పదేళ్ల గ్యాప్ వచ్చినా పస తగ్గలేదు

దాదాపు పదేళ్ల గ్యాప్…
2007లో రిలీజైన శంకర్ దాదా జిందాబాద్ తరువాత చిరంజీవి మళ్లీ సినిమా చేయలేదు. రాజకీయాల్లోకి ఎంటరై సీఎం పదవి వరకు వెళ్లినా అందుకోలేకపోయి.. సొంత పార్టీని పక్కనపెట్టి, జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రిగా కూడా సేవలందించి సినీ అభిమానులకు దూరమయ్యారు. రాజకీయంగా నిత్యం కనిపిస్తున్నా వెండితెరపై మాత్రం మధ్యలో ఒక్కసారి మాత్రమే తన తనయుడి సినిమాలో అలా మెరిసి ఇలా మాయమయ్యారు. అలాంటి చిరు ఇప్పుడు తన 150వ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులు దీనికోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షించారు. వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. తన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150లో పాత చిరు వారికి కనిపించాడు. అదే జోష్.. అదే డ్యాన్స్… అదే రఫ్ నెస్… వెరసి.. ఖైదీ నంబర్ 150గా చిరు అభిమానులను ఆనందంలో నింపేశాడు. కాకపోతే సినిమా అనుకున్నంత స్థాయిలో లేదు. ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు వినాయక్ కొంత విఫలమయ్యాడు. ఒక్క చిరు మాత్రమే సినిమాని ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు. థియేటర్లలోని చిరు అభిమానులు సినిమా సంగతులను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. దీంతో సినిమా ఎలా ఉందన్నది అర్థమై ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చేసింది. పైసా వసూల్ మూవీగా నిలుస్తుంది గానీ మరో ఠాగూర్ మాత్రం అనిపించుకోదు. పదేళ్ల విరామం తరువాత వెండితెరపై మరోసారి వెలుగువెలగాలని భావించిన చిరంజీవికి ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు వి.వి.వినాయక్ ఎందుకనో తడబడ్డాడని అనిపిస్తోంది.

కథ పెర్ఫెక్ట్..
కథ బాగున్నా కథనం ఎగుడుదిగుడుగా ముందుకు సాగింది. సినిమా ఎంట్రన్సులోనే చిరు ఖైదీ గెటప్ లో కనిపిస్తాడు.  దొంగ‌తనాలు, మోసాలు చేస్తూ పోలీసుల‌కు దొరికి కోల్ క‌తా జైలులో శిక్ష అనుభ‌విస్తుంటాడు క‌త్తి శీను.. అదేనండీ మన చిరు ఎలాగైన జైలు నుంచి త‌ప్పించుకుని బ్యాంకాక్ పారిపోవాల‌ని భారీ ప్లాన్ వేస్తాడు. అనుకున్నట్లే జైలు నుంచి పారిపోయి హైద‌రాబాద్ లో తేలుతాడు.  అక్కడ నుంచి బ్యాంకాక్ కు చెక్కేయాలనే ట్రయల్సులో ఉండగా ల‌క్ష్మీ (హీరోయిన్ కాజ‌ల్ )  ప్రేమ‌లో ప‌డతాడు. దాంతో తన ప్రేమ‌ను సాధించుకోవ‌డం కోసం బ్యాంకాక్ ఆలోచన వాయిదా వేసుకుని హైద‌రాబాద్ లోనే ఉండిపోతాడు. ఈలోగా తీవ్రంగా గాయ‌ప‌డిన శంక‌ర్ (చిరంజీవి డబుల్ ఫొటో)ని చూసి షాక్ అవుతాడు కత్తి శీను.

