అభ్యర్థులను మార్చినా గెలిచే ఛాన్స్ లేదా?

ప్ర‌కాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డ అధికార టీడీపీలో లుక‌లుక‌లు పెరిగిపోయాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం పోరు నానాటికీ పెరుగుతుండ‌డం టీడీపీని ఇర‌కాటంలోకి నెడుతున్న ప‌రిణామం. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోతుల సునీత రంగంలోకి దిగారు., వైసీపీ త‌ర‌ఫునుంచి యెడెం బాలాజీ రంగంలోకి దిగారు. అయితే, ఇక్క‌డ గ‌తంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్.. 2014 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ నేప‌థ్యంలో ఇక్క‌డ స్వ‌తంత్రంగా పోటీ చేసినా బ‌లమైన పోటీ ఇచ్చిన టీడీపీ నేత సునీత‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. సునీత‌కు 47 వేల ఓట్లు రాగా.. ఆమంచికి 57 వేల ఓట్ల పైచిలుకు ఓట్లు ప‌డ్డాయి.

విభిన్నమైన తీర్పు…..

ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసిన యెడెం బాలాజీ పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేక పోయారు. ఆయ‌న‌కు కేవ‌లం 26% ఓట్ల తో 40 వేల ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. దీంతో 10 వేల ఓట్ల మెజారిటీతో ఆమంచి విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీయ‌డం, వైసీపీ గ‌ట్టి ఫైట్ ఇచ్చిన నేప‌థ్యంలో చీరాల‌లో మాత్రం ఓట‌రు భిన్న‌మైన తీర్పు ఇచ్చి ఆమంచిని రెండోసారి గెలిపించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు ఆయ‌న టీడీపీలో చేరిపోయారు. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అభ్య‌ర్థికి, ఆమంచికి మ‌ధ్య నెల‌కొన్న పోరు ఇప్ప‌టికీ కొన‌సాగుతుండ‌డంతో పార్టీ ప‌రంగా అభివృద్ధి చెందింది ఏమీ లేదు.

గ్రూపుల గోల…..

పైగా ఆమంచికి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న బ‌లం వ్య‌క్తిగ‌తం పెరుగుతోంది త‌ప్పితే.. అది టీడీపీకి మేలు చేయ‌డం లేదు. పోనీ.. టీడీపీ ప‌రంగా బ‌ల‌మైన వాయిస్ ఆయ‌న ఇస్తున్నారా? అంటే.. సునీత చేస్తున్న వ్య‌తిరేక వ్యాఖ్య‌లు, వ‌ర్గ పోరుతో ఆమంచి.. పార్టీని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. సునీత‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా ఇక్కడ గ్రూపుల గోల మాత్రం అలాగే ఉంది. నిజానికి ఇక్క‌డ ఆమంచికి వ్య‌క్తిగ‌తంగా మంచి ఇమేజే ఉంది. దీంతో ఆయ‌న ఈ వ‌ర్గ పోరుకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా పార్టీ మారిపోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టుగా గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆమంచి ఏపార్టీ నుంచి…?

నిజానికి ఇక్క‌డ సునీతను క‌ట్ట‌డి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీలోని మ‌రో వ‌ర్గం అంటోంది. ఇక‌, వైసీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగానే ఉంటోంది. టీడీపీ నేత‌ల మ‌ధ్య ఉన్న వర్గ పోరును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో నేత‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల‌లోనూ వైసీపీ గెలుపొందే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎటొచ్చీ మ‌ళ్లీ.. ఆమంచికే అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. అయితే, ఆయ‌న టీడీపీలో ఉండే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. ఆయ‌న ఏపార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఇక్క‌డ గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక వేళ ఆమంచి టీడీపీ వీడితే ఆ పార్టీకి షాక్ త‌ప్ప‌దు.

మూడు ఎన్నికల నుంచి…..

గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ టీడీపీ ఓడిపోతూ వ‌స్తోంది. పార్టీ కేడ‌ర్ కూడా నిస్తేజంగా ఉంది. ఇప్ప‌ట‌కీ ఇక్క‌డ ఆమంచి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌పైనే పార్టీ ఆధార‌ప‌డి ఉందంటే ఇక్క‌డ టీడీపీ దుస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. 2004లో పాలేటి రామారావు, 2009లో జే.శ్రీనివాస‌రావు, 2014లో పోతుల సునీత ఇలా మూడు ఎన్నిక‌ల్లో ముగ్గురు క్యాండెట్ల‌ను మార్చినా ఉప‌యోగం లేదు. మరి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఆమంచి డెసిష‌న్ ఎలా ఉంటుందో ? చీరాల టీడీపీలో ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*