ఆలస్యం…విషమయిందా?

ఏపీకి ప్ర‌త్యేక హోదా.. ఇప్ప‌డీ విష‌యం రెండు పార్టీల‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇస్తాన‌న్న క‌మ‌ల‌ద‌ళం ఇవ్వ‌లేదు.. తెస్తాన‌న్న తెలుగుత‌మ్ముళ్లు తేలేదు.. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండుమాట‌లు ప్ర‌జ‌ల‌కు ఎందుకు చెప్పాల్సి వ‌చ్చింది..? ఆయ‌నకు బీజేపీ ఇచ్చిన అంత‌ర్గ‌త హామీ ఏమిటి..? నూత‌నంగా ఏర్ప‌డిన ఏపీ బాగుప‌డాలంటే ప‌రిపాల‌న‌లో అపార అనుభ‌వం ఉన్న బాబుగారికే ప‌ట్టంక‌ట్టాల‌న్న‌న‌మ్మ‌కంతో ఓట్లు వేసిన ప్ర‌జ‌ల్ని ఆయ‌న ఎందుకు మెప్పించ‌లేక‌పోతున్నారు..? ఇప్ప‌డివే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి కోసమే….

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ క‌లిసి పోటీ చేశాయి. కేంద్ర ప్ర‌భుత్వంలో టీడీపీ, రాష్ట్ర ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామ్యం అయ్యాయి. నాలుగేళ్ల‌పాటు క‌లిసిన‌డిచాయి. అయితే నూత‌నంగా ఏర్ప‌డిన ఏపీ అభివృద్ధిబాట‌లో ప‌య‌నించాలంటే త‌ప్ప‌కుండా కేంద్రం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు బీజేపీతో జ‌త‌క‌ట్టారు. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన‌న్ని నిధుల‌ను తెప్పించుకోవ‌చ్చున‌నీ, ప్ర‌త్యేక హోదాతో ఏపీని ప్ర‌గ‌తిప‌థంలో న‌డిపించ‌వ‌చ్చున‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే ఇక్క‌డ చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో రెండు మాటలు మాట్లాడారు. నిజానికి ఆయ‌న ప్ర‌త్యేక హోదా అన్నా.. ప్ర‌త్యేక ప్యాకేజీ అన్నా ఒకే అర్థంలో మాట్లాడిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

30 సార్లు తిరిగినా….

దీనినే సాకుగా తీసుకున్న ప్ర‌తిప‌క్షాలు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్క‌ల ధోర‌ణితో ఉన్నార‌నీ, ఒక‌సారి హోదా అవ‌స‌రంలేద‌నీ, ప్యాకేజీ చాల‌నీ, ఇంకోసారి హోదా కావాల్సిందేన‌ని ఇలా.. మాట్లాడ‌డంలో ఆంతర్యం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నాయి. అయితే బాబుగారు అనుకున్న‌ట్లు కేంద్రంలోని బీజేపీ స్పందించ‌క‌పోవ‌డంతో ఇర‌కాటంలో ప‌డిపోయారు. వాస్త‌వానికి ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో చ‌ర్చించేందుకు ఆయ‌న తాజా ఢిల్లీ టూరుతో క‌లిసి 30సార్లు వెళ్లారు. కానీ, ఆయ‌న‌కు ప్ర‌ధాన‌మంత్రి అపాయింట్‌మెంట్ దొరికింది చాలా త‌క్కువ‌సార్లే.

వేచి చూడటమే…?

ఇక్క‌డే చంద్ర‌బాబు ఓపిగ్గా ఉన్నారు. ఎలాగైనా ఏపీకి కేంద్రం భారీస్థాయిలో నిధులు ఇస్తుంద‌నీ, ప్ర‌త్యేక హోదా కూడా ఇస్తుంద‌నీ ఆయ‌న వేచిచూశారు. అయితే ఆల‌స్యం అమృతం.. విషం అన్న‌చందంగా మారింది ప‌రిస్థితి. చంద్ర‌బాబు విష‌యంలో ఆల‌స్యం విషంగానే మారింది. చివ‌ర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్రం చెప్ప‌డంతో ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉద్య‌మిస్తున్నారు. ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ప‌లు పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

2 Comments on ఆలస్యం…విషమయిందా?

  1. 40 ఇయర్స్ అనుభవం ఉన్న ఒక్క పెద్ద రాజకీయ నాయకుడ్కి ఈ విషయం గురుంచి ముందే తెలియకపోవటం అనేది చాల సిగ్గుచేటు.అన్నం ఉడ్కుతుందో లేదో తెలియాలి అంటే అన్నం మొత్తం ఉడికేవరకు వెయిట్ చేయకర్లేదు.

  2. 40 ఇయర్స్ అనుభవం ఉన్న ఒక్క పెద్ద రాజకీయ నాయకుడ్కి ఈ విషయం గురుంచి ముందే తెలియకపోవటం అనేది మన దురదృష్టకరం.అన్నం ఉడ్కుతుందో లేదో తెలియాలి అంటే అన్నం మొత్తం ఉడికేవరకు వెయిట్ చేయకర్లేదు.

Leave a Reply

Your email address will not be published.


*