ఇద్దరూ ఇద్దరే…..!

నాలుగు దశాబ్దాల క్రితం రెండు ఘట్టాలు.. స్వతంత్ర భారతావనిని మలుపు తిప్పాయి. ఒకటి అవినీతికి వ్యతిరేకంగా సాగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం. మరొకటి ప్రజాస్వామిక హక్కులను అణచివేసిన అత్యవసర పరిస్థితి. ఏళ్లూ పూళ్లూ గడచినా ఈ రెండూ ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఇంతింతై అవినీతి జబ్బు దేశం మొత్తం వ్యాపించింది. అప్పట్లో రాజకీయ అవినీతే పెద్దగా చర్చనీయం. ఇప్పుడు అన్నిటా అదే రాజ్యం చేస్తోంది. అప్పట్లో పౌరహక్కులను అణచివేసినందుకు ప్రభుత్వాధికారాన్నే మార్చేశారు ప్రజలు. ఇప్పుడు పౌరస్వేచ్ఛకు పైకం కడుతున్నారు. ప్రసార,ప్రచురణ మాధ్యమాలను పైసలతో లొంగదీసుకుంటున్నారు. అందుకే మరో సంపూర్ణ క్రాంతి కోసం నవ భారతం ఎదురుచూస్తోంది.

ఇద్దరిదీ ఒకే దారా… ?

దేశ చరిత్రలో అత్యున్నత స్థాయి పదవులు నిర్వహించిన వారిలో ప్రజాదరణ లెక్కిస్తే ఇందిర, మోడీలు అగ్రస్థానంలో నిలుస్తారు. స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలువెత్తు శిఖరాలుగా ఎదిగారు. కానీ ఇద్దరిలోనూ కనిపించే సామీప్యతల్లో అహంకార పూరిత నియంతృత్వ ధోరణి ఒకటి. ఇది మంచి చేస్తుందా?చెడు చేస్తుందా? అన్నవిషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అపరిమిత అధికారాలతో కూడిన పాలకులు తీసుకునే నిర్ణయాలు దేశ భావిగతినే నిర్దేశిస్తాయి. 1975 జూన్ 25 న దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇందిరాగాంధీ. దేశంలో అంతర్గత కల్లోలం పేరిట ఆమె ఈ చర్య తీసుకున్నారు. నిజానికి వ్యక్తిగతంగా ఆమె ప్రతిష్ట దిగజారి పదవిలో కొనసాగలేని పరిస్థితుల్లో దండనీతితో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకుగాను ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 15 రోజులు తిరగకుండా దేశంపై ఎమర్జెన్సీ వచ్చి పడింది. జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ క్రాంతి , గుజరాత్ లో నవనిర్మాణ్ ఆందోళన్, బిహార్ లో విద్యార్థుల అవినీతి వ్యతిరేక ఉద్యమం వంటివన్నీ విజృంభిస్తున్న దశ, దానికి తోడు న్యాయస్థానంలో ఎదురుదెబ్బలతో ఇందిర తీవ్రమైన చర్య తీసుకున్నారు. దానికి అనేకసాకులు చూపినప్పటికీ అధికారాన్ని శాశ్వతం చేసుకునే ఎత్తుగడగానే చూడాలి. ప్రజల్లో తన ఇమేజ్ కు తిరుగులేని శాశ్వతత్వాన్ని తెచ్చుకోవాలన్న దుగ్ధతో నరేంద్రమోడీ సైతం నోట్ల రద్దు వంటి ఆర్థిక ఎమర్జెన్సీని విధించే సాహసం చేశారు. 1977లో ఇందిర దాని ఫలితాన్ని అనుభవించారు. 2019లో నోట్ల రద్దు ఫలితం ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

