ఆ ఐదుగురికి జగన్ స్పెషల్ ఆపరేషన్…!

వైసీపీ అధినేత జగన్ ఆ ఐదుగురిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అనేక నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సక్రమంగా పనిచేయకపోవడం, వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం ఉండటాన్ని గుర్తించిన జగన్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వాలని ఆదేశించారు. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం పక్కాగా పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తూ వస్తుంది. స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశం కల్పించడం లేదు. దీంతో జగన్ వీరిని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను, జన్మభూమిలో జరిగే తంతును వివరించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది.

జిల్లాల్లో పర్యటించాలని….

వీరిలో నగరి ఎమ్మెల్యే రోజా, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలు నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ కొన్ని జిల్లాలు తిరుగుతున్నా ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించకున్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాల్ చేస్తూనే ఉన్నారు. ఆళ్ల వేసిన పిటీషన్లు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఆళ్లను కూడా వాటిపై వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలని జగన్ కోరారు.

రోజా స్పెషల్ ఎట్రాక్షన్….

ఇక రోజాకు గ్లామర్ ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా చూసేందుకు వస్తారు. దీంతో పాటు వైసీపీ కార్యకర్తలను కూడా రోజా ఉత్సాహపరుస్తారు. ఈ నేపథ్యంలో రోజాను కూడా జిల్లాల యాత్రలు చేయాల్సిందిగా జగన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రజల్లోకి దూకుడుగా వెళ్లడంలోనూ, ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోనూ రోజా అందెవేసిన చేయి. మాటలు తూటలను కూడా పేల్చడంలో దిట్ట. అందుకోసమే ఆమెను కూడా అన్ని జిల్లాలను తిప్పాలని జగన్ భావిస్తున్నారు. ఇక కొడాలి నాని వెళితే ఒక సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించవచ్చన్నది జగన్ ఆలోచన. అందుకే నాని కూడా ఇతర నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు….

జగన్ పాదయాత్ర చేస్తున్నప్పటికీ వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోక పోవడం ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదిక ద్వారా తెలియజెప్పింది. అయితే తాను పాదయాత్రను మరో ఆరు నెలలు చేయాల్సి రావడం, ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఈ ఐదుగురిని ప్రధానంగా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. వైసీపీ గొంతుక ప్రతి నియోజకవర్గంలో విన్పించాలన్నది ఆయన భావన. లేకుంటే పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో పడే ప్రమాదముందని గ్రహించిన జగన్ సంక్రాంతి పండగ తర్వాత వీరిని జిల్లాల బాట పట్టించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1