అసలు శంకర్ ఎవరు?
ఈ శంక‌ర్ రైతుల సమస్యలపై పోరాడే ఒక నాయ‌కుడు. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలో నీరూరు అనే గ్రామంలో వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న రైతులకు ఎదురైన సమస్యపై పోరాటం చేస్తుంటాడు. ఆ ఊళ్లో రైతుల పొలాలను లాక్కుని కూల్ డ్రింక్సు కంపెనీ పెట్టాలని  చూస్తున్న కార్పొరేట్ కింగ్ అగ‌ర్వాల్ (త‌రుణ్ అరోరా)తో శంకర్ తలపడుతుంటాడు.  రైతుల‌ను చంపేసి వారి శ‌వాలతో వేలిముద్రలు వేయించి వారి పొలాలను తన పరం చేసుకునే దుర్మార్గుడు అగర్వాల్.  అగర్వాల్ పెట్టే బాధలు బరించలేక నిరూరులోని  ఆరుగురు రైతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటారు. అది లైవ్ వీడియో తీయడంతో వారి కష్టాలు బయట ప్రపంచానికి తెలుస్తాయి. శంక‌ర్ నీరూరుకు చెందిన వృద్ధుల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి, అక్కడ హైకోర్టులో వారి త‌ర‌పున కేసు వేసి పోరాడుతుంటాడు. దీంతో అగర్వాల్ ఆయన్ను చంపడానికి
ప్రయత్నిస్తాడు..  తీవ్ర గాయాల‌తో ఉన్న శంక‌ర్ ను చూసి శీను ఆసుప‌త్రిలో చేరుస్తాడు. శంక‌ర్ అచ్చం త‌న‌లా ఉండ‌డంతో తన ప్లేసులో శంకర్ ను ఇరికించాలని భావించిన తన వ‌స్తువుల‌ను ఆయన దగ్గర ఉంచేసి అక్కడి నుంచి శీను పారిపోతాడు.  దీంతో పోలీసులు శంక‌ర్‌నే శీను అనుకుని  జైల్లో పెడ‌తాడు. ఆ తరువాత శీను శంక‌ర్ లా మారి కాజల్ తో కలిసి బ్యాంకాక్ వెళ్లాలని ప్లాన్ చేస్తాడు. అయితే.. శీనును శంక‌ర్ అనుకున్న  కలెక్టర్ రైతులు ఉన్న వృద్దాశ్రమానికి ఆయన్ను తీసుకెళ‌తాడు.. అప్పుడే శంక‌ర్ గురించి , అత‌డు చేస్తున్న రైతు పోరాటం గురించి శీనుకు పూర్తిగా తెలుస్తుంది.  అంతలో అగర్వాల్ శీనును
చూసి శంకర్ అనుకుంటాడు… నాతో నీకెందుకు గొడవ.. నీకు 25 కోట్లు ఇస్తా రైతుల విషయం మర్చిపోమంటాడు. దానికి శీను మొదట ఓకే అన్నా… ఆ తరువాత శంకర్ ఆశయాలు సాధించాలని డిసైడై అగ‌ర్వాల్ ను ఎదిరిస్తాడు.  అంతలో  శీనుగా జైలుకు వెళ్లిన శంక‌ర్ తిరిగి రైతుల వ‌ద్ద‌కు వ‌స్తాడు. అచ్చం త‌న‌లాగే ఉన్న శీను రైతుల కోసం చేస్తున్న పోరాటం చూస్తాడు.  ఇక అక్కడి నుంచి ఇద్దరు చిరంజీవిలు కలిసి రైతులకు ఎలా న్యాయం చేస్తారన్నదే సినిమా.

త‌మిళ క‌త్తి సినిమాను దాదాపుగా యథావిధిగా ఉంచారు. మధ్యలో మన టాప్ కమెడియన్ బ్రహ్మానందాన్ని బాగా వాడుకున్నారు. కామెడీ సీన్లు పండాయి.  సీరియస్ గా సాగుతున్న సినిమాలో బ్రహ్మీ కామెడీ బాగా ఫిట్ అయింది. ఫ‌స్టాఫ్‌లో చిరు-ఆలీ-బ్రహ్మీ మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌తో పాటు కాజ‌ల్‌-చిరు సీన్ల‌తోనే ఎక్కువుగా సినిమా న‌డుస్తుంది.

రాంచరణ్ పండగ బోనస్
లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌లో చెర్రీ స్టెప్పులు చూసి మెగాఫ్యాన్స్‌ పండగ బోనస్ దొరికినట్లయింది. సినిమాలో చిరు పెర్పామెన్స్  అదిరిపోయింది.  క‌త్తి శ్రీను రోల్‌లో దొంగ‌గా, అటు క్లాస్ శంక‌ర్ రోల్‌లో రైతుల కోసం పాటు ప‌డే వ్య‌క్తిగా రెండు భిన్న పార్శ్వాలున్న పాత్ర‌ల్లో బాగా న‌టించాడు. డ్యాన్సుల్లో అయితే ఇప్పటి యంగ్ హీరోలు కంటే బాగా స్టెప్పులు వేశాడు. వీణ స్టెప్పుతో మ‌రోసారి అల‌రించాడు. విల‌న్‌  త‌రుణ్ అరోరా యాక్షన్ చిరంజీవి ముందు తేలిపోయింది.  మొత్తంగా సినిమాలో చిరు, ఆలీ, బ్రహ్మానందం, కాజ‌ల్‌ ల డామినేషనే కనిపిస్తుంది. బలమైన హీరోకు తగ్గట్టు విలన్ లేకపోవడం, సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉండటం, ఎడిటింగ్ లో లోపం సినిమాను అనుకున్నంత రేంజ్ కు తీసుకువెళ్లలేకపోయాయి. అమ్ముడు కుమ్ముడు పాట అసందర్భంగా వస్తుంది. ర‌త్న‌వేలు కెమేరా పనితనం చిరుకు మరింత ప్లస్ అయింది.  పాట‌లన్నీ బాగున్నాయి. తమిళంలో ఉన్లట్లే  ఫైట్లు ఉన్నాయి.  డైలాగ్ లు పవర్ ఫుల్. అన్నీ కలిపి చిరు 150 మూవీ యావరేజ్ గా నిలుస్తుందని అనవచ్చు. శీను పాత్ర ఉన్నంత బలంగా శంకర్ పాత్ర లేదు. కాజల్ కేవలం పాటలకే పరిమితమవుతుంది. బ్రహ్మీ, రఘుబాబుల కామెడీ అలరిస్తుంది.

ఓవరాల్ గా సినిమా గురించి : బాస్ కోసమైతే చూడొచ్చు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1