ఖన్నా..సిన్హా…

దేశంలో న్యాయవ్యవస్థ తీరు సర్వత్రా చర్చనీయమవుతోంది. ఇప్పుడే కాదు, అప్పట్లోనూ పాలకపక్షాల అడుగులకు మడుగులొత్తే విధంగా న్యాయవ్యవస్థను చెరపట్టిన ఘట్టాలు కనిపిస్తాయి.కానీ కొందరు ఇందుకు అతీతులు. వారే న్యాయవ్యవస్థ ప్రతిష్టను పరిరక్షించారు. నియంతృత్వ రాజ్యాధికారం కొనసాగుతున్న స్థితిలో సైతం ఇందిర ఎన్నిక అక్రమాలపై స్పందించి ఎన్నికనే రద్దు చేసిన అలహాబాద్ న్యాయమూర్తి జస్టిస్ జగమోహన్ లాల్ సిన్హా జ్యుడిషియరీ ఇంటిగ్రిటీకి నిదర్శనం. న్యాయవ్యవస్థలో మెజార్టీ జడ్జిలు పాలక నిర్ణయాల ముందు తలవంచారు. కానీ ఎమర్జెన్సీ విధింపునకు దారితీసిన కారణాలపై విచారణ చేసిన సుప్రీం లో పౌరహక్కులే సర్వోన్నతమని మైనార్టీ తీర్పు చెప్పిన జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా న్యాయవ్యవస్థ ప్రమాణాలకు పట్టం గట్టారు. నూటికో కోటి కో ఒక్కరు గా ఇటువంటి వారు ఉండవచ్చు. కానీ పౌరసమాజం మొత్తాన్ని ఆలోచింపచేయగలిగారు. తాజాగా పదవీ విరమణ చేసిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఈ కోవకు చెందినవారే. సుప్రీం అధికారాలనే ఆయన ప్రశ్నించారు. తమంతతాముగా న్యాయమూర్తులను నియమించుకునే కొలీజియం చెల్లుబాటుపై మైనార్టీ తీర్పు చెప్పారు. న్యాయవ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్నించారు. కేసుల కేటాయింపులో ప్రభుత్వ అనుకూలతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధోరణినే బయటపెట్టారు. వ్యవస్థకు వన్నె తెచ్చే వ్యక్తులకు వీరు ఉదాహరణలు.

గాంధీ…జేపీ…..

అధికారమే సర్వస్వమనుకుని అక్రమాలకు పాల్పడుతూ పవర్ ను పట్టుకుని వేలాడేవారు ఎందరెందరో. అవినీతి, ఓటర్లకు లంచాలు, ప్రలోభాలు, దౌర్జన్యాల వంటి వెన్నో చేస్తూ పవర్ తెచ్చుకునే వారే రాజకీయంలో అత్యధికులు. కానీ ఇది కాదు వ్యవస్థ . ఇలా ఉండాలని నమూనా చూపించే నేతలూ ఉంటారు. వారు పవర్ లోనే ఉండక్కర్లేదు. ప్రజల హృదయాల్లో వారి స్థానం శాశ్వతం. అటువంటి రాజకీయ యోగులు కొంతమందే ఉంటారు. పవర్ చెలాయించిన వారి కంటే వారిపాత్రే పవర్ పుల్. తన చుట్టూ దేశం మొత్తం కదిలినా మహాత్మగాంధీ అదికారిక పదవులు ఎప్పుడూ కోరుకోలేదు. దేశ ప్రజలు నీరాజనాలు పట్టినా నేను అధికారానికి దూరమని తేల్చి చెప్పేశారు. జయహో జేపీ అని దేశం నినదించినా తన పరిధుల్లో ప్రజాచైతన్యానికి, పోరాటానికే పరిమితమయ్యారు జయప్రకాశ్ నారాయణ. అధికార సంకెళ్లలో పడకుండా ప్రజలకు సేవ చేయవచ్చని నిరూపించిన వీరి జీవితం దేశానికే ఆదర్శం. అత్యవసర పరిస్థితి విధించిన ఈ రోజు పాలక, న్యాయ, రాజకీయ వర్గాలలో చెడు పాత్రలు, వాటికి ప్రత్యామ్నాయ పాత్రలు రెంటినీ స్మరించుకొంటూ మరో సంపూర్ణ క్రాంతి రావాలనేది తెలుగు పోస్టు బలమైన ఆకాంక్ష.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*