అవినీతి త్రయం, అ…‘ద్వితీయం‘… ఆంధ్రప్రదేశ్

election expenditure in ap

‘అవినీతి రహిత రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలి. అందుకు మీరు బాధ్యత తీసుకోవాలం‘టూ జిల్లా కలెక్టర్లనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు సమీక్ష సమావేశంలో చెబుతున్నారు. మరోవైపు దాదాపు అదే సమయంలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించిన నివేదిక వాస్తవాల నిగ్గు తేల్చింది. దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలుస్తోందంటూ నివురుగప్పిన నిజాన్ని వెలికి తీసింది. ఈ నివేదికకు ఒక ప్రత్యేకత ఉంది. ఏవో కొన్నిశాఖలను జాతీయ స్థాయి అంచనాలను మదింపు చేసిన గణాంకాల గారడీ కాదు. సాక్షాత్తు ప్రజలే ఈ నివేదికకు ఆధారభూతాలుగా నిలిచారు. తమ రాష్ట్రంలో పనులు కావాలన్నా, ప్రభుత్వ సేవలు పొందాలన్నా ఏ స్థాయిలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందో వారి నుంచే సమాచారం సేకరించి , వాటినే క్రోడీకరించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ ర్యాంకులు అందచేసింది. ప్రతిపక్షం మీదనో, వేరే ఎవరిమీదనో ఆరోపణలు గుప్పించి, నిందలు వేసి తప్పించుకునే అవకాశం లేదు. సర్కారే సమాధానం చెప్పాల్సిన అనేక అంశాలను ఈ నివేదిక బయటపెట్టింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైన సర్వే కాదు. దేశంలోని 20 రాష్ట్రాల్లో సర్వే చేయగా మనస్థానం రెండుగా తేలింది.

గత పన్నెండు సంవత్సరాలుగా అవినీతి పెరుగుతోందా? తగ్గుతోందా? అన్న ప్రశ్నకు 38 శాతం ఏపీ ప్రజలు కచ్చితంగా పెరుగుతోందని బదులిచ్చారు. 58 శాతం మంది 2005 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే అవినీతిలో పెద్దగా మార్పు లేదని , అదే మాదిరిగా కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సేవలు పొందేందుకు తాము స్వయంగా లంచాలు చెల్లించామని సర్వేలో పాల్గొన్న 31 శాతం ప్రజలు ధ్రువీకరించారు. ఇదంతా ప్రజలిచ్చిన ర్యాంకు. ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న కరప్షన్ గ్రేడింగు. ముఖ్యమంత్రులు సమీక్షల్లో ఏం చెప్పినా, అధికారులు తలాడించినా క్షేత్ర స్థాయిలో సాగుతున్న వాస్తవం ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఒక ఫైలు ప్రభుత్వ కార్యాలయంలో కదలాలంటే కుర్చీ, కుర్చీకి పైసలు పడాల్సిందే. సర్కారు సేవలు పొందాలంటే మామూలు ముట్టాల్సిందే. దవాఖానలో దగ్గు మందు పొందాలన్నా ధనదాహం తీర్చాల్సిందే. పారదర్శక ప్రభుత్వం, డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ పేరిట ఎన్ని కబుర్లు చెప్పుకున్నా మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతోంది మన ప్రస్థానం. అవినీతి వైకుంఠపాళిలో ఐటీ హబ్ గా పేరుపొందిన కర్ణాటక మొదటి స్థానం, పారిశ్రామిక కేంద్రమైన తమిళనాడు మూడోస్థానం పొందగా మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వెలుగొందుతోంది. అక్షరాస్యత, ఆదాయవనరులు, అభివృద్ధి ప్రమాణాల్లో ఉత్తరభారతం కంటే అగ్రభాగాన ఉండే ఈ మూడు దక్షిణాది రాష్ట్రాలు అవినీతి త్రయంగా కూడా ముద్ర పడటం గమనించాల్సిన అంశం. అంటే అభివృద్ధికి కూడా అవినీతి మరకలంటుతున్నాయన్నమాట. ఆమ్యామ్యాలతో పనికానిచ్చేసుకుంటున్న అతి తెలివైనోళ్లకు ఇక్కడ కొదవ లేదు. వ్యవస్థను కొరికేస్తున్న అవినీతి చెదపురుగులు అసంఖ్యాకంగా పెరిగిపోతున్నాయి. ఇల్లు కట్టుకునే వారికి ఆసరాగా ఉంటుందంటూ ఇసుక ఫ్రీ అన్నారు. శాండ్ మాఫియా ఆదాయానికి చక్కని పక్కా మార్గంగా మారింది. స్పీడు పెంచుదామని ప్రాజెక్టులకు, రోడ్లకు నామినేషన్ పనులు ఇస్తుంటే పర్సంటేజీలు పెరిగి ఖజానాపై తడిసిమోపెడవుతున్నాయి. ప్రభుత్వం ఏ పని చేపట్టినా లొసుగులను వెదికి అందులోంచి తమ వాటా కొట్టేసే అవినీతి ఎలుకలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి మాత్రమే కాదు. అవినీతి కేసుల్లో విచారణలు వేగవంతం చేసి కఠినంగా శిక్షించే యంత్రాంగం కూడా ఉండాలి. ఏసీబీ వలలో అవినీతి చేప అంటూ అనేక సందర్భాల్లో మీడియాలో చూస్తుంటాం. కానీ వారిలో ఎందరికి శిక్ష పడిందన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించదు. కేసులు పెట్టిన వారిలో అత్యధికులు విచారణలోని లొసుగులు, దర్యాప్తు స్థాయిలోనే మామూళ్లు ఇచ్చి కేసును బలహీనపరుచుకోవడం ద్వారా తప్పించుకుంటున్నారనేది వాస్తవం. అంటే ఒక అవినీతి కేసును మరొక అవినీతితో కప్పి పుచ్చేస్తున్నారన్నమాట. ఈ విషవలయాన్ని ఛేదించకపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు..ప్రపంచం దృష్టిలోనే భారతదేశం పలచన కావడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*