ఆ విందుకు అంతా వాళ్లేనా…?

ఏపీలో బీజేపీతో మైత్రిని సుస్థిరం చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడ్డారు. తెలంగాణ మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందే హైదరాబాద్‌ వెళ్లి వీలైతే అమిత్‌షాతో చర్చలు జరుపుదామనుకున్న చంద్రబాబు చివరి నిమిషంలో చంద్రబాబు చర్చల కోసం సుజనాచౌదరిని పంపారు. సుజనా చౌదరి., అమిత్‌ షా ఒకే విమానంలో విజయవాడ చేరుకున్నారు. ఏపీలో 13 జిల్లాల కోసం కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు నిధుల నుంచి మంజూరు చేసిన అంబులెన్స్‌లను అమిత్‌షాతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం అమిత్‌షా కు భారీ విందునిచ్చారు. అదిరిపోయే ఆంధ్రా వంటకాలతో పాటు నాటు కోడి వేపుడు., పచ్చి వెన్న., చేపల పులుసు., ఉలవచారు., గుమ్మడికాయ వడియాలు., గుంటూరు గోంగూర., పనసకాయ బిర్యానీ., కొత్త ఆవకాయ ఇలా ఆంధ్రా స్పెషల్‌ వంటకాలన్ని డైనింగ్ టేబుల్‌ మీద ఏర్పాటు చేశారట…. బాబు ఇచ్చిన భారీ విందుకు అమిత్‌షా, సురేష్‌ ప్రభులు భుక్తాయాసంతో ఇబ్బంది పడ్డారని టీడీపీ నేతలు తెగ సంబరపడిపోయారు. ఇదంతా బాగానే ఉన్నా అమిత్‌షాకు ఇచ్చిన విందులో రెండు పార్టీలకు చెందిన దాదాపు పది మంది ప్రముఖులు హాజరయ్యారు టీడీపీ నుంచి ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు., ఆయన తనయుడు లోకేష్‌., కేంద్ర మంత్రి సుజనాచౌదరి., కళా వెంకట్రావుతో పాటు బీజేపీ నుంచి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా., కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు., రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు., కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు., మంత్రి కామినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు.

మాణిక్యాలరావును పిలవలేదే?

సీఎం నివాసంలో జరిగిన విందు భేటీలో దాదాపు పది మంది ముఖ్యులు పాల్గొంటే అందులో ఆరుగురు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు., ఇక సీనియర్లలో కేవలం యనమలకు మాత్రమే విందులో పాల్గొనే అవకాశం లభించింది. ముఖ్యమంత్రి తనయుడిగా నారా లోకేష్‌., పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు హాజరయ్యారు. బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నా కేవలం కామినేనికి మాత్రం అమిత్‌షాతో విందుకు అవకాశం దక్కింది. నిజానికి కామినేని బీజేపీలో ఉన్నారో., టీడీపీలో ఉన్నారో చాలా సార్లు గందరగోళానికి గురవాల్సి ఉంటుంది. బీజేపీ సమావేశాల్లో పార్టీ కండువా కప్పుకోవడానికి సైతం ఆయన ఇబ్బంది పడుతుంటారు. మిగిలిన నేతలంతా పార్టీ కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన సమయాల్లో కూడా ఆయన అలాంటి సాంప్రదాయాలను పెద్దగా పట్టించుకోరు. మొత్తం మీద బీజేపీ-టీడీపీల మైత్రి ఏదో కుటుంబ వ్యవహారంలా సాగిపోతోందని ఇరు పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. అమిత్‌షాతో విందుకు పాల్గొనేందుకు తాము తగిన వాళ్లం కాదా అని రుసరుసలాడుతున్నారు కొందరు టీడీపీ, బీజేపీ నేతలు.