అటకెక్కిన బస్సు ప్రమాదం దర్యాప్తు

10మంది నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన దర్యాప్తు విజయవంతంగా దారి తప్పింది…..ఈ ఘటనకు కారణం ఏమిటి., బాధ్యులు ఎవరు అనే విషయాన్ని వదిలేసి అధికార., ప్రతిపక్షాల మధ‌్య గొడవగా చిత్రీకరించడంలో కొన్ని వర్గాలు విజయవంతం అయ్యాయి. భువనేశ్వర్‌ నుంచి సోమవారం మధ్యహ్నం బయల్దేరిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు మంగళవారం ఉదయం 5.40 గంటల సమయంలో కీసర టోల్‌ గేటు దాటిన తర్వాత 17 కి.మీల దూరంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఓల్వో బస్సు 125కి.మీ వేగంతో ప్రయాణించి ఉంటుందని ఆ వెనుకే వచ్చిన కార్‌ డ్రైవర్లు పోలీసులకు తెలిపారు. తమ వాహనాలు సగటున 110-115కి.మీ స్పీడ్‌తో ప్రయాణిస్తుండగా వాటిని క్రాస్‌ చేసేంత వేగంతో వెళ్లడంతోనే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని వాంగ్ములమిచ్చారు. ముండ్లపాడు వాగు మీద ఉన్న కల్వర్టుల దగ్గర రోడ్డు మలుపు ఉంది. అడుగు ఎత్తున డివైడర్‌ ఎక్కి అక్కడి నుంచి రెండు కల్వర్టుల మధ్య గ్యాప్‌లో బస్సు పడిపోయింది. రెండు కల్వర్టుల మధ‌్య రెండడుగుల ఎత్తైన గోడ ఉంది. రోడ్డు మీద నుంచి డివైడర్‌పైకి ఎక్కి అక్కడి నుంచి వేగంగా దూసుకెళ్ళి కిందపడిపోయింది. మితిమీరిన వేగంతో వెళితే తప్ప వోల్వో బస్సు అంతగా అదుపు తప్పే అవకాశాలు ఉండవు. దాదాపు పది అడుగుల వెడల్పు ఉండే సెంట్రల్‌ డివైడర్‌ ఎక్కిన తర్వాత కూడా రెండు వందల మీటర్ల దూరం ప్రయాణించి నాగార్జున సాగర్‌ కాల్వలోకి దూసుకుపోయింది.

వివాదంతో విచారణ దారి తప్పిందా?

పది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలను వెదకడానికి బదులు టీడీపీ-వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వివాదంగా మొత్తం ప్రమాదాన్ని మార్చేశారు. ప్రమాదం తర్వాత బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ నందిగామ ఏరియా ఆస్పత్రిలో వైద్యులతో వాదనకు దిగారు. వైద్యుల చేతిలో ఉన్న పోస్ట్‌మార్టం నివేదికలను లాక్కున్నారు. డ్రైవర్‌ ఆదినారాయణ మద్యం సేవించి ఉన్నాడో లేదో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రశ్నలు వేటికి సమాధానాలు ఇప్పటికి రాలేదు. వైద్యులతో వాదన జరుగుతున్న క్రమంలో అక్కడే ఉన్న కలెక్టర్‌ జగన్‌ చేతి నుంచి పేపర్లు తీసుకోవడంతో వివాదం మలుపు తిరిగింది. కలెక్టర్‌ను జగన్‌ దూషించాడని., వైద్యుల విధులకు అటంకం కలిగించాడని కేసులు పెట్టారు. ఐఏఎస్‌ అధికారులు., రెవిన్యూ ఉద్యోగులు ., పోలీస్ అధికారుల సంఘాలు పోటీపడి జగన్‌ తీరును ఖండించాయి. ఈ వార్తలే మీడియాలోను వచ్చాయి. నిజానికి ప్రమాదంలో మరణించిన డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడో లేదో ఇప్పటికి తేలలేదు. ఎంపీ దివాకర్‌ రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ నుంచి మృతులకు ఎంత పరిహారం లభిస్తుందనేది తేలలేదు. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రయాణించే వారికి సైతం ఇన్సూరెన్స్‌ తప్పనిసరి చేయాలనే నిబంధన అమలు ఏమైందనే విషయాన్ని విస్మరించారు. రాజకీయ పార్టీలు ఒకరినొకరు దూషించుకోవడం., ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంతో వివాదానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని భావిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*