ఆ ఊరే పాలిటిక్స్ ను శాసిస్తుంది..!

రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన జిల్లాగా పేరు తెచ్చుకున్న ప్ర‌కాశం కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయంగా చైత‌న్యం కలిగిన జిల్లా. ఇక్క‌డ అనేక మంది మేధావులు రాజ‌కీయాలు చేశారు. అయితే, వీరిలో ఎక్కువ మంది టంగుటూరు ప్రాంతానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి స్థానిక నేత‌ల‌కు ప్ర‌జ‌లు జైకొడ‌తారు. అయితే, ప్ర‌కాశంలో మాత్రం టంగుటూరుకు చెందిన నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోతూ.. ప్ర‌జ‌ల్లో సామ‌ర‌స్యాన్ని పెంచేలా ఇక్క‌డి నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ముచ్చ‌టేస్తుంది. ఈ జల్లాలో మొత్తం 12 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో వెనుక‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గం కొండ‌పి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్ర‌ధాన వృత్తి వ్య‌వ‌సాయం. ప్ర‌వృత్తి రాజ‌కీయాలు.

అందరూ టంగుటూరు నుంచే…

అందుకే ఇక్క‌డ అనేక మంది నాయ‌కులు పుట్టుకొచ్చారు., అయితే, విచిత్రంగా ఈ నాయ‌కులు అంద‌రూ.. టంగుటూరు ప్రాంతానికి చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం జిల్లా టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ తూర్పునాయుడు పాలెంకి చెందిన నాయ‌కుడు. ఆయ‌న గ‌త నాలుగైదు ట‌ర్మ్‌లుగా టీడీపీ అధ్య‌క్షుడిగానే ఉంటున్నారు. అంతేకాదు, ఈయ‌న తాత‌గారి కాలం నుంచి కూడా వీరు పాలిటిక్స్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు.. గ‌తంలో కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం ఉంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అయితే, ఈయ‌న కూడా టంగుటూరు మండ‌లం తూర్పు నాయుడు పాలేనికి చెందిన వారే. ఆంజ‌నేయులు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను జిల్లా పాలిటిక్స్‌లో త‌న‌దైన స్టైల్లో చ‌క్రం తిప్పారు.

వీరిద్దరూ కూడా…

అదేవిధంగా ప్ర‌స్తుతం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన కొండ‌పి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యే డోలా బాలా శ్రీ వీరాంజ‌నేయ‌స్వామి తూర్పు నాయుడు పాలెంకు చెందిన నాయ‌కుడే కావడం మ‌రో విశేషం. అదేవిధంగా డీసీసీబీ డైరెక్ట‌ర్ దామ‌చ‌ర్ల పూర్ణ చంద్ర‌రావు తూర్పు నాయుడు పాలెంకు చెందిన వ్య‌క్తే. ఇక‌, జిల్లా టీడీపీ యువ నాయ‌కుడు దామ‌చ‌ర్ల స‌త్య తూర్పునాయుడు పాలెం నుంచి పాలిటిక్స్‌లోకి ప్ర‌వేశించారు. అంతేకాదు, జిల్లా పాలిటిక్స్‌లో దూసుకుపోతున్న యువ నాయ‌కుడుగా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు.

వైసీపీ నుంచి గెలిచిన….

ఇక‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుది టంగుటూరు. ఇక్క‌డి నుంచి ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం ప్రారంభ‌మైంది. ఆయ‌న 2004లో కొండ‌పి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత ఎమ్మెల్సీ అయ్యి….ప్ర‌స్తుతం కందుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామారావు ఆ త‌ర్వాత టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇక గ‌తంలో పోతుల రామారావు తండ్రి పోతుల చెంచయ్య జ‌డ్పీ మాజీ చైర్మ‌న్… ఆయ‌న కూడా టుంగుటూరు వాసే. ఆయ‌న అప్ప‌ట్లో జిల్లా రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక టుబాకో బోర్డు మాజీ చైర్మ‌న్ బెల్లం కోట‌య్య‌ది టంగుటూరే. కోట‌య్య త‌న‌యుడు బెల్లం జ‌యంత్ బాబు ప్ర‌స్తుత టంగుటూరు స‌ర్పంచ్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు., ఇలా మొత్తంగా ప్ర‌కాశం జిల్లాలో టంగుటూరు ప్రాంతానికి చెందిన నేత‌ల హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదీ.. ప్ర‌కాశం జిల్లాపై టంగుటూరు పొలిటిక‌ల్ ప్రభావం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*