ఇలా వస్తే జగన్ ను జనం విశ్వసిస్తారా?

పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో మొదలయ్యాయి. సకాలంలో, సరైన రీతిలో స్పందించి అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఇరకాటంలో పెట్టడంలో విఫలమవుతున్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మళ్లీ ప్రత్యేక హోదా పల్లవి అందుకుంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ అజెండాలో ఈ అంశం లేదు. ఎప్పుడో పురాతన జమానాలో హడావిడి చేసిన వై.ఎస్.ఆర్. కాంగ్రెసు పార్టీ అజెండాలో కూడా చాలా కాలంగా మరుగున పడిపోయింది. కానీ మళ్లీ ఇప్పుడెందుకు హడావిడి మొదలైంది? పూర్వాపరాలేమిటి? పర్యవసనాలేమిటి? ఆంతర్యమేమిటి? ఇందులో దాగి ఉన్న రాజకీయమేమిటి? అన్న అంశాలపై సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతోంది. వై.సి.పి అధినేత జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో నిర్వహించిన యువభేరీ ఇదే రాజకీయ కోణంతో ముడిపడి ఉంది. అందివచ్చిన అనేక అవకాశాలను విడిచిపెట్టిన జగన్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తోక పుచ్చుకుని ఎన్నికల గోదావరిని దాటాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే తమ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళతారని ఆరునెలల ముందు జగన్ ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్టు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాన చర్చకు తెస్తామని, లోక్ సభలో నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పుకొచ్చారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే రాజీనామాలు ఉంటాయన్నారు. కానీ పార్లమెంటులో నిరసనలు వ్యక్తం చేయలేదు. తమ అజెండాను ఆచరణలోకి తేలేదు. వై.ఎస్. రాజకీయ నిబద్ధతకు మాట తప్పను. మడమ తిప్పను అన్నమాటలు ప్రత్యక్ష నిదర్శనలు. ఆయనకు వారసత్వంగా పుట్టుకొచ్చిన పార్టీ వై.సి.పి.,తద్విరుద్ధంగా తడబాటు ప్రకటనలు, దుందుడుకు చర్యలతో క్రెడిబిలిటీ నిలుపుకోలేకపోతోంది.

వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుందా?

ప్రత్యేక హోదా విషయంలో ఎవరితోనైనా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ గంబీర ప్రకటనలు చేసిన జగన్ ఈ విషయంలో తీవ్రమైన జాప్యం చేశారు. పోరుకు బదులు కేంద్రంతో రాజీ పడిపోయినట్లుగా కూడా ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఇందుకు వై.సి.పి. అనుసరించిన ధోరణే ప్రధాన కారణం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వంటి సందర్బాల్లో ప్రతిపక్షంగా గట్టి పట్టు పట్టే అవకాశం ఉంది. మా రాష్ట్రానికి హోదా కల్పిస్తేనే మద్దతు ఇస్తామంటూ షరతులు విధించి ఉంటే వై.సి.పి. చిత్తశుద్ధి వెల్లడయ్యేది. అంతేకాకుండా స్టేటస్ అంశం జాతీయ అజెండాలో మరోసారి చర్చనీయమయ్యేది. తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్న బీజేపీ, నిలదీయలేక నీరసపడిపోయిన తెలుగుదేశం పార్టీల నిజస్వరూపం బహిరంగమయ్యేది. అధికార తెలుగుదేశంపై తీవ్రమైన ఒత్తిడికి ఆస్కారం ఏర్పడేది. బీజేపీ ద్వంద్వ వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం కలగలిసి రాజ్యసభలో పూర్వ ప్రధాని మన్మోహన్ హామీ ని చాపచుట్టేసేలా చేశాయి. ఇక్కడే విపక్షంగా వై.సి.పి. అడ్వాంటేజియస్ పాత్రలోకి వచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా టీడీపీ, బీజేపీలను దోషులుగా నిలిపేందుకు అవకాశం వచ్చింది. కానీ వై.సి.పి. ధృఢ వైఖరిని కనబరచలేక లోపాయికారీ గా మారిపోయింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా మద్దతు ప్రకటించింది. బీజేపీతో అంటకాగేందుకు అధికార పక్షమైన తెలుగుదేశంతో పోటీ పడిన ధోరణే కనిపించింది. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ఎన్నికల విషయంలో బీజేపీ నుంచి ఎటువంటి విజ్ణప్తి రాకముందే ముందస్తుగా మద్దతు ప్రకటించింది. ఇటువంటి నిర్ణయం ప్రకటించిన దేశంలోనే తొలి విపక్షంగా వై.సి.పి. ప్రధానిని కలిసిన తర్వాత బీజేపీతో దోస్తీ కట్టాలన్న తహతహ జగన్ ప్రకటనల్లో కనిపించింది. అంతకుముందు తమ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారంటూ చేసిన హడావిడి వట్టిమాటలుగా , డొల్ల వాగ్దానంగా తేలిపోయాయి. ఒక పార్టీగా రాష్ట్రప్రజల దృష్టిలో వై.సి.పి. నైతికస్థైర్యాన్ని కోల్పోయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది భావోద్వేగంగా ప్రజల్లో పాతుకు పోయింది. పార్లమెంటు ఏపీ విభజన చట్టాన్ని ఆమోదించిన సందర్భంలో ప్రస్తుత అధికారపక్షమైన బీజేపీ కూడా కీలకంగా వ్యవహరించింది. ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన స్టేట్ మెంట్ కు ప్రస్తుతం రాజ్యసభ ఛైర్మన్ అయిన వెంకయ్యనాయుడే ప్రత్యక్షసాక్షి. ప్రేరకం కూడా. అయినా ఎన్డీఏ ఆ మాటను పక్కన పెట్టేసింది. టీడీపీ, బీజేపీలు చెట్టాపట్టాలు వేసుకుని అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారాన్ని చెలాయిస్తున్నాయి. తెలివైన ఏ విపక్షమూ కూడా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలను ఇరుకునపెట్టే అవకాశాన్ని జారవిడుచుకోదు. కానీ వై.సి.పి.లో ఈ తెలివిడి కొరవడింది. కేసులకు భయపడి జగన్ మెతకవైఖరిని అవలంబిస్తున్నారనే రాజకీయ విమర్శలు ఉన్నాయి. కానీ జగన్ కు కేసులు కొత్త కాదు. పార్టీ దీర్ఘకాలం మనుగడ సాగించాలన్నా, ప్రధాన ప్రతిపక్షంగా తన ప్రాభవాన్నిచాటుకోవాలన్నా ప్రజల సెంటిమెంటు విషయంలో దూకుడుగా వెళ్లడమే మేలు చేస్తుంది. కప్పదాటు వైఖరి కీడు చేస్తుంది.

అనంతపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

అనంతపురంలో ప్రత్యేక హోదా గళం వినిపించడంపై అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవిభజన సందర్భంగా సమైక్యాంధ్ర పేరిట తొట్టతొలుత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అనంతపురమే. యువత పెద్ద ఎత్తున ఇక్కడ గళమెత్తారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతజిల్లా చిత్తూరుసహా వై.సి.పి.దే హవా. ఒక్క అనంతపురం మాత్రమే టీడీపీకి అండగా నిలిచింