ఆయన రాకను వైసీపీలో వ్యతిరేకిస్తున్న దెవరు?

రాజకీయాల‌కు దూరంగా ఉన్న నాయ‌కులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. విభ‌జ‌న‌తో పూర్తిగా క‌నుమ‌రుగైపోయిన కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ కొన‌సాగిన నేత‌లు ఇప్పుడు రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను వెతుక్కుంటున్నారు. టీడీపీలో ఇప్ప‌టికే టికెట్ల పోటీ ఎక్కువ ఉంద‌ని భావించిన వీరు.. ఇక మిగిలిన రాజ‌కీయ పార్టీల వైపు చూస్తున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ సీనియ‌ర్ నేతను త‌మ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఇటు వైసీపీ నేత‌లు, జ‌న‌సేన నేత‌లు కూడా ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేశారు. ప్ర‌జారాజ్యంలోని పాత స్నేహాల‌ను గుర్తు చేస్తూ జ‌న‌సేన నేత‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు. అయితే ఆయ‌న మాత్రం వైసీపీలోకి వెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. తాను పోటీచేయ‌ద‌ల‌చుకున్న నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తే.. వెంట‌నే పార్టీ కండువా క‌ప్పేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

జనసేన కూడా పిలిచిందా?

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత యలమంచిలి రవి వైసీపీలో చేరతార‌నే ప్ర‌చారం కృష్ణా జిల్లాలో జోరుగా జరుగుతోంది. వైసీపీ అధినేత నుంచి టికెట్‌ ఇస్తామన్న హామీ లభిస్తే వచ్చే నెల రెండోవారంలో ఆయన వైసీపీలో చేరడం దాదాపు ఖరారైనట్లేనని రవి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు జనసేన నేతలు కూడా ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రవి.. జనసేన తరఫున బరిలో నిలిస్తే తిరిగి అదే గెలుపు పునరావృతమవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. దీంతో రవిని పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనతో వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రవి అనుచరులు మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

వైసీపీ వైపే మొగ్గు…..

రవిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు 2009లో ఆయనతోపాటు పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, వంగవీటి రాధా ప్రయత్నిస్తున్నార‌ట‌. ఆయ‌న రాక‌ను మ‌రో వైసీపీ నేత కొలుసు పార్థసారథి వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దేవినేని, యలమంచిలి కుటుంబాల నడుమ సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది. కంకిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా దేవినేని నెహ్రు, యలమంచిలి రవి తండ్రి నాగేశ్వరరావు హోరాహోరీగా తలపడేవారు. నాగేశ్వరరావు తొలి నుంచి కాంగ్రెస్ నేతగా కొనసాగుతూ వచ్చారు. టీడీపీ ఆవిర్భావంతో నెహ్రు ఆ పార్టీలో చేరి కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1983 నుంచి 1994 వరకు వరుసగా నాలుగుసార్లు గెలిచారు.

అదేస్థానం నుంచి పోటీచేయాలని….

అనంతరం రాజకీయ పరిణామాలతో నెహ్రూ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డంతో నాగేశ్వరరావు టీడీపీలోకి వచ్చారు. 1999లో కంకిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా నెహ్రూపై పోటీ చేసి చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించారు. తండ్రి మరణించిన తర్వాత రవి కూడా నెహ్రు కుటుంబంతో రాజకీయ వైరాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజా రాజ్యం పార్టీ తరఫున బరిలో నిలిచిన రవి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నెహ్రూపై 190 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన రవి రానున్న ఎన్నికల్లో అదే స్థానం నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

అయితే ఆయన వద్దంటున్నారు…

తమ కుటుంబానికి పెనమలూరు నియోజకవర్గంతోనూ అనుబంధం ఉండటంతో అక్కడి నుంచి అవకాశం కల్పించినా పోటీ చేయాలన్న ఉద్దేశంతో రవి ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే రవి రాకను పెనమలూరు వైసీపీ టికెట్‌ ఆశిస్తున్న కొలుసు పార్థసారథి వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మరోవైపు తూర్పు నియోజవకర్గం నుంచి బొప్పన భవకుమార్‌, ఎంవీఆర్‌ చౌదరి వైసీపీ టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో `‘తూర్పు` వైసీపీ రాజకీయాలు రసకందాయంగా మారాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*