ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు?

అన్నాడీఎంకే ఓట్లను కొత్తగా పార్టీ పెట్టిన కమల్ హాసన్, పార్టీ పెట్టబోతోన్న రజనీకాంత్ చీల్చుకుంటారు. దీంతో డీఎంకే సేఫ్ పొజిషన్ లోకి వెళుతుందా? ఇదే తమిళనాడు అంతటా చర్చ. తమిళనాడు రాజకీయాలో రోజురోజుకూ వేగంగా మారుతున్నాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రాజకీయ శూన్యత ఏర్పడిందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. అలాగే తలైవా రజనీకాంత్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఓటు బ్యాంకును వీరు కొల్లగొడతారన్న చర్చ జోరుగా సాగుతోంది.

నిన్నమొన్నటి వరకూ….

తమిళనాడులో రెండు పార్టీలదే హవా. నిన్న మొన్నటి వరకూ అన్నాడీఎంకే లేకుంటే డీఎంకే. ఇలా తమిళ ప్రజలు కూడా మార్చి మార్చి ప్రభుత్వాలను వారికే అప్పగిస్తున్నారు. గత ఎన్నికల్లో మాత్రం మళ్లీ అన్నాడీఎంకేకే పట్టం కట్టారు. అయితే జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే చీలిక పీలికలయింది. మొత్తం రెండు వర్గాలుగా విడిపోయాయి. ఇక జన్మలో కలవనంతగా వారు వేరయిపోయారు. అధికారంలో ఉండటంతో కొంత క్యాడర్ ఇంకా పార్టీని అంటిపెట్టుకునే ఉంది. శశికళ జైల్లో ఉండటం, ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు చరిష్మాలేదు. నాయకత్వ పటిమ కూడా లేదు. ఎదో అధికారం ఉండబట్టి వారి వెంట నేతలు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చెదిరిపోవడం ఖాయమన్నది గత ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనే తేలిపోయింది.

అన్నాడీఎంకే ఓట్లు చీలడం ఖాయమా?

అయితే అధికార అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చెదిరిపోతుందన్న టాక్ బలంగా నడుస్తోంది. కమల్, రజనీకాంత్ లు అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చుకుంటారన్నవాదన బలంగా విన్పిస్తోంది. అయితే ప్రతిపక్ష డీఎంకేలో కూడా కొంత భయం కన్పిస్తోంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి దాదాపు మంచానికి, కుర్చీకే పరిమితమయ్యారు. దీంతో ఆయన తనయుడు స్టాలిన్ మాత్రమే పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఏడేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు. మరో మూడేళ్లు అక్కడే ఉండాలి. ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ కమల్, రజనీ వైపు మరలి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టాలిన్ పైనే ఉంది.

ఓటు బ్యాంకును కాపాడుకుంటారా?

అందుకోసమే స్టాలిన్ అందివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమిళనాడు శాసనసభలో జయలలిత ఫొటో వివాదం దగ్గర నుంచి కావేరీ జలాల కేటాయింపుల వరకూ దేన్నివదలకుండా ప్రజాక్షేత్రంలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టాలిన్ కు మార్చి 1వ తేదీన 65 ఏళ్లు వస్తాయి. ఈ సందర్భంగా డీఎంకే రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను సిద్ధం చేసుకుంది. ఇది కూడా పార్టీ క్యాడర్ లో జోష్ నింపడంతో పాటు భరోసా నింపేందుకేనన్నది ఆ పార్టీనేతల అభిప్రాయం. కరుణానిధి నీడలోఇన్నాళ్లూ గడిపిన స్టాలిన్ క్యాడర్ ను, ఓటు బ్యాంకును ఏవిధంగా కాపాడుకుంటారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*