అయ్యర్ ను సాగనంపాల్సిందేనా?

ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత హనుమంతరావు అయ్యర్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని లేఖ రాశారు. గతంలో గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీపై నీచ్ అనే పదాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కు అయ్యర్ గురైన సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అయ్యర్ వ్యాఖ్యలు కారణమని కూడా ఆ పార్టీ నేతలు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోనూ టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని ఎలా కాగలరని ప్రశ్నించి వివాదంగా మారారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరాచీలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనం కలిగించాయి.

కరాచీలో వివాదాస్పద వ్యాఖ్యలు……

కరాచీ లిటరేచర్ ఫెస్టివల్ లో భాగంగా లవ్ ది నైబర్ మరియు పాకిస్థాన్-ఇండియా రిలేషన్స్ అనే అంశంపై మణిశంకర్ అయ్యర్ మాట్లాడారు. భారత్ పాక్ ల మధ్య సమస్యలకు తెరపడాలంటే నిరంతరం చర్చలు జరపడమే మార్గమని అయ్యర్ అభిప్రాయపడ్డారు. నిరంతర చర్చలకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, న్యూఢిల్లీ అందుకు ఇష్టపడటం లేదన్నారు. తాను పాకిస్తాన్ ను ప్రేమిస్తానని, ఎందుకంటే తాను ఇండియాను ప్రేమిస్తాను కాబట్టి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూడా పొరుగుదేశాన్ని ప్రేమించాలన్నారు. జమాత్ -ఇ-ఇస్లామి మినహా అన్ని రాజకీయ పార్టీలూ ఇండియాతో శాంతినే కోరుకుంటున్నాయన్నారు అయ్యర్. పాకిస్థాన్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, కాని ఇండియాలో మాత్రం రాలేదన్నారు. అందువల్లనే 1947 విభజన నాటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నామన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. మరి అయ్యర్ పై బహిష్కరణ వేటు పడుతుందో లేదో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1