ఆయన పవర్ స్టార్…ఈయన రేటింగ్ స్టార్…!

కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల నడుమ రాజీ కుదిరింది. తన ఆత్మాగౌరావానికి భంగం కలిగించేలా పవన్ అభిమానులు మానసిక, సాంస్కృతిక,వ్యక్తిగత దాడులకు దిగుతున్నారంటూ కత్తి మహేష్ దృశ్య మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఒక్కడై నాలుగు నెలలుగా పోరాడారు. లక్షలాదిమంది పవన్ అభిమానుల్లోని వేలమంది కత్తి మహేష్ ను రకరకాలుగా బూతులు తిట్టినా విమర్శలు ఆరోపణలు చేసినా ఆయన ఏ మాత్రం జంకు లేకుండా తన వాదాన్ని కొనసాగించారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పవన్ మాత్రమే అని. ఆయన తన అభిమానులను సంయమనం పాటించాలని ఎందుకు పిలుపు ఇవ్వరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవారు. సినీ క్రిటిక్ గా పవన్ ప్రసంగాలపై విమర్శ చేయడం తప్పేలా అవుతుందని మొదలు పెట్టిన కత్తి ఎపిసోడ్ కి ఇప్పట్లో తెరపడేలా కనపడటం లేదు.

కత్తిపై దాడితో మేల్కొన్న జనసేన ….

ఒక టివి స్టూడియోలో చర్చలో పాల్గొని బయటకు వచ్చిన కత్తి మహేష్ పై కోడి గుడ్లతో ఇద్దరు పవన్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. దాంతో కత్తి ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ప్రజాస్వామ్య యుతంగా తన హక్కుల కోసం పోరాడుతుంటే ఇలాంటి దాడులు జరపడం దారుణమని పవన్ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఓయూ జేఏసీ నేతృత్వం లో పికె సినిమా ప్రదర్శనలు అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కత్తి. భావప్రకటనా స్వేచ్ఛను హరించే ఈ దాడులు సమాజంలో అందరు ఖండించాలని కోరారు. ఇక గత రెండు మూడు రోజులుగా కత్తి వెర్సెస్ పవన్ అభిమానుల వివాదం పై టివి చర్చలు పూర్తిగా దారితప్పాయి. కత్తి ప్రయివేట్ వ్యవహారాలు, అమ్మాయిలకు మెసేజ్ లు అంటూ పికె ఫ్యాన్స్ దాడి తీవ్రం చేసింది. దీనికి ప్రతిగా పవన్ గెస్ట్ హౌస్ వ్యవహారాలూ లీలలు బయట పెడతా అంటూ కత్తి ప్రతి దాడి చేయడంతో ప్రయివేట్ వ్యవహారాలపై చర్చగా మారి శృతిమించాయి. పరిస్థితి దారితప్పింది అని గ్రహించిన జనసేన డ్యామేజ్ కంట్రోల్ కు రంగంలోకి దిగింది.

అభిమానులు విమర్శలకు స్పందించకండి అంటూ …

జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా స్పందించవద్దని ఆ పార్టీ అధిష్టానం ఉపాధ్యక్షుడి పేరుతో లేఖ విడుదల చేసింది. నాలుగేళ్ల పసికూన పార్టీపై కొందరు కావాలని చేస్తున్న కుట్రలో భాగం కావొద్దని కోరింది. ఈ లేఖ పట్ల కత్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ తనకు వ్యక్తిగతంగా క్షమించాలన్న డిమాండ్ నుంచి ఆయన వెనక్కి తగ్గారు. తాను కోరుకుంటున్నది ఇదే అని తనపై కోడిగుడ్ల దాడికి పాల్పడి పోలీస్ కేసులో ఇరుక్కున్న పవన్ అభిమానులపై ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఆత్మగౌరవం కోసం తాను సాగించిన పోరాటంలో విజయం సాధించానని, ఇకపై ఎవరిపైనా ఇలాంటి చర్యలకు దిగవద్దని కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తు పాడు చేసుకోవొద్దని కత్తి విజ్ఞప్తి చేశారు.

ఇక్కడితో శుభం కార్డు పడనట్లే అంటున్న విశ్లేషకులు …

వాస్తవానికి కత్తి మహేష్ సినిమా క్రిటిక్. అంటే సినిమాలు చూసి రివ్యూలను, ఛానెల్స్ లో విశ్లేషణలు అందించడం ఆయన వృత్తి. మంచి విద్యావేత్త కూడా అయిన కత్తి మాట్లాడటంలో కానీ, న్యాయపర అంశాల్లో పౌరహక్కులు తదితర విషయాల్లో చక్కటి అవగాహనతో విశ్లేషిస్తారు. ఆయన విశ్లేషణలు విమర్శలు నచ్చి టెలివిజన్ ఛానెల్స్ కొత్త సినిమాలు విడుదల అయినప్పుడల్లా కత్తిని స్టూడియోలో చర్చలకు పిలుస్తుంటాయి. పత్రికల్లో ఆయన ఆర్టికల్స్ ప్రచురిస్తారు. అలా వివిధ చర్చల్లో కత్తి వాదన కత్తిలా ఉంటుందని గుర్తించిన ఛానెల్స్ మహేష్ ను రాజకీయ విశ్లేషణలు చేయాలని కోరడంతో కధ మొదలైంది. అదీ కొత్తగా పెట్టిన జనసేన తో కత్తి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కొంత కాలం క్రితం మొదలు పెట్టిన రాష్ట్ర పర్యటన లపై కత్తి తన మాటల తూటాల్లా పేల్చారు దాంతో పికె అభిమానుల మనస్సు గాయపడింది. వాస్తవానికి అది కత్తి వృత్తి కానీ పవన్ ను దేవుడుగా భావించే అభిమానులు ఈ విమర్శలు తట్టుకోలేక కత్తి పై ఛానెల్స్ లోను సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్ పేజీల్లో ఆయన ఫోన్ నంబర్ పెట్టి అసభ్యకర రీతిలో బూతు యుద్ధం ఆరంభించారు. ఇది కత్తి మహేష్ ఖండించారు. తక్షణం పికె ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేయాలని డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా ఆయనపై సామాజిక మాధ్యమాలు ఛానెల్స్ లో అభిమానులు మరింత దాడి చేశారు. ఇది రాను రాను చిరుజల్లుల మారి తుఫాన్ అవతారం దాల్చింది.

గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చారు…

టివి ఛానెల్స్ లో కత్తి ఎపిసోడ్ కి రేటింగ్స్ అదిరిపోయేవి. ఆ కార్యక్రమాలకు అంత రేటింగ్స్ కి కారణం లక్షల్లో వున్న పవన్ అభిమానులే. ఇలా చిలికి చిలికి గాలివానగా మారిన కత్తి ఎపిసోడ్ అనేక మలుపులు తిరిగి ఆయనపై భౌతిక దాడి జరిగే వరకు వెళ్ళి ఆగింది. ఆరంభంలోనే కత్తి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలిసిన జనసేన అనుభవలేమితో సమస్య సాగేలా చేయడం తో నిత్యం ఈ ఎపిసోడ్ డైలీ టివి సీరియల్స్ ను తలదన్నింది. మొత్తానికి కత్తి మహేష్ జనసేన నుంచి వచ్చిన తాజా ప్రకటన తో సంతృప్తి చెందినా ఆయన వృత్తే విమర్శించడం కావడంతో భవిష్యత్తు లో కూడా మరిన్ని విమర్శలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గత నాలుగు నెలలుగా ఒంటరి గా పోరాడుతున్న కత్తి వాక్చాతుర్యం అందరిని ఆకట్టుకుంది. న్యూస్ ఛానెల్స్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమంగా జనం ఈ ఎపిసోడ్ ను బాగా చూసేవారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఛానెల్స్ రేటింగ్స్ తగ్గినప్పుడల్లా ఇకపై ప్రతి పొలిటికల్ డెవలప్ మెంట్ పై కత్తి మహేష్ కి ఛానెల్స్ రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు వున్నాయి. రేటింగ్ స్టార్ గా పవన్ ఫ్యాన్స్ దయవల్ల గుర్తింపు తెచ్చుకున్న కత్తి మరింత పదును తో సినిమాలతో పాటు పాలిటిక్స్ పై విమర్శలు ఆరోపణలు చేస్తాడనేది సుస్పష్టం అవుతుంది. మరి కత్తి చేసే ఆరోపణలను ప్రజాస్వామ్య మార్గంలో తిప్పికొట్టేందుకు జన సైన్యం ఏ మేరకు సిద్ధంగా ఉంటుందో చూడాలి. జనసేన లేఖను ఎందరు అభిమానులు అనుసరిస్తారో కూడా రాబోయే రోజులే చెబుతాయి .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1