కాంగ్రెస్ లీడర్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన కుంతియా

తాను తాత్కాలికం కాదని, పూర్తి స్థాయి ఇన్ ఛార్జినేనని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా స్పష్టం చేశారు. ఈరోజు పీసీసీ, అనుబంధ కార్యవర్గాలతో కుంతియా భేటీ అయ్యారు. రాహుల్ తనను పూర్తి స్థాయి ఇన్ ఛార్జిగానే నియమించారని నేతలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అపోహలుంటే తొలగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్ర వ్వవహారాల ఇన్ ఛార్జిగా తొలగించి తాత్కాలిక ఇన్ ఛార్జిగా కుంతియాను నియమించారని వార్తలొచ్చిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తన పదవి తాత్కాలికమేనని భావిస్తున్న కొందరు నేతలకు కుంతియా గట్టిగానే సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఈసారి యువనేతలకే టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాహుల్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయని చెప్పారు.

పీసీసీ పదవులను మార్చే యోచనలేదు…….

పీసీసీలో పదవులను మార్చే ఆలోచన కూడా అధిష్టానానికి లేదని కుంతియా తేల్చి చెప్పేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి నేతృత్వంలోనే 2019 ఎన్నికలకు వెళతామని స్పష్టం చేసి కుంతియా అపోహలను తొలగించారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికలకు ముందుప్రకటించరని, అది కాంగ్రెస్ సంప్రదాయంలో లేదని తెలిపారు. త్వరలో మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పరిస్థితిని అధ్యయనం చేస్తామన్నారు. రాహ‍ుల్ సందేశ్ యాత్ర పేరుతో రాష్ట్రమంతటా పర్యటిస్తామన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డారనే ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించలేదని కుంతియా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో కేవలం మంత్రులు, ఆయన కుటుంబమే లబ్ది పొందారన్న కుంతియా, ప్రజావ్యతిరేక విధానాలపై పోరుబాట పడతామని తెలిపారు. టీఆర్ఎస్ కు ఒక సిద్ధాంతమంటూ ఏమీ లేదని మండిపడ్డారు. మొత్తం మీద కుంతియా నాయకత్వంపై క్లారిటీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1