ఆనంకు పొగ పెట్టింది వీళ్లే….!

నెల్లూరు జిల్లా టీడీపీలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి శ‌కం ముగిసిందా? ఇక అతి త్వ‌ర‌లోనే ఆయ‌న సైకిల్ దిగిపోయే స‌మ‌యం వ‌చ్చేసిందా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి! పార్టీలో చేరిన స‌మ‌యంలో అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు అమ‌లుచేయ‌డం లేద‌ని అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఆయ‌న పార్టీ వీడుతార‌నే ప్ర‌చారం బ‌లంగా వినిపిస్తోంది. ఇదే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని భావిస్తున్నా.. ఆయ‌న పార్టీ వీడేందుకు మ‌రో బ‌లమైన కార‌ణం ఉందంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. `35 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ఇన్ని అవమానాలు పడలేదు’ అంటూనే.. ‘అధికార పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నా నా బ్యాటరీలో చార్జింగ్‌ లేదు’ అని వ్యంగ్యంగా త‌న అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు. జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రుల తీరుతో విసిగి వేశారిపోయిన ఆయ‌న‌.. చివ‌ర‌కు పార్టీని వీడే నిర్ణ‌యం తీసుకున్నార‌ని జిల్లా నాయ‌కులు స్పష్టం చేస్తున్నారు.

వైసీపీలో చేరేందుకు…..

ప్ర‌స్తుతం టీడీపీలోనే ఉన్నా.. త్వ‌ర‌లోనే భ‌విష్య‌త్ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా అంటూ.. ఆనం చెప్పిన మాట‌లు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. కాంగ్రెస్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన ఆనం సోద‌రులు.. టీడీపీలో చేరారు. ఆ స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీలు ఇచ్చారు. వాటిని నెర‌వేర్చే అవ‌కాశం వచ్చినా బాబు.. వాటిని ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి వీరిలో ఎక్క‌వ అయింది. అయితే ఆనం వివేకానంద‌రెడ్డి అనారోగ్యంతో మ‌ర‌ణించిన త‌ర్వాత‌.. రాంనారాయ‌ణ రెడ్డి భ‌విష్య‌త్‌పై సందిగ్ధం నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జోరందుకుంది. జులై మొదటి వారంలో ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని విశ్వసనీయవర్గాల సమాచారం.

మంత్రులిద్దరూ అవమానించినందునే…..

తన సీనియార్టీని స్థానిక మంత్రులు అవమానించార‌ని, తాను ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా చంద్రబాబు నియమించినప్పటికీ 2014లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నాయకుడిని మంత్రులు ప్రోత్సహిస్తున్నార‌ని రాం నారాయణరెడ్డి భావిస్తున్నార‌ట‌. అదేమిటంటే గతంలో ఓడిపోయిన నాయకుడిని ప్రోత్సహించకపోతే ఎలా అని మంత్రులు ఎదురు దాడి చేశారట‌. 35 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న త‌న‌తో ఇద్ద‌రు మంత్రుల‌ను చంద్రబాబు పోల్చుకోవడంపై ఆనం.. తన సన్నిహితుల ద‌గ్గ‌ర‌ ఆవేదన వ్యక్తం చేశార‌ట‌. ఇక్క‌డ ఉండి అవ‌మానాలు ఎదుర్కొనే కంటే.. ఇష్టం ఉన్నా లేకున్నా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యార‌ని తెలుస్తోంది. చంద్రబాబుకు తమ కుటుంబంపై అభిమానం ఉందని తెలిసినా.. టీడీపీలో మంత్రులు చేస్తున్న అవమానం పొందే కన్నా వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని రాంనారాయణరెడ్డి నిర్ణయించుకున్నారట‌.

వరుస అవమానాలతో…..

నెల్లూరు జిల్లాలో ద‌శాబ్దాలుగా ఆనం సోద‌రులు చ‌క్రం తిప్పారు. ఇప్పుడు సోద‌రుడు లేక‌పోవ‌డం… ఇటు టీడీపీలో వ‌రుస అవ‌మానాల నేప‌థ్యంలోనే ఆయ‌న పార్టీ మారేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. తనకు కోవూరు, వెంకటగిరి,నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎక్కడ నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమేనని మధ్యవర్తుల ద్వారా రాంనారాయణరెడ్డి.. జగన్‌కు వ‌ర్త‌మానం పంపిన‌ట్టు తెలుస్తోంది. అయితే అంత‌కు ముందే టీడీపీలో అసంతృప్తితో ఉన్న ఆనంకు జ‌గ‌న్ త‌న స‌న్నిహితుల ద్వారా ఆఫ‌ర్ ప్ర‌క‌టించాకే ఆనం ఈ ప్రపోజ‌ల్ పెట్టార‌ట‌.

వివేకా కుమారుడికి సయితం…..

ఇక తన అన్న కుమారుడుకు కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఆనం వివేక త‌న‌యుడు గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సొంత‌ ఓటు బ్యాంక్‌ ఉన్న ఆనం కుటుంబాన్ని పార్టీలోకి తీసుకుంటే వైసీపీ జిల్లాలో మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని… ఆనం చేరిక వల్ల పార్టీకి మేలు జరుగుతుందని భావించిన జ‌గ‌న్ ఆనం చేరికకు ఓకే చెప్పారట. 2014లో ఆనం ప్రచారం చేయకుండా మౌనంగా ఉండడం వల్లే వైసీపీకి మెజారిటీ వచ్చిందని ఆయన కష్టపడి నిత్యం ప్రచారం చేసి ఉంటే వైసీపీ అభ్యర్థి గెలవవచ్చు కానీ అంత మెజార్టీ వచ్చేది కాదని కొంత‌మంది జ‌గ‌న్‌కు చెప్పార‌ట‌. ఏదేమైనా ఆనం పార్టీ మార‌డం అయితే దాదాపు ఖ‌రారే అంటున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో వైసీపీ బలం రెట్టింపవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*