అఖిలప్రియకు మంత్రి పదవి ఇస్తే….?

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అఖిల ప్రియకు మంత్రిపదవి లభిస్తే అతి చిన్న వయసులో మంత్రి అవుతారు.అయితే ఇక్కడ చిన్న సమస్య ఉంది. భూమా అఖిలప్రియ వైసీపీ టిక్కెట్ మీద గెలిచి తన తండ్రితో పాటు టీడీపీలోకి చేరారు. వాస్తవానికి భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే నాగిరెడ్డి అకాల మరణంతో అఖిలప్రియకు ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మా సంగతేంటి?
కాని ఇక్కడ అఖిలప్రియకు వస్తే మిగిలిన ఎమ్మెల్యేల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ , విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ వంటి వారు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.కాని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మంత్రి పదవి ఇస్తే తాను ప్రమాణస్వీకారం చేయించబోనని గవర్నర్ నరసింహన్ మంత్రి యనమల దృష్టికి తెచ్చారని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కూడా తెలిసింది. కాని ఇప్పుడు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇస్తే మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే అవకాశముంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలప్రియను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేక వైసీపీ నుంచి వచ్చి చేరిన మరికొందరికీ అవకాశమిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*