అస‌లు ఆట మొద‌లైందిగా?

ఏపీలో అస‌లు సిస‌లు రాజ‌కీయం ఇప్పుడే మొద‌లైందా? నిన్న మొన్న‌టి వ‌ర‌కు నివురు గ‌ప్పిన నిప్పులాగా ఉన్న బీజేపీ-టీడీపీ మ‌ధ్య బంధం ప‌టాపంచ‌లు అయిన నేప‌థ్యంలో ఒక‌పార్టీపై మ‌రొక పార్టీ క‌త్తులు దూసుకునే ప‌రిస్థితి నెల‌కొందా? ఈ క్ర‌మంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న అస్త్రశ‌స్త్రాల‌ను ప్ర‌యోగించ‌నుందా? చ‌ంద్ర‌బాబును ఇరుకున పెట్ట‌నుందా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు గ‌డ్డు ప‌రిస్థితి త‌లెత్త‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. అయితే, ఈ ప‌రిణామాలు ఏ రూపంలో ఉంటాయి? ప్ర‌త్య‌క్షంగా క‌క్ష‌సాధింపా? లేక ప‌రోక్షంగా బెదిరింపు చ‌ర్య‌లా? వంటి అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి.

చర్చలకు అవకాశం లేకపోవడంతో….

విష‌యంలోకి వెళ్తే.. ఏపీ విభ‌జ‌న హామీల అమలు స‌హా ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం అనుస‌రించిన వైఖ‌రితో విసుగెత్తి పోయిన చంద్ర‌బాబు స‌ర్కారు.. చ‌ర్చ‌లకు అవ‌కా శం లేని ప‌రిస్థితిలో చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ క్ర‌మంలోనే గ‌త నాలుగు మాసాలుగా అమీ-తుమీ, తెగ‌తెంపులే- వంటి శీర్షిక‌ల‌తో తెలుగు మీడియా కేంద్రానికి సంకేతాలను కూడా పంపింది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ ప్ర‌భుత్వం ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చీమ‌కుట్టిన‌ట్టు కూడా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఫ‌లితంగా చంద్రబాబు అనూహ్య నిర్ణ‌యం తీసుకుని ఎన్డీయే కూట‌మికి రాం రాం చెప్పారు.

జాతీయ స్థాయిలో….

అయితే, చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని ఎలా తీసుకున్నా.. న‌రేంద్ర మోడీ ప్రభుత్వానికి మాత్రం జాతీయ స్థాయిలో మ‌స‌క చీక‌ట్లు అలుముకున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదీ కాకుండా పార్ల‌మెంటులో అవిశ్వాసం ప్ర‌క‌టించ‌డం వంటి అత్యంత అరుదైన అంశాలు కూడా మోడీకి మంట పుట్టించేలాగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు మాత్రమే రాజ‌కీయంగా వ్యాఖ్య‌లు చేయ‌గా.. ఇక‌పై న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌థి అమిత్ షా వంటి వారు ఇక నుంచి తెర వెనుక నుంచే రాజ‌కీయాలు చేయొచ్చ‌ని అంటున్నారు.

యువనేత టార్గెట్ అవుతారా?

మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీ రాజ‌కీయాల్లో అస‌లు గేమ్ ఇప్పుడే మొద‌లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తే రాజ కీయంగా ఇరుకున పెడుతున్నార‌నే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి…దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసి పెట్టారని రాజకీయ వర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఓ యువనేతను టార్గెట్ చేయవచ్చని చెబుతున్నారు. క‌క్ష సాధింపు రాజ‌కీయాలు కేంద్రంలో ఏ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నప్ప‌టికీ స‌ర్వ సాధార‌ణ‌మే అయిన నేప‌థ్యంలో మోడీ కూడా దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్ప‌లేం. సో.. రాబోయేరోజుల్లో ఏపీ రాజ‌కీయాలు మ‌రింత మంట పుట్టించినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఇదే విష‌యాన్ని ఏపీ బీజేపీ నేత‌లు ఉటంకిస్తున్నారు కూడా. ఇక‌, చూడండి రాజ‌కీయాలు ఎలా ఉంటాయో? అంటూ వారు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*