ఆస్తుల కోసం చిన్నమ్మ కుటుంబం…!

తమిళనాడును ఏలుదామనుకున్న శశికళ సొంత ఇంటినే చక్కదిద్దుకోలేకపోతున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత ఆమెకుటుంబంలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. శశికళకు భర్త తప్ప పిల్లలు ఎవరూ లేరు. అందరూ రక్తసంబంధీకులే. చెల్లెలు, అక్క, అన్న కుమారులే ఆమెకు ఇంతకాలం అండగా ఉంటూ వచ్చారు. అయితే శశికళ జైలుకు వెళ్లిన తర్వాత ఆకుటుంబంలో ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తినట్లు తలెత్తింది. పరప్పణ అగ్రహారంలో ఉన్న శశికళను వీరు కలిసి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో శశికళకు ఇంటిపోరు మొదలయిందన్న ప్రచారం ఊపందుకుంది.

ముగ్గురూ మూడు దారులు…

శశికళ కుటుంబంలో మొత్తం ముగ్గురు ఆమె సామ్రాజ్యాన్ని చూస్తూ వస్తున్నారు. శశికళ జైలుకు వెళ్లేముందు రాజకీయ పరమైన బాధ్యతలను దినకరన్ కు అప్పగించారు. పాలిటిక్స్ లో దినకరన్ కు అనుభవం ఉండటమే దీనికి కారణం. శశికళ మాట దినకరన్ ఆర్కేనగర్ లో గెలిచి నిలబెట్టారు. అయితే మరో వ్యక్తి వివేక్. ఈయన శశికళకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఆయన జయా టీవీని కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే శశి ఆస్తులన్నీ వివేక్ చేతుల్లోనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ అడిగినా వివేక్ పైసా విదల్చలేదట. దీంతో దినకరన్ కు చిర్రెత్తుకొచ్చి వివేక్ పై మండిపడ్డారని తెలుస్తోంది. అయితే మరో వ్యక్తి దివాకరన్. ఈయన శశికళకు దగ్గరి బంధువు. ఈయన ప్రస్తుతం అన్నింటికీ దూరంగా ఉంటూ వస్తున్నారు.

చిచ్చురేపిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక….

ఆర్కేనగర్ ఉప ఎన్నిక వీరి మధ్య చిచ్చుపెట్టినట్లు తెలిసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ముందు జయ ఆస్పత్రిలో ఉన్న వీడియోను విడుదల చేయడంపై కూడా శశికళ మండిపడ్డారని తెలిసింది. అయితే ఆమెకు నచ్చచెప్పడంతో కొంత శాంతించారట. అలాగే దినకరన్ నేరుగా వివేక్ పై శశికళకు ఫిర్యాదు చేశారు. జయ టీవీ తనకు సహకరించలేదని ఆయన చెప్పారు. కనీసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని దినకరన్ తన బాధను శశికళ ముందు వెళ్లగక్కారు. అయితే వివేక్ చిన్నవాడని చూసీ చూడనట్లు వదిలేయాలని శశికళ చెప్పారని తెలుస్తోంది. దినకరన్ ఆర్కే నగర్ లో గెలిచిన తర్వాత వివేక్, దివాకరన్ లు కనీసం శుభాకాంక్షలు చెప్పలేదంటున్నారు.

రాజకీయాల్లోకి వివేక్?

అయితే వివేక్ వాదన మరోలా ఉంది. జయ టీవీ దినకరన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తే కనీసం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే విషయంలో దినకరన్ జయ టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదట. జయ ఎప్పుడు విజయం సాధించినా ముందుగా జయా టీవీ ద్వారా ప్రజలకు సందేశం పంపేవారు. కాని దినకరన్ మాత్రం అలా చేయలేదు. పైగా జయా టీవీలో అవకతవకలు జరుగుతున్నాయని తనపై అసత్య ప్రచారం దినకరన్ చేస్తున్నారని వివేక్ ఆరోపిస్తున్నారు. తాను కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు శశికళ వద్ద తన మనసులో మాటను వివేక్ చెప్పారు. మరో కుటుంబ సభ్యుడు దివాకరన్ మాత్రం అన్నింటికీ దూరంగా ఉంటూ వస్తున్నారు. కనీసం శశికళను కలిసేందుకు కూడా దివాకరన్ ఇష్టపడటం లేదట. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదన్నది ఆయన ఆరోపణ. మొత్తం మీద చిన్నమ్మ కుటుంబంలో ఆస్తులు చిచ్చురేపాయనే చెప్పొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1