అటూ..ఇటూ…టీడీపీ….ఇలా అయితే ఎలా?

bode prasad telugudesamparty

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కొనసాగడం ఒక్కోసారి ఎపి సర్కార్ కి కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఏపీలో విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశాలనే తెలంగాణ లో టిడిపి అసెంబ్లీలో మాట్లాడటం అధికారం లో ఉంటే ఒకలా విపక్షంలో ఉంటే మారోలా పాలకులు వ్యవహరిస్తారని తేటతెల్లం చేసేస్తోంది. గతంలో టిడిపి లో రేవంత్ రెడ్డి వున్నప్పుడు కేసీఆర్ పై చేసిన అనేక విమర్శలు, ఆరోపణలని జగన్ ఏపీలో టిడిపి పై ఎక్కుపెట్టిన సందర్భం కనిపించేది. శాసన సభ్యులను గోడదూకించి అధికారపార్టీలోకి లాగడాన్ని చంద్రబాబు తెలంగాణాలో తీవ్రంగా విమర్శించారు. ఇదేమి రాజకీయం అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం రాజకీయ వ్యభిచారమని విరుచుకుపడ్డారు. పార్టీలు మారేవారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కేసీఆర్ ను కడిగేసిన సందర్భం. సీన్ కట్ చేస్తే ఎపి రాజకీయాలకు వచ్చేసరికి చంద్రబాబు కేసీఆర్ చేసిన పనే చేసి ప్రజల్లో అభాసుపాలయ్యారు. వైసిపి ఎమ్యెల్యేలను లాక్కుని మంత్రి పదవులతో సత్కరించి జనంలో అడ్డంగా బుక్కయ్యారు. ఆయన తెలంగాణాలో కేసీఆర్ పై చేసిన విమర్శలు ఆరోపణలు ఇప్పటికి సోషల్ మీడియా లో అక్కడా… ఇక్కడా బాబు అంటూ చక్కెర్లు కొడుతూ అందరు నవ్వుకునేలా పరిస్థితి మారిపోయింది.

ఆర్ కృష్ణయ్య అంత మాట అన్నారు…

తెలంగాణ అసెంబ్లీలో విద్యావ్యవస్థ డొల్లతనం, కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు అక్రమాలపై చర్చ సాగింది. ఈ చర్చలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అధికార పార్టీ వైఖరిపై ఒంటికాలిపై లేచారు. తెలంగాణాలో విద్యా మాఫియా ఆగడాలు హద్దులు మీరినా సర్కార్ చర్యలు శూన్యమని ధ్వజమెత్తారు. పిల్లల చదువుకోసం తల్లి తండ్రులు అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థల అరాచకాలకు అడ్డుకట్ట ఎందుకు వేయడం లేదని నిలదీశారు. ఇలా తనదైన శైలిలో కృష్ణయ్య సర్కార్ ను ఇరుకున పెట్టారు.

నారాయణపై విమర్శలతో……

వాస్తవానికి ఏపీలో మంత్రి నారాయణ పై ఈ విమర్శలు నేరుగా చేసినట్లే. మంత్రి నారాయణ టిడిపిలో కీ రోల్ లో వున్నారు. నారాయణ, చైతన్య పై అదే స్థాయిలో ఏపీలో కూడా విమర్శలు పెల్లుబికుతున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఎబివిపి విద్యార్థి సంఘాలు, కార్పొరేట్ విద్యాసంస్థలపై పోరు కొనసాగిస్తున్నాయి. కానీ మంత్రి హోదాలో నారాయణ చక్రం తిప్పే పొజిషన్ లో ఉండటం, గత ఎన్నికల్లో టిడిపి విజయంలో ఆర్ధికంగా ఆయనే ప్రధాన పాత్ర పోషించడంతో చంద్రబాబు సర్కార్ ఏమిచేయలేని పరిస్థితి. ఇప్పుడు కృష్ణయ్య వంటివారు టి అసెంబ్లీలో నేరుగా నారాయణ, చైతన్య పేర్లను ప్రస్తావిస్తూ చేసిన విమర్శలు ఆరోపణలను ఎపి విపక్షాలు ఎన్నికల్లో బాగా వాడుకునే వీలు ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదుపు తప్పిన విద్యా మాఫియా కు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలిసిన అవసరం ఎంతైనా వుంది. కానీ ఆదిశగా అడుగులు పడటం అనుమానమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*