ఈ ఎన్నిక వీరిద్దరీకీ విషమపరీక్షే

నిజంగా నల్లగొండ ఉప ఎన్నిక వస్తే….? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అధికార టీఆర్ఎస్ కు ధీటుగా అభ్యర్థి దొరుకుతారా? ఆర్థిక, అంగ బలం అధికంగా ఉన్న గులాబీ పార్టీని ఎదుర్కొనే శక్తి మనకుందా? ఇదే గాంధీభవన్ లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా దాదాపు ఖాయమైంది. ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే తన బలమేంటో విపక్షాలకు తెలియజెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. అప్పటికైనా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు మానుకుంటారని కేసీఆర్ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమపై కాలు దువ్వుతున్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను కూడా నిలువరించే అవకాశం ఈ ఉప ఎన్నిక ద్వారా లభిస్తుంది. అందుకే టోటల్ గా కేసీఆర్ ఉప ఎన్నిక కోసం ఉవ్విళ్లూరుతున్నట్లు గులాబీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఉప ఎన్నిక వస్తే తెలంగాణలో అన్ని పార్టీలూ పోటీ చేసే అవకాశముంది. బీజేపీ తన అభ్యర్థిని ఖచ్చితంగా బరిలోకి దించుతుంది. మరోవైపు ఒకప్పటి తమ కంచుకోట అయిన నల్లగొండ జిల్లాలో కమ్యునిస్టులు పోటీ చేసే అవకాశముంది. టీడీపీ కూడా ఉప ఎన్నికల్లో వెనుకంజ వేయకపోవచ్చు.

అభ్యర్ధి ఎవరు? ఆర్థిక వనరులు ఎక్కడ?

అంటే ఉప ఎన్నిక వస్తే బరిలో ఐదు పార్టీలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది అధికార పార్టీకే లాభిస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా కూడా బలహీనంగానే ఉంది. జాతీయ పార్టీ నుంచి నిధులు వచ్చే అవకాశమూ లేదు. అయితే ఇక ఏడాది మాత్రమే ఉండే ఎంపీ పదవికి సొంత ఖర్చు పెట్టుకుని పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే పీసీసీయే ఉప ఎన్నిక ఖర్చును భరించాల్సి వస్తోంది. గతంలో కోమటిరెడ్డి సోదరులు గుత్తా సుఖేందర్ రెడ్డిపై సవాల్ విసిరారు. పార్టీ మారడం కాదని, రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని, తాము కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కోమటిరెడ్డి సోదరులు కొంత ఉత్తమ్ కు అనుకూలంగానే ఉండేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉత్తమ్ అంటేనే కోమటిరెడ్డి సోదరులు మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ పదవినుంచి ఉత్తమ్ ను తప్పిస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని చెబుతున్నారు. సో… నల్లగొండ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేేసే అవకాశంలేదు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న బ్రదర్స్ అంత రిస్క్ తీసుకోరు. దీంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉంది. అంతేకాకుండా నల్లగొండ ఎంపీ స్థానం కావడంతో కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న ఇద్దరికీ ఇది విషమపరీక్షే. సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో వారికి తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1