మోడీ.. మ‌రోసారి మాట‌ల‌తో క‌డుపు నింపారా?

ఏపీ అనేక స‌మ‌స్య‌ల్లో ఉంది. ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులు ఉలుకు ప‌లుకు లేకుండా పోతున్నాయి. రాజ‌ధాని నిర్మాణం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా సాగుతోంది. ఇక‌, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సంగ‌తి అట‌కెక్కింది. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లు కూడా ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. కానీ, సీఎం చంద్ర‌బాబు మాత్రం మ‌నో వేగంతో రాష్ట్ర అభివృద్ధిని 70 ఎం.ఎం. కేన్వాస్‌పై ఆవిష్క‌రించేస్తున్నారు. ఎక్క‌డ‌, ఎప్పుడు మైకు ప‌ట్టుకునా ఏపీ అభివృద్ధిని రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా చెప్పుకొస్తున్నారు. అయితే, మాట‌లు చెప్పినంత వేగంగా అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో అన్ని ప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అధికార పార్టీ నేత‌లు సైతం ఆఫ్‌ది రికార్డుగా దీనినే చ‌ర్చిస్తున్నారు.

అపాయింట్ మెంట్ లభించినా….

అయితే, దీనంత‌టికీ `కీ`.. మొత్తం ప్ర‌ధాని మోడీ వ‌ద్దే ఉన్నద‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. అయితే, ఆయ‌న అప్పాయింట్ మెంట్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నించి.. వీటిపై చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, దాదాపు ఏడెనిమిది నెల‌లుగా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. అయితే, ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు విన్న‌పాన్ని మ‌న్నించి మోడీ అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో రెక్క‌లు క‌ట్టుకుని చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. విన్న‌పాలు వివ‌రించే ముందు ఆయ‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు గుజ‌రాత్‌లో బీజేపీ విజ‌యంపై అభినంద‌న‌లు తెలిపారు. అంతేకాదు, ఇక్క‌డి నుంచి ఫ్లైట్‌లో సీటు బుక్ చేసి మ‌రీ.. ఓ బొబ్బిలి వీణ‌ను కూడా ప్ర‌త్యేకంగా తీసుకు వెళ్లి మోడీకి బ‌హూకరించారు.

స్పష్టమైన హామీ ఏదీ?

ఇంత‌గా మోడీని ఆక‌ట్టుకున్న చంద్ర‌బాబు ఏపీ స‌మ‌స్య‌ల‌న్నీ సాధించేస్తార‌ని, అక్క‌డిక‌క్క‌డే హామీలు పొందేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, జ‌రిగింది ఒక్క‌సారి కూలంక‌షంగా …నిష్ప‌క్ష‌పాతంగా మాట్లాడితే.. చంద్ర‌బాబు ఏ విష‌యంలోనూ స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించ‌లేదు. య‌ధాలాపంగా మోడీ గ‌తంలో ఏపీ విష‌యంలో ఎలా మాట్లాడారో.. “చూస్తాను.. చేస్తాను.. నేనున్నాను. నాది హామీ.. మీరు భ‌య‌ప‌డొద్దు.. అన్నీ నేను చూస్తాను… నాకు వ‌దిలేయండి“ వంటి పాత‌చింత‌కాయ్ డైలాగుల‌నే ఇప్పుడూ వ‌ల్లించి బాబుతో భేటీ అయిన 40 నిముషాల్లో అస‌లేం జ‌రిగిందో కూడా తెలియ‌కుండా చేశారు. ఈ మాట‌లు ఎవ‌రో చెప్పింది కాదు. స్వ‌యంగా భేటీ అనంతరం బాబు చెప్పుకొచ్చిన మాట‌లే.

నిరంతరం పోరాటమేనా?

మోడీతో భేటీ అనంత‌రం బాబు మాట్లాడిన మాట‌లు.. స‌ద‌రు భేటీ అయిన త‌ర్వాత కూడా మోడీ ఏపీకి ఏమీ చేయ‌లేర‌నే విష‌యాన్ని బాబు క‌ళ్ల‌కు క‌ట్టారు. ఈ భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ను.. ‘సమావేశం మీకు సంతృప్తి కలిగించిందా?’ అన్న మీడియా ప్ర‌శ్న‌కు చంద్రబాబు నేరుగా సమాధానం ఇవ్వలేదు. ‘మనకు రావాల్సి న వాటిపై నిరంతరం ఒత్తిడి చేస్తూ ఉండడమే తన పని’ జవాబిచ్చా రు. అంతేకాదు, ప్రధానితో సమావేశం తర్వాత సమస్యలపై కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటుందన్న విశ్వా సం కలిగిందన్నారు. అయితే, విశ్వాసం వేరు న‌మ్మ‌కం వేరు అనేది కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక‌, పోలవరం 2018 కల్లా పూర్తవుతుందని చెప్పలేనని బాబు చెప్ప‌డం ద్వారా.. ఈ ప్రాజెక్టు విషయంలో మోడీ నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌లేద‌ని స్ప‌ష్ట‌మైపోతోంది. ఏతావాతా.. ఎలా చూసినా.. మోడీ.. మ‌రోసారి చంద్ర‌బాబును త‌న‌ మాట‌ల‌తో క‌డుపు నింపారే త‌ప్ప చేసిందేమీలేద‌ని స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1