ఇద్దరూ లాలూచీ పడ్డారా?

పైకే యుద్ధం లోపాయికారిగా అవగాహనా టిడిపి ,వైసిపి కేంద్రంతో అనుసరిస్తున్న వ్యూహం ఇదేనా ? అవుననే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం పెట్టె కేసులకు భయపడి అధికార టిడిపి, విపక్షం వైసిపి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు పక్షాలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షానికే ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నాయి. బహిరంగ సభల్లో కానీ ప్రెస్ మీట్లలో కానీ జరిగే తతంగం ఇదే. వాస్తవంగా వారి ఎజెండా మాత్రం అంతర్గతంగా వేరుగా ఉంటుంది.

టిటిడి పదవితో వెలుగుచూసిన బంధం …

టిడిపి ప్రధాని మోడీని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లను టార్గెట్ చేసినట్లుగా వైసిపి, జనసేన విమర్శలు ఆరోపణలు కేంద్రంపై చేయడం లేదు. ఏపీకి అన్యాయం, అధర్మం చేసింది బిజెపి నే అంటూ ఆ పార్టీని విలన్ చేసిన తెలుగుదేశం తన ఎత్తుగడల్లో ప్రధాన ప్రత్యర్థులను బాగా ఇరికించింది. వారిద్దరూ జాతీయ పార్టీతో అవగాహన తోనే తనపై కాలుదువ్వుతున్నారని వ్యూహాత్మక దాడి తీవ్రంగానే చేస్తుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ప్రకటించిన టిటిడి పాలకమండలి కమిటీ టిడిపి బిజెపి బంధాన్ని తేటతెల్లం చేసింది. ఆ కమిటీలో మహారాష్ట్ర బిజెపి ఆర్ధికమంత్రి సుధీర్ భార్య కు చోటు కల్పించి అడ్డంగా ప్రత్యర్థులకు దొరికిపోయింది. ఇదే ఇప్పుడు వైసిపికి ఆయుధంగా మారింది. కేంద్రంపై తాము లాలూచీ పడ్డామని చెబుతున్న టిడిపి ఎన్డీయే లో నుంచి బయటకు వచ్చేశామని చెబుతూ బిజెపి వారికి పదవులు ఎలా కట్టబెడుతుందని ఎక్కడకి అక్కడ నిలదీస్తుంది.

ఇచ్చిన మాట కోసం అంటూ టిడిపి ఎదురుదాడి …

వైసిపి విమర్శలపై టిడిపి ఘాటుగానే స్పందిస్తుంది. గతంలో బిజెపి తో కలిసి వున్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు పదవి కట్టబెట్టారని సర్ది చెబుతుంది. ప్రధాని మోడీ లా ఇచ్చిన మాట తమ నేత తప్పరని, కనుకే టిటిడి పాలకమండలి లో పదవి ఇచ్చామని అంటుంది. లాజికల్ గా టిడిపి వైసిపి చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూ కేంద్రంతో రాజీ పడే కేసులనుంచి భయటపడుతున్నారని ఆరోపిస్తుంది. ఇలా ఇద్దరు ఒకరిపై మరొకరు మీరు రాజీ అంటే మీరు రాజీ అని బ్లేమ్ గేమ్ తీవ్రం చేశారు.

ఎన్డీయేలోకి వచ్చేయండి …

ఇదిలా ఉంటే రెండు పార్టీలు ఎన్డీయే లోకి వచ్చేయాలని బిజెపి ఆహ్వానిస్తుంది. ఒక పక్క రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపిస్తునే బిజెపి టిడిపి, వైసీపీలను తమ ఎన్డీయే లోకి రావలనడం విచిత్ర రాజకీయ వాతావరణాన్ని సూచిస్తుంది. అలా అంటూనే ఇటీవల కేంద్రమంత్రి ఒకరు చేసిన ఈ ప్రతిపాదన తమకు సంబంధం లేదని చెప్పుకొస్తుంది. మొత్తానికి ఏపీలో ఈ అయోమయ రాజకీయాలు మరికొన్నాళ్లు నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*