ఆనంకు అదే గ్యారంటీ…!

ఆనం రామనారాయణరెడ్డి విషయాన్ని ఈరోజు వైసీపీ అధినేత జగన్ తేల్చేస్తారా? ఆనం రామనారాయణరెడ్డి రెండురోజుల క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ వద్దకు వెళ్లి మరీ ఆనం కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ నేత, బలం ఉన్న లీడర్ ఆనం రామనారాయణరెడ్డికి ఏ పదవి ఇస్తారన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ఆనం రామనారాయణరెడ్డికి సముచితమైన రీతిలో జగన్ గౌరవిస్తారన్నది ఆయన వర్గీయుల అంచనా. ఆనం రామనారాయణరెడ్డి జగన్ ను కలిసినప్పుడు కూడా తగిన రీతిలో పార్టీలో గౌరవం ఉంటుందని ఆయన చెప్పడంతో ఏ పదవి ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మేకపాటి ఫ్యామిలీదే…..

అయితే నెల్లూరు జిల్లాలో వైసీపీకి నేతలకు కొదవలేదు. మేకపాటి, కాకాణి వంటి నేతలున్నారు. ముఖ్యంగా మేకపాటి కుటుంబం వైసీపీలో గత నాలుగున్నరేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. గత ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, రెండు ఎమ్మెల్యే సీట్లు ఆ కుటుంబానికి జగన్ ఇచ్చి మేకపాటి కుటుంబమంటే తనకు ఎంత ప్రేమో జగన్ చెప్పకనే చెప్పారు. ఒక ఎంపీ సీటు, ఎమ్మెల్యేసీటు గెలుచుకున్న మేకపాటి కుటుంబం జగన్ వెంటే నడిచింది. ఇటీవల ప్రత్యేక హోదా కోసం మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా కూడా చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే.

ఆనంకు ప్రామిస్…..

ఆనం కుటుంబం చేరిక మేకపాటి ఫ్యామిలీకి సుతారమూ ఇష్టంలేదు. కాని అధికారంలోకి వచ్చేందుకు బలమున్న నేతలెవరినైనా జగన్ చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆనం వివేకానందరెడ్డి జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసినా ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఎప్పుడూ మాట తూలలేదని, అందుకే ఆయనను జగన్ పార్టీలో చేర్చుకున్నారని నెల్లూరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆనం రామనారాయణరెడ్డికి బాధ్యతలను అప్పగించే విషయంపై ఈరోజు జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

నేడు ప్రకటిస్తారా?

అయితే ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఆయన పరోక్షంగా సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలోనూ ఆనం రామనారాయణరెడ్డి కుటుంబానికి పట్టుంది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటికే మేకపాటి గౌతమ్ రెడ్డి ఉండటంతో ఆనం ముందుగానే వెంకటగిరి నియోజకవర్గం అడిగినట్లు సమాచారం. దీంతో ఈరోజు పాదయాత్ర శిబిరంలో జగన్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని సమాచారం. ఆనం పదవిపై ఈ సమాశంలోనే స్పష్టతను జగన్ ఇస్తారని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*