ఇక్కడ వైఎస్సార్, కాంగ్రెస్ గెలుపు దేనికి సంకేతం?

సహజంగా ఉప ఎన్నికలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక తదితర ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా ఉంటుంది. సహజంగా అధికారం చేతిలో ఉండటం వల్ల పరిస్థితులను ప్రభావితం చసే, అవసరమైతే తారుమారు చేసే శక్తి అధికార పార్టీలకు ఉంటుంది. మంత్రులను మొహరించడం, ఆర్థిక వనరులను సమకూర్చి, అవసరానికి మించి పంచడం, ప్రలోభాలు,అవసరమైతే బెదరించడం ద్వారా తమకు అనుకూలంగా ఫలితాలను అధికార పార్టీ రాబట్టుకుంటుంది. ఇది ఏ ఒక్క పార్టీకో, రాష్ట్రానికో పరిమితమైనది కాదు. అన్ని చోట్లా ఉన్నటువంటి పరిస్థితే. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకింత ఎక్కువ. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లలో వ్యతిరేకత ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు అసహాయులుగా మిగిలిపోక తప్పదు. ఇటీవల జరిగిన గుంటూరు బార్ అసోసియేషన్, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఈ రెండు ఎన్నికల్లో అధికార పార్టీలకు తలబొప్పి కట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఎదురుతన్నడం గమనార్హం.

వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థే….

గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ రెండు పార్టీలు బలపరచిన అభ్యర్థులకు ఓటర్ల మన్ననలు దక్కలేదు. సహజంగా ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగవు. అధికారిక మద్దతు ఉండదు. కానీ అనధికారికంగా అంతా పార్టీల కనుసన్నల్లోనే వ్యవహారాలు సాగుతుంటాయి. గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో విపక్ష వైసీపీ బలపర్చిన వెంకటరెడ్డి 358 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 991 ఓట్లు రాగా, అధికార తెలుగుదేశం బలపర్చిన మల్లవరపు శేఖర్ బాబుకు 632 ఓట్లు వచ్చాయి. విజేత వెంకటరెడ్డి గుంటూరు జిల్లా వైసీపీ న్యాయవిభాగం కన్వీనర్ కావడం ఇక్కడ గమనార్హం.

అధికార పార్టీ అన్ని ప్రయత్నాలూ….

శేఖర్ బాబును గెలిపించుకునేందుకు అధికార టీడీపీ చేయని ప్రయత్నం లేదు. నేరుగా జిల్లా మంత్రి నక్కా ఆనందబాబు రంగంలోకి దిగారు. వేమూరు శాసనసభ్యుడైన ఆనందబాబు స్వయంగా న్యాయవాది. గుంటూరు బార్ అసోసియేషన్ లో సభ్యుడు. ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. అధికార పార్టీ కనుసన్నల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించినా శేఖర్ బాబు ఓటమి అనివార్యం కావడం గమనార్హం. సహజంగా అధికార పార్టీ అనేక మంది న్యాయవాదులను ప్రభావితం చేసినప్పటికీ ఫలితాన్ని తెలుగుదేశం అనుకూలంగా మలచుకోలేక పోవడం కీలక పరిణామం. దీనివల్ల అధికార పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ పార్టీ శ్రేణులపై ఎంతోకొంత ప్రభావం చూపక మానదు. అంతా అనుకున్నట్లు పరిస్థితి సవ్యంగా లేదన్న సంకేతాలు పార్టీ శ్రేణుల్లోకి వెళతాయి.

తెలంగాణలో కేసీఆర్ కు దెబ్బ….

ఇక తెలంగాణలోనూ టీఆర్ఎస్ కు ఇలాంటి పరిస్థితే ఎదురయింది. హైకోర్టు బార్ అసోసియేషన్ కు మార్చి 29న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన సి. దామోదర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయనకు 760 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి పొన్నం అశోక్ గౌడ్ కు 747 ఓట్లు లభించాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో దామోదర్ రెడ్డ కేవలం 13 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ బలపర్చిన వినోద్ రెడ్డి 602 ఓట్లతో మూడో స్థానంలో ఉండటం గమనార్హం. దామోదర్ రెడ్డి పీసీసీ న్యాయవిభాగం కన్వీనర్ గా పనిచేస్తున్నారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం అయ్యారంటే న్యాయవాద వర్గాల్లో ఆ పార్టీకి గల బలం ఏపాటిదో అర్థం అవుతుంది. ఓటమికి అడ్వకేట్ జనరల్ రాజీనామా కూడా కొంత వరకూ ప్రభావితం చేసిందని న్యాయవాద వర్గాల విశ్లేషణను కొట్టిపారేయలేం. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను బహిష్కరణ విషయంలో వాదనలపై అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ప్రభుత్వంతో విభేదించి రాజీనామా చేశారు. తనకు బదులుగా ప్రభుత్వం ఢిల్లీ నుంచి హరీశ్ సాల్వేను వాదనలను విన్పించేందుకు రప్పించాలన్న నిర్ణయం ప్రకాశ్ రెడ్డిని బాధించింది. ఈ ప్రభావం ఎన్నికలపై పడిందని బార్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏజీ పదవి ఎప్పుడూ తెలంగాణకు దక్కలేదు. కొత్త రాష్ట్రం వచ్చాకే తెలంగాణ వాసికి ఈ అవకాశం లభించింది. ప్రకాష్ రెడ్డికి ఉన్న మంచిపేరు, ప్రభుత్వ తీరుపై న్యాయవాదుల అసంతృప్తి ఎన్నికల్లో పనిచేసిందని చెబుతున్నారు. ప్రభుత్వం తరుపున ఎంతమంది పెద్దలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

ఈ ఫలితాలు హెచ్చరికలేనా?

ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపైన ఎలాంటి ప్రభావాలూ చూపవు. కానీ పరిస్థితులు అనుకున్నంత సానుకూలంగా లేవన్న విషయం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. అధికార పార్టీలకు ఇవి ఒక హెచ్చరికలు లాంటివి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశం కూడా. అలా కాకుండా తేలిగ్గా తీసుకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా మరో ఏడాదిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసినా, అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*