ఆ ఐదుగురి సాహసంతోనే ఇది సాధ్యమైందా?

మతం మాటున సాగుతున్న శతాబ్దాల దుర్మార్గానికి అడ్డుకట్ట వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రక తీర్పు వెనుక కొందరు మహిళల సాహసం ఉంది. వివాదాస్పద తలాక్‌ వెసులుబాటుతో మహిళల హక్కులు హరించుకుపోవడంపై న్యాయపోరాటం చేసిన ముస్లిం మహిళల సాహసం ఉంది. ముమ్మారు తలాక్‌తో భార్యల్ని వదిలించుకనే దురాగతాన్ని సవాలు చేసిన వారి ధైర్యం ఎందరికో వెలుగులు పంచనుంది. సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం వెలువరించిన తీర్పుతో తలాక్‌కు కాలం చెల్లనుంది. చీఫ్ జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని జస్టిస్‌ కురియన్ జోసెఫ్‌., రోహింటన్‌ ఫాలీ నారిమన్‌., జస్టిస్‌ ఉదయ్ ఉమేష్‌ లలిత్‌., జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లు వేర్వేరు మతాచారాలను అవలంబించే వ్యక్తులు. అయినా తలాక్‌ తీరును తప్పుపట్టారు. చీఫ్‌ జస్టిస్‌ తలాక్‌ అంశాన్ని పార్లమెంటుకు వదిలిపెట్టాలని భావించినా మిగిలిన న్యాయమూర్తులు దానిని రద్దు చేయాలని నిర్ణయించారు.

రెండేళ్ల పోరాటం…..

ఉత్తరాఖండ్‌కు చెందిన షాయారా బానో 15ఏళ్ల కాపురం తర్వాత భర్త ముమ్మారు తలాక్‌తో ఆమెకు విడాకులు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఆమెతో పాటు మరో నలుగురు బాధిత మహిళలు కూడా ముమ్మారు తలాక్‌కు వ్యతిరేఖంగా పోరాడారు. వీరు ఐదుగురితో పాటు జాకీయా సోమన్‌ నేతృత్వంలోని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ కూడా జత కలిసింది. 2015 అక్టోబర్‌లో షాయరో బానోకు ఆమె భర్త విడాకులు ఇవ్వడంతో 36ఏళ్ల బానో 2016లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముస్లిం మహిళల హక్కులను ప్రశ్నిస్తోన్న తలాక్‌పై ఆమె న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. తలాక్‌ ఏ బిదత్‌., బహుభార్యత్వం., నిఖా హలాల విధానాలు రాజ్యంగ విరుద్ధమని బానో పేర్కొన్నారు. బానో భర్త ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకారం ఆచరణలో ఉన్న విధానాలనే తాను అనుసరించానని వాధించారు. అలహాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే బానో భర్త రిజ్వాన్‌ అహ్మద్‌., వారి ఇద్దరు పిల్లల్ని కూడా తన వెంట తీసుకువెళ్లిపోయాడు. దాదాపు ఆరుసార్లు కుటుంబసభ్యులు ఆమెకు అబార్షన్‌ చేయించడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు బానో ఫిర్యాదు చేసింది. తనకు ఇష్టం లేకున్నా తలాక్‌ ఇవ్వడంపై స్థానిక మతపెద్దను ఆశ్రయించినా అది చెల్లుతుందని అతను చెప్పడంతో సుప్రీం కోర్టు తలుపు తట్టింది.

ఇష్రాత్‌ జహాన్‌…..

సుప్రీం తీర్పు వెనుక పోరాటం సాగించిన మరో మహిళ పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఇష్రాత్‌ జహాన్‌. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆమె భర్త విడాకులు ఇచ్చేశాడు.పదిహేనేళ్ల కాపురం తర్వాత ఆమె భర్త ముర్తాజా 2015 ఏప్రిల్‌లో దుబాయ్‌ నుంచి ఫోన్‌ చేసి తలాక్‌, తలాక్‌, తలాక్‌ అని కాల్‌ పెట్టేశాడు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకున్న ముర్తాజా వారి నలుగురు పిల్లల్ని తన వెంట తీసుకెళ్లిపోయాడు. తన బిడ్డల్ని తనకు అప్పగించడంతో పాటు భరణం కోసం ఆమె న్యాయపోరాటం చేసింది. ముగ్గురు కూతుళ్లు., ఓ కొడుకుని తనకు అప్పగించడంతో పాటు తలాక్‌ను రద్దు చేయాలని ఆమె ఫిర్యాదు చేసింది.

గుల్షాన్‌ పర్వీన్……

యూపీలోని రాంపూర్‌కు చెందిన గుల్షాన్ పర్వీన్‌ తలాక్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేసింది. 2015లో పుట్టింట్లో ఉన్న ఆమె కు భర్త 10రుపాయల స్టాంపు పేపర్‌పై తలాక్‌నామా రాసి పంపాడు. అదనపు కట్నం కోసం రెండేళ్ల పాటు రాచి రంపాన పెట్టిన భర్త తలాక్‌ ఇవ్వడంతో రెండేళ్ల కొడుకుతో పాటు పర్వీన్‌ రోడ్డున పడింది. తలాక్‌ను పర్వీన్‌ అంగీకరించకపోవడంతో తలాక్‌నామా ఆధారంగా తనకు విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

అఫ్రీన్‌ రెహ్మాన్‌…..

ఓ మ్యాట్రిమొనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా 2014లో అఫ్రీన్‌ రెహ్మాన్‌కు పెళ్లి కుదిరింది. రెండు మూడు నెలల కాపురం తర్వాత ఆమె అత్తింట్లో కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. 2015 సెప్టెంబర్‌ నుంచి ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా వేధింపులు తీవ్రమయ్యాయి. వారి ఒత్తిడి తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిన వెంటనే స్పీడ్‌ పోస్టులో తలాక్ లేఖ అందింది. దీనిపై న్యాయం చేయాలంటూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అతియా సబ్రీ…..

2012లో అతియా సబ్రీ- వాజిద్‌ అలీల వివాహం జరిగింది. ఉన్నట్టుండి వాజిద్‌ చిన్న పేపర్‌పై తలాక్‌ రాసి ఆమెకు ఇచ్చేశాడు. దీనిపై 2017 జనవరిలో ఆమె తలాక్‌ను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నాలుగు., మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్ల తల్లైన అతియా సబ్రీ తన బిడ్డల్ని ఎలా పెంచాలని కోర్టును ప్రశ్నించింది. వీరితో పాటు భారతీయ ముస్లిం మహిళ ఆందోళన్‌ కూడా ముస్లిం మహిళల సమానత్వాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. స్త్రీ., పురుషులిద్దరు సమానమేనని అల్లా చెప్పారని., ఖురాన్‌లో తలాక్‌ వివరణను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగం పౌరులందరికి సమానమైన హక్కులు కల్పించినపుడు వైరుధ్యాలు ఎందుకు తలెత్తుతున్నాయని కూడా బిఎంఎంఏ ప్రశ్నించింది. వీరంతా లేవనెత్తిన ప్రశ్నలతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

  -ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1