అసలు వీళ్లు కాంగ్రెస్ నేతలేనా?

నవంబర్ 14వ తేదీ. బాలల దినోత్సవం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం. కాని ఈ విషయం మన కాంగ్రెస్ నేతలకు గుర్తులేనట్లుంది. అసెంబ్లీకి సీనియర్ నేత వి.హనుమంతరావు వచ్చి హడావిడి చేసేంత వరకూ వారు ఈవిషయాన్ని మర్చిపోయారు. నెహ్రూ జన్మదినాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని వీహెచ్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం బాలల దినోత్సవం రోజు కనీసం పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. అయితే దీనిపై అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలపక పోవడం పై వీహెచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది నెహ్రూ ఫొటో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చిందని, ఈ ఏడాది అసలు ప్రకటనే ఇవ్వలేదని వీహెచ్ మండిపడ్డారు.

చిందులు తొక్కిన వీహెచ్….

ఈ విషయాన్ని వీహెచ్ జానారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తాను సభలో ఉండి ఉంటే సభను స్థంభింప చేసేవాడినని వీహెచ్ కాంగ్రెస్ నేతలపై అసెంబ్లీ ప్రాంగణంలో చిందులేశారు. దేశ మొదటి ప్రధానిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా అవమానిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి అసెంబ్లీలో ఈవిషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమైన సంఘటనలను గుర్తుంచుకోవాలన్నారు. అయితే ఇందుకు మంత్రి కడియం శ్రీహరి సమాధానమిస్తూ బాలల దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు చెప్పగా, నిరుద్యోగంపై చర్చ ఉంది కాబట్టి, అజెండాలో లేని అంశాన్ని తెచ్చి ఎలా నిరసన తెలుపుతారని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు కోరారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ నేతలపై వీహెచ్ గరంగరంగా ఉన్నారు. తాను వచ్చి గుర్తు చేసేంత వరకూ కాంగ్రెస్ నేతలకు ఈ విషయం తెలియకపోవడంపై వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1