అద్వానీకి నేర్పిన రాజనీతి పాఠం

రాజనీతి ఒక్కో సారి చరిత్రకే పాఠాలు చెబుతుంది. మరుగుజ్జులు మహా నాయకులు అయిపోతారు. మేరునగధీరులైన నేతలు మౌనముద్ర వహించి మహాభినిష్క్రమణం చేయాల్సి వస్తుంది. స్వాతంత్ర్యానంతర శకంలో దేశ రాజకీయ యవనికపై చెప్పుకోదగ్గ నాయకుల్లో లాల్ కిషన్ అద్వానీ ఒకరు. సిద్ధాంతం ఏదైనా కావచ్చు. ఆయన చిత్తశుద్ధి మాత్రం ప్రశ్నించలేనిది. వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ వటవృక్షాన్ని పెకలించడానికి అవసరమైన ప్రత్యామ్నాయానికి నారు పోసి,నీరు పోసి బీజేపీగా పెంచి పోషించిన శక కర్త అద్వానీ. ఈ రోజు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తున్న కమల దళానికి దిశానిర్దేశం చేస్తున్న నాయకులను వేళ్లపట్టుకుని నడిపించిన దార్శనికుడాయన.

జనసంఘ్ మొదలు నేటి కమల వికాసం వరకూ అద్వానీ రాజకీయాన్ని , పార్టీ ప్రస్థానాన్ని విడదీసి చూడలేనంత అవిభాజ్య సంబంధం. ఉత్తరాదిన రెండు మూడు రాష్ట్రాలకు, కొన్ని వర్గాలకు పరిమితమైన పార్టీని దేశవ్యాప్తంగా చర్చల్లోకి తీసుకురావడం విస్తృతమైన ప్రజామద్దతు సమీకరించడం ఆయనకే చెల్లింది. ప్రజల్లో విద్వేష బీజాలు నాటారన్న ముద్ర తీరని కళంకంగా నేటికీ వెన్నాడుతున్నా..మెజార్టీ భారతీయులకు పార్టీని చేరువ చేయడంలో అద్వానీ చేసిన కృషి అనితర సాధ్యం. రథయాత్ర మొదలు పెట్టి రామజన్మభూమి అంశాన్ని హిందూభావోద్వేగాల పతాక సన్నివేశంగా మలిచి మైనారిటీలను సంతృప్తి పరిస్తే చాలు అధికారం శాశ్వతం అన్నట్లుగా మారిన వామపక్ష,కాంగ్రెసు రాజకీయాలకు చెల్లు చెప్పిన ఘనత అద్వానీ కే దక్కుతుంది. ఈ రోజున బీజేపీ ప్రపంచంలోనే పెద్దపార్టీగా రికార్డు సృష్టించిందంటే అది ఆయన చలవే. తన కాలము, తన దేహము, తన మనస్సు అంకితం చేసి అహరహం పార్టీ పుంజుకోవడానికి శతయుద్ధములు చేసిన అపర చాణుక్యుడు అద్వానీ. రాజకీయ చరమాంకంలో తాను నీరు పోసిన శిష్యగణమే తనని పక్కనపెట్టడం విషాదాంకం. దేశ రాజకీయాలను ఔపోసన పట్టిన అగ్రనేత. బీజేపీ శ్రేణుల్లోనే కాదు. దేశ ప్రజల్లోనే ఆయనంటే తెలియని సామాన్యుడు లేడు.

ప్రథమ పౌరునిగా అత్యున్నత స్థానం అందుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న నాయకుడు. సమకాలీన రాజకీయాల్లో ఆయనకు సరితూగే నేత ఉన్నాడా? అంటే కూడా అనుమానాస్పదమే. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పనితీరు, పార్టీ కమిట్ మెంట్ తో శిఖరసద్రుశంగా ఎదిగారు. ఇప్పుడు జాతీయంగానూ, రాష్ట్రాల్లోనూ కీలకభూమిక పోషిస్తూ పాలకులుగా ఉన్న వారెందరెందరో ఆయన కళ్లముందు ఎదిగిన వారే. బీజేపీ, మోడీ పేరు చెబితే నిప్పులు చెరిగే మమతా బెనర్జీ మొదలు నితీశ్ కుమార్ వరకూ ఆయనంటే ఎనలేని గౌరవం చూపుతారు. అయినా ఆయన ఎన్డీఏ పక్షానికి అధ్యక్ష అభ్యర్థి కాలేకపోయారు.

కుటుంబ వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి చెందకపోయినప్పటికీ తమ పార్టీలోని అగ్రనాయకులకు ఇచ్చిన కనీస గౌరవాన్ని కూడా పార్టీని నిర్మించిన నేతకు బీజేపీ ఇవ్వలేకపోవడం రాజకీయ వైచిత్రికి నిదర్శనంగానే చెప్పుకోవాలి. సొంతకుంపటి పెట్టుకుని ఒక సందర్భంలో బయటికి పోయినా ప్రణబ్ ముఖర్జీ తెలివితేటలకు, సీనియార్టీకి పెద్దపీట వేస్తూ ఆయనను దేశాధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్. అస్త్ర సన్యాసం చేసిన పీవీ నరసింహారావు అవసరాన్ని గుర్తించి దక్షిణభారతం నుంచి తొలి ప్రధానిగా పట్టం గట్టింది కాంగ్రెసు. మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ వంటి సీనియర్ల మాటకు కాంగ్రెస్ అధిష్టానం ఎంతటి విలువ ఇస్తుందో తెలియనిదికాదు. కానీ విలువలు, హిందూ ధర్మం పేరిట హడావిడి చేసే బీజేపీకి పార్టీకి ప్రాణం పోసి సర్వస్వం త్యాగం చేసి జీవితాంతం సేవలు చేసిన అద్వానీ వంటి పెద్దను ఎలా గౌరవించుకోవాలో తెలియదనుకోవాలా? ఏ నినాదంతో బీజేపీని ఇంటింటికీ పరిచయం చేశారో అదే వివాదంలో న్యాయపరమైన వ్యాజ్యంలో అద్వానీ ఇప్పుడు కూరుకుని ఉన్నారు. రాష్ట్రపతి అయితే అత్యున్నత పదవితో పాటు ఆ వివాదంలోని విచారణ నుంచి కూడా ఆయనకు మినహాయింపు లభిస్తుంది. సీనియర్ రాజకీయవేత్తగా ఆయన అనుభవం దేశానికీ ఉపయోగపడుతుంది.

వాడుకొని వదిలేసే కరివేపాకు రాజకీయం కాలం చెలాయిస్తున్న ఈ రోజుల్లో అంతటి ఉదారస్వభావాన్ని మనం ఎదురుచూడలేం. అందుకే అద్వానీ ఎందుకూ కొరగానివానిగా మిగిలిపోయాడు. ఒకానొకప్పుడు మిత్రపక్షాలతోపాటు వాజపేయి సహా అందరూ నరేంద్రమోడీని గుజరాత్ పీఠం నుంచి తొలగించాలని మొత్తుకున్నా ఒకే ఒక్కడు అండగా నిలిచాడు. తన శిష్యుడి సీఎం సీటును కాపాడాడు. అతనే అద్వానీ. ఇప్పుడు అన్నీ తానై దేశాన్నేలుతున్నాడు మోడీ. అయినా గురువుపై కనీస క్రుతజ్ణత లేదు. అందించిన సేవలకు విలువ లేదు. చేసిన త్యాగాలకు గుర్తింపు లేదు. దీంతో బీజేపీ శ్రేణులకు ఏ సంకేతాలు ఇస్తున్నట్టు? భిన్నమైన పార్టీ బీజేపీ అనేది ఒకనాటి నినాదం. సంప్రదాయ బూర్జువా పార్టీలకు నకలుగా, అధినేత అడుగులకు మడుగులొత్తే మూస ధోరణిలో సాగుతుంటే మరో కాంగ్రెసు అనకుండా ఉండగలమా? అసలు కాంగ్రెసునే మించిపోయిన నియంత్రుత్వం. ఎన్నియో యుద్ధముల ఆరితేరిన అద్వానీ శకం రాజకీయంగా అంతరించిపోయి ఉండవచ్చు. బీజేపీ నేర్పిన రాజనీతి పాఠం మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది.