అంత‌ర్మ‌థ‌నంలో హ‌రీష్‌.. !

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు! ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి! న‌మ్ముకున్న‌వారే న‌ట్టేట ముంచ‌నూ వచ్చు! ఎలాంటి న‌మ్మ‌కం లేనివారే ఆదుకోనూ వ‌చ్చు! రాజ‌కీయాల్లో ఇదో పాఠం కూడా! అచ్చు ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే, ఇలాంటి పాఠాలే ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయంగా అత్యంత చురుగ్గా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ బృందంలోని మంత్రి, సీఎం కేసీఆర్‌కు స్వ‌యానా మేన‌ల్లుడు అయిన హ‌రీష్‌రావుకు ఎదుర‌వుతున్నాయి. అన్నీ తానే అనుకుని మామ చెప్పిన‌ట్టు అడుగులు వేసిన ఈ యువ‌నేత ప‌రిస్తితి ఇప్పుడు దారుణంగా త‌యారైంద‌నే వాద‌న వినిపిస్తోంది. సొంత మామ నుంచే ప‌రాభ‌వాలు ఎదుర‌వుతున్నాయ‌ని స్ప‌ష్టంగా వినిపిస్తున్నాయి. అడుగ‌డుగునా హ‌రీష్‌ను అవ‌మానించే రీతిలో కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

మామకు ధీటుగా మాటల్లో….

ఈ ప‌రిస్థితిలో వేరే నేత‌లు ఉంటే ప‌రిస్థితి మ‌రోర‌కంగా ఉండేద‌ని కూడా చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి కూడా హ‌రీష్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మామకు స‌రిజోడుగా వ్యాఖ్య‌లు వినిపించ‌డంలోనే కాదు, ప్ర‌త్య‌ర్థుల‌కు మంచి కౌంట‌ర్ ఇవ్వ‌గ‌లిగిన నేత‌గా కూడా హ‌రీష్ గుర్తింపు పొందారు. అనేక ఉద్య‌మాలు చేశారు. పోలీసుల‌తో ఢీ అంటే ఢీ అని పోరాడారు. రాష్ట్రం సాధించే క్ర‌మంలో ఆయ‌న కూడా గ‌ట్టి పాత్ర పోషించారు. అనంత‌రం ఏర్ప‌డిన ప్ర‌భుత్వంలో సాగునీటి శాఖకు మంత్రిగా మామ ఇచ్చిన పోస్టును అనుచ‌రులు వ‌ద్ద‌న్నా.. భార్య నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చినా స్వీక‌రించి స‌వాలుగా భావించి ప‌నులు చేస్తున్నారు. మామ ఏ కార్యం అప్ప‌జెప్పినా చేస్తూ వ‌చ్చారు.

హరీశ్ ను పక్కన పెడుతూ….

ముఖ్యంగా నీరు, ప్రాజెక్టుల విష‌యంలో మ‌హారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాల విష‌యంలో హ‌రీష్ కీలకంగా వ్య‌వ‌హ‌రించార‌ని కేసీఆరే మీడియా ముఖంగా హ‌రీష్‌ను కొనియాడారు. అయితే, రాజ‌కీయాల్లో ప‌రిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అదే ప‌రిస్థితి హ‌రీష్‌కూ వ‌చ్చింది. కేసీఆర్ త‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌ను నెంబ‌రు 2 పొజిష‌న్‌కు తేవాల‌ని, త‌న త‌ర్వాత రాష్ట్రానికి సీఎంను చేయాల‌ని భావించారు. ఈ విష‌యంలో హ‌రీష్ ఎక్క‌డ పోటీ వ‌స్తాడోన‌ని భావించిన ఆయ‌న ఇటీవ‌ల కాలంలో హ‌రీష్‌ను చాలా త‌ొక్కేస్తున్నాడ‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా వీటికి బ‌లం చేకూరుస్తున్నాయి. అట్ట‌హాసంగా నిర్వ‌హించిన జీఏఎస్ స‌మ్మిట్‌లో ఎక్క‌డా హ‌రీష్ క‌నిపించ‌లేదు.

ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ….

అదేవిధంగా పలు ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వ ఫ‌ల‌కాల‌పై కూడా ఆయ‌న పేరు చేర‌లేదు. ఇక‌, హైదరాబాద్ లో ఘనంగా చేయతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభల విషయంలోనూ హరీష్ రావును పక్కకు తప్పించారు. తొలుత ఈ కార్యక్రమ పనుల్లో హరీష్ రావు చురుగ్గా పాల్గొన్నారు. మీడియాలో ఆయన హడావుడి కూడా కన్పించింది. కానీ సర్కారు అకస్మాత్తుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కెటీఆర్, తుమ్మల నాగేశ్వరరావులకే చోటు కల్పించారు. హరీష్ రావుకు అందులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ ప‌రిణామం హ‌రీష్ అనుచ‌రుల‌కు గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మించింది. ఇక‌, పార్టీలో ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

వ్యూహాత్మకంగానేనా?

ఇక తెలంగాణ‌లో ప‌లు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడు వాటి బాధ్య‌త‌ల‌ను సీఎం కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా కేటీఆర్‌కు అప్ప‌గిస్తున్నారు. అక్క‌డ గెలిస్తే ఆ క్రెడిట్ ఆటోమేటిగ్గా కేటీఆర్ ఖాతాలో వేసేస్తున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో హ‌రీష్‌రావు మ‌నుషుల‌ను సైడ్ చేసేస్తుంటే కేటీఆర్ మ‌నుషుల‌కు ప్రాధాన్య‌త పెరిగిపోతోంది. ఓ వైపు కొడుకుకు పార్టీలో ప‌ట్టుకోసం కేసీఆర్ త‌న వంతు సాయం చేస్తూ హ‌రీష్‌ను సైడ్ చేస్తుంటే మ‌రో వైపు ఇటు కేటీఆర్ చాప‌కింద నీరులా దూసుకుపోతున్నార‌న్న చ‌ర్చ‌లు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో హ‌రీష్‌ను ప్రాధాన్యం లేని వ్య‌క్తిగా మార్చ‌డం వెనుక కార‌ణాల‌పైనా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇదే విషయంపై హ‌రీష్ కూడా అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1