ఇక్కడ కాంగ్రెస్ ను గట్టెక్కించేదెవరు?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహారాలను చూసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కూడా తనను ఆ బాధ్యతల నుంచి తప్పించమని సోనియాకు లేఖ రాయడంతో ఇక ఏపీలో కాంగ్రెస్ ను గట్టెక్కించేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కుదేలైపోయింది. 175 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా దానికి క్యాడర్, లీడర్ కన్పించడం లేదు. కొంతమంది నేతలున్నా వారు నామమాత్రమే అయిపోయారు. కొద్దోగోప్పో పేరున్న నేతలు వరుసగా పార్టీని వీడి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్ని కార్యక్రమాలను నిర్వహించినా ఏపీ ప్రజల నుంచి స్పందనే కన్పించడం లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో కేవలం 1374 ఓట్లు మాత్రమే జాతీయ కాంగ్రెస్ కు రావడం ఈ పరిస్థితికి అద్దంపుడుతోంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు, క్యాడర్లో మరింత నైరాశ్యం అలుముకుంది. చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నేతలు కూడా ముఖం చాటేశారు.

ఎవరూ ముందుకు రావడం లేదే?

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలే కాదు ఇతర పార్టీలు కూడా దోషులుగానే చూస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీతో జత కట్టాలని తొలుత కాంగ్రెస్ భావించినా ఆ పార్టీ దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థిితి లేదు. ఇప్పటికే నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకును వైసీీపీ ఎత్తుకెళ్లింది. దీంతో కాంగ్రెస్ ను వైసీపీ దగ్గరకు చేర్చుకునే ప్రసక్తి లేదు. ఇక కాంగ్రెస్ కమ్యునిస్టులతోనే జతకట్టాలి. ఏపీలో కమ్యునిస్టులు పరిస్థితి కూడా కాంగ్రెస్ కు భిన్నంగా లేదు. కమ్యునిస్టుల ప్రాభవం రోజురోజుకూ తగ్గిపోతుండటంతో వారిని కూడా మిగిలిన పార్టీలు దూరంగా పెడుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. కొంతకాలం క్రితం విజయవాడలో జరిగిన సభకు పవన్ కల్యాణ్ ను పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్వయంగా ఆహ్వానించినా ఆయన రాలేదు. దీంతో కాంగ్రెస్ పరిస్థిితి నానాటికీ తీసికట్టులా తయారైంది. దీంతో పాటు ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా తప్పుకుంటానని లేఖ రాయడంతో ఏపీ కాంగ్రెస్ కు షాక్ అని చెప్పొచ్చు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్, లీడర్ల కొరతతో పాటు ఆర్థిక వనరులు కూడా పెద్దగా లేకపోవడంతో జాతీయ స్థాయి నేతలు ఏపీకి ఇన్ ఛార్జిగా రావడానికి ఆసక్తి చూపడం లేదు. మొత్తం మీద ఏపీలో కాంగ్రెస్ ను గట్టెక్కించేదెవరన్న ప్రశ్న ఆ పార్టీ నేతలకే అర్ధం కాకుండా ఉంది. ఏపీని పదేళ్ల పాటు శాసించిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్థితి తలెత్తింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1