రేపు రాష్ట్రపతి అభ్యర్ధి పేరు ఖరారు

బీజేపీకి చెందిన రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఈ నెల 20వ తేదీన తెలిసిపోనుంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని బీజేపీ త్రిసభ్య కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ్ నాధ్ సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు వివిధ పార్టీల వారితో చర్చిస్తున్నారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో చెబితే తప్ప తాము మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెప్పలేమని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే ఇంతవరకూ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీకి తప్ప ఎవరికీ తెలియదు.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో…..

ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది నేతలకు చెప్పనున్నారు. గతంలో ఎన్డీయే మిత్ర పక్షాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికను ప్రధాని మోడీకే అన్ని పార్టీలూ వదిలిపెట్టాయి. దీంతో ప్రధాని స్వయంగా ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశమున్నట్లు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం మీద రేపు రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1