అయితే బాబు పొత్తు ఆ పార్టీతోనేనా?

చంద్రబాబు టీటీడీపీ నేతలకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నాయకులు ఇక పోకుండా కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తు ఎవరితో ఉంటుందన్నది కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లామని, అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నేతలే చెబుతున్నారన్నారు. దీంతో ఇక బీజేపీతో ఇక్కడ పొత్తు ప్రసక్తి ఉండదని చెప్పకనే చెప్పారు.

గులాబీ పార్టీతోనేనని పరోక్షంగా….

ఇక తెలంగాణలో మిగిలింది రెండే రెండు పార్టీలని, ఒకటి కాంగ్రెస్ కాగా మరొకటి అధికార టీఆర్ఎస్ పార్టీ అని ఈరెండింటిలో దేనితో పొత్తు పెట్టుకోవాలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని పార్టీ నేతలకు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరన్నది ఆయన మాటల్లోనే స్పష్టమైంది. రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా, గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన చెప్పడం విశేషం. అంటే ఇక మిగిలింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీతోనే తాను పొత్తును కోరుకుంటున్నట్లు సమావేశంలో పరోక్షంగా సంకేతాలిచ్చారు చంద్రబాబు. అయితే టీఆర్ఎస్ తో పొత్తు వద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. అయితే పార్టీని విలీనం చేసే అధికారం ఎవ్వరికీ లేదని చంద్రబాబు స్సష్టం చేశారు.

క్యాడర్ ను కాపాడుకునేందుకే….

ఇప్పటికే సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మోత్కుపల్లి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన కలిస్తే చంద్రబాబును ఆయన నివాసంలో కలిసే అవకాశముంది. అయితే పార్టీని ముందుగా బలోపేతం చేయాలని, కార్యకర్తల బలంతో పార్టీ పటిష్టంగా ఉంటేనే ఎవరైనా పొత్తు పెట్టుకునేందుకు ముందుకు వస్తారని చంద్రబాబు చెప్పారు. తాను క్యాడర్ ను కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటానని చెప్పారు. అంతేకాకుండా తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, కాని ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోబట్టే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు మాటలను బట్టి చూస్తే గులాబీ పార్టీతోనే సైకిల్ ప్రయాణం తెలంగాణలో సాగుతుందన్నది స్పష్టమైంది.

జూ.ఎన్టీఆర్ కు అప్పగించాలని….

అయితే కేవలం తెలంగాణలో పార్టీ ఖాళీ అవుతుండటంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లయినా తాము గెలుచుకునే అవకాశముందని పార్టీ వీడరు. ఇకపై నేతలెవ్వరూ పార్టీని వీడకుండా చంద్రబాబు తన వ్యాఖ్యలతో తలుపులను మూసివేశారన్న కామెంట్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విన్పించాయి. ఇప్పటికే దాదాపు 70 శాతం పార్టీ ఖాళీ అయింది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో భాగంగానే పరోక్షంగా పొత్తు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారంటున్నారు. అయితే సమావేశంలో కార్యకర్తలు తెలంగాణా పార్టీ బాథ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ నేతలు సరిగా పనిచేయడం లేదని పెద్దయెత్తున నినాదాలు చేశారు. అయితే ఆ నినాదాలను చంద్రబాబు పెద్దగాపట్టించుకోక పోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*