ఆ ఫ్యామిలీకి పొగ పెట్టేశారా?… పార్టీకి గుడ్ బై చెప్పేస్తారా?

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేగుతోంది. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. గ్రూపు రాజకీయాలకు, వర్గ పోరుకు కేరాఫ్ గా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ, ఆమె భర్త రాజేశ్వరరావును పార్టీ నుంచి పంపేందుకు కాంగ్రెస్‌ లోని ఓ వర్గం నాయకులు ప్రయత్నస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

కనీసం గౌరవం ఇవ్వకుండా…

మాజీ మేయర్, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణకు ఇటీవల అవమానాలు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు కనీస సమాచారం ఇవ్వడం లేదని అనుచరులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో దాదాపు 40 ఏళ్ల‌ అనుబంధం ఉన్నా, కష్టకాలాల్లో పార్టీని నమ్ముకొని అనేక ఆటుపోట్లకు తట్టుకొని నిలబడ్డ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దంపతులు ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ విస్తరణకు, పార్టీ కార్యకలాపాలను విజయవంతం చేసేందుకు తాము ఎంత కృషి చేసిన పార్టీ పెద్దలు తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని నేతలు ఇద్దరు మదనపడుతున్నారు.

తమను సంప్రదించకుండానే….

రాష్ట్రం మొత్తంలోనే వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తున్నారని మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఆమె భర్త కాంగ్రెస్‌ సీనియర్ నేత ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు దంపతులు ఆరోపిస్తున్నారు. తమ అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలు, కనీసం డివిజన్, వార్డు అధ్యక్షుల నియామాకాల్లోను తమను సంప్రదించడం లేదని నేతలు ఇద్దరూ తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా…..

ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇతర నేతలకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని వారు ఆవేదనకు లోనవుతున్నట్లు అనుచరులు పేర్కొంటున్నారు. పార్టీ అంతర్గత సమావేశాలు, బహిరంగ కార్యకలాపాల్లో మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా అవమానాలకు గురిచేస్తున్నారని అనుచరులు పేర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు పార్టీలో ఎందుకుండాలనే భావన ఆ నేతలిద్దరిలో మొదలైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సదరు పార్టీ నేతలు కాంగ్రెస్‌ ను వీడుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తోన్నాయి.

బస్సు యాత్ర వచ్చేలోపే….

మరోపక్క వచ్చే నెల 4,5 తేదీలలో కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించనుంది. ఈలోపే ఎర్రబెల్లి స్వర్ణ, రాజేశ్వరరావు దంపతులు ఇద్దరూ కాంగ్రెస్‌ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ స్వర్ణ దంపతులు కాంగ్రెస్‌ ను వీడితే వారి రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు వారు ఏ పార్టీలో చేరుతారనే అంశం ఆసక్తి కరంగా మారింది. వరంగల్‌ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ టీఆర్ ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోపక్క బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్వర్ణ దంపతుల పయనం ఎటువైపు ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*