అంబటికి ఈసారి అధినేత ఆసరాగా నిలుస్తారా?

వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాను ఈసారైనా జగన్ గట్టెక్కిస్తారన్న నమ్మకంతో ఆ పార్టీ క్యాడర్ ఉంది. సత్తెన పల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి రాంబాబు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద కేవలం 924 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమిపాలయ్యారు. అయితే ఇందులో అంబటి రాంబాబు నిర్లక్ష్యం కూడా ఉందని కొందరు చెబుతారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా అంబటి సక్రమంగా పట్టించుకోక పోవడం వల్లనే ఓటమిపాలయ్యారని, ఇది అంబటి స్వయంకృతాపరాధమేనన్నది సత్తెనపల్లి వైసీపీ కార్యకర్తల అభిప్రాయం. ఈ నేపథ్యంలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సత్తెన పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.

టీడీపీ గెలిచింది రెండుసార్లే….

సత్తెనపల్లి నియోజకవర్గం తొలినుంచి కాంగ్రెస్ కు అనుకూలమైన నియోజకవర్గంగా పేరుంది. 1955లో ఏర్పడిన సత్తెన పల్లి నియోజకవర్గం నుంచి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య తొలిసారి గెలుపొందారు. వావిలాల తొలుత సీపీఐ అభ్యర్థిగాను, తర్వాత స్వంతత్ర అభ్యర్ధిగానూ గెలుపొందుతూ వచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటికి రెండు సార్లుమాత్రమే టీడీపీ విజయం సాధించడం విశేషం. 1999లో యలమంచిలి వీరాంజనేయులు టీడీపీ తరుపున ఇక్కడి నుంచి గెలుపొందగా, రెండోసారి 2014లో టీడీపీ తరుపున కోడెల శివప్రసాదరావు విజయం సాధించారు.

ఈసారి ఎలాగైనా…..

అయితే ఈసారి ఎలాగైనా సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో జగన్ పాదయాత్ర సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు స్థానిక నాయకత్వంపై ఉన్న అసంతృప్తి కూడా తమకు కలసి వస్తుందని చెబుతున్నారు. దీనికితోడు జగన్ పాదయాత్రకు తమకు అదనపు బలం చేకూరుస్తుందని నమ్ముతున్నారు. అంబటి రాంబాబులో కూడా గతంలో లేని ఉత్సాహం కన్పిస్తోంది. జగన్ పాదయాత్రకు విపరీతమైన స్పందన రావడంతో ఈసారి గెలుపుతమదేనన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.

121వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర…

కాగా జగన్ పాదయాత్ర 121వ రోజుకు చేరుకుంది. మంగళవారం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల శిబిరం నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి నార్నేపాడు క్రాస్ రోడ్స్, తంబళ్లపాడు క్రాస్ రోడ్స్, మాదాల, ఇరుకుల పాలెం వరకూ పాదయాత్ర సాగుతుంది. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం ఆయన పాదయాత్ర సత్తెనపల్లి వరకూ కొనసాగుతుంది. సత్తెనపల్లిలో జరగనున్న బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*