాదేవీలను నిశితంగా గమనించేవాడు. హోటళ్లకు వచ్చే వారిని చూసి వారిలా విలాసవంతంగా జీవించేందుకు మణిమోహన్ పక్కా ప్లాన్ చేశాడు. పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేశాడు. ముందుగా పొలిటికల్ లీడర్ల బయోడేటా సేకరించేవాడు. వారికి వ్యతిరేకంగా ఉండే విపక్ష నేతల వివరాలనూ సేకరించేవాడు.

ఇలా పొలిటికల్ లీడర్ల ఆస్తులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు తెలుసుకున్న మణిమోహన్ వారికి విదేశాల్లో ఆస్తులున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించేవాడు. ముందుగా ఎంచుకున్న లీడర్ ప్రత్యర్థిని ఈ డాక్యుమెంట్లతో కలిసేవాడు. ఈ డాక్యుమెంట్లు కావాలంటే తనకు ఇంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. అతను ఒప్పుకుంటే నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చేసేవాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో అనేకమంది రాజకీయ నేతల పేర్లు ఉన్నాయి. వీరందరి పేరిట నకిలీ పత్రాలను సృష్టించడానికి హరిహరన్ అనే వ్యక్తి సాయాన్ని తీసుకున్నాడు. నకిలీ డాక్యుమెంట్లు టైప్ చేయడానికి వెంకటకృష్ణ అనే యువకుడు మణిమోహన్ కు సాయ పడ్డాడు. పది రోజుల్లోనే విచారణ పూర్తి చేశామని ఎస్పీ తెలిపారు. అయితే నకిలీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఎస్పీ సమాధానమివ్వలేదు. ప్రస్తుతం కాకాణి వేరే కేసులో ముందస్తు బెయిల్ పై ఉన్నారని, సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత, న్యాయస్థానం సలహా మేరకు తామునిర్ణయం తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. విదేశాల్లో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి వేల కోట్ల ఆస్తులున్నాయని కాకాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించి..దీనిపై దర్యాప్తు చేయాలని కోరారు. నెల్లూరు పోలీసులు పదిరోజుల్లో కేసును ఛేదించి కాకాణి చూపించిన డాక్యుమెంట్లు నకిలీవేనని తేల్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1