ఆ ముగ్గురూ.. ముగ్గురే…!

ఎమ్మెల్యేలపై ఎందుకు వ్యతిరేకత రాదు? ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న ఎమ్మెల్యేలు ఈమధ్య కాలంలో ఎక్కువగా కనపడుతున్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోవడం మామూలైపోయింది. తాజాగా మద్యం వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకోవడమే కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మద్యం షాపుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడినట్లు ముఖ్యమంత్రికి ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా అందింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే వారిని పిలిచి మందలించినట్లు తెలిసింది. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో ఎన్నికల ఖర్చు కోసం తాము కమీషన్ల కోసం మద్యం వ్యాపారులను అడిగామని వివరణ ఇచ్చినా సీఎం అంగీకరించలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సీటు కూడా కష్టమేనని వారికి వార్నింగ్ ఇచ్చినట్లు గులాబీ పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.

మద్యం దుకాణాల యజమానులతో మీటింగ్….

తెలంగాణ ప్రభుత్వం గత నెల నుంచి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మద్యం వ్యాపారులు ఆక్షన్ లో పాల్గొనాలంటే లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత లాటరీ ద్వారా మద్యం షాపు ఎవరికి దక్కిందో నిర్ణయిస్తారు. డిపాజిట్ కూడా వెనక్కు రాదు. రెండేళ్ల పాటు ఈ లైసెన్సింగ్ విధానం ఉంటుంది. అయితే డ్రా కావడంతో కొత్తవారికి మద్యం దుకాణాలు దక్కాయి. దీంతో ఉత్సాహంగా మద్యం వ్యాపారాన్ని ప్రారంభించిన వారికి ఎమ్మెల్యేలు షాకిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని మద్యం దుకాణాల యజమానులతో ఏకంగా ఒక సమావేశమే నిర్వహించారు. లాభాల్లో వాటా కావాలని డిమాండ్ చేశారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సయితం అదే పనిచేశారు. అయితే మద్యం వ్యాపారులు మాత్రం లాభాల్లో వాటా ఎలా ఇస్తామని ప్రశ్నించారు. కావాలంటే కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించినా సదరు ఎమ్మెల్యేలు వినకపోవడంతో విషయం రచ్చకెక్కింది. ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో ఆయన వారికి క్లాస్ పీకినట్లు తెలిసింది. మద్యం వ్యాపారుల్లో కొందరు ఈ విషయాన్ని సీఎం సన్నిహితుడి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తం మీద ఈ ముగ్గురి ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1