అలర్ట్ అయిన రాజమాత….!

రాజమాత వసుంధర రాజే కొంత అప్రమత్తమయినట్లున్నారు. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానంలో డిపాజిట్లు కోల్పోవడంతో వసుంధర రాజే దాదాపు షాక్ లోకి వెళ్లారు. ఇక సొంత పార్టీ నేతల నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నారు. కొందరు బీజేపీ నేతలయితే ఏకంగా ముఖ‌్యమంత్రిని మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వసుంధర రాజే కొంత ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా అఖండ మెజారిటీని సాధించిన బీజేపీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజావిశ్వాసాన్ని కోల్పోతుందన్నది వాస్తవం. అందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనం.

సొంత పార్టీ నుంచే….

మరోవైపు సొంత పార్టీ నేతల నుంచే వసుంధర రాజే విమర్శలను ఎదుర్కొంటున్నారు. సెంటిమెంట్ కూడా పనిచేయలేదంటే రాష్ట్ర సర్కార్ పై ఎలాంటి వ్యతిరేకత ఉందో ఇట్లే అర్థమవుతుందని నివేదికల మీద నివేదికలు పంపుతున్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే మేల్కొనాల్సి ఉందని హెచ్చరించారు. 19 జిల్లాల్లో జరిగిన 27 పంచాయతీ ఎన్నికల్లో 16 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పుడే సర్కార్ పట్ల వ్యతిరేకతను గుర్తించాల్సి ఉందంటున్నారు. రెండు కార్పొరేషన్లలో కూడా హస్తం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ రెండు కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వసుంధరరాజే తనయుడు దుష‌్యంత్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బరన్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనివే. దీన్ని బట్టి రాజే కుటుంబంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందంటున్నారు బీజేపీలోని ఒక వర్గం నేతలు.

వరుస ఓటములతో మేల్కొని….

అయితే పంచాయతీ, మున్సిపల్, లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటమిని వసుంధర రాజే జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉండటంతో కొంత నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు రాజే ఉపక్రమించారు. ముఖ్యంగా రైతులు ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఉప ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమయింది. ఈ నేపథ్యంలో వసుంధరరాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు యాభై వేల లోపు రుణాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు రాజే సర్కార్ ప్రకటించింది.

రుణమాఫీని ప్రకటించి….

యాభైవేల లోపు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికే ఈరుణ మాఫీ వర్తిస్తుంది. రుణ మాఫీ కారణంగా రాష్ట్ర ఖజనాపై ఎనిమిదివేల కోట్ల రూపాయ భారం పడనుంది. ఇక భూమి శిస్తును రద్దు చేసింది. దీనివల్ల యాభై లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక రైతు రుణ ఉపశమన కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వసుంధరరాజే ప్రకటించారు. ఇది శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ కమిషన్ ముందు అర్హులైన రైతులు హాజరై రుణమాఫీని పొందే వీలుంటుంది. వ్యవసాయాధారిత పరిశ్రమల ప్రోత్సాహానికి భారీ రాయితీలిచ్చింది. ఇలా వరుస ఓటముల నుంచి వసుంధర రాజే గుణపాఠం నేర్చుకున్నట్లుంది. ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్న రైతులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరి ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం రాజేకు లబ్ది చేకురుస్తుందా? లేదా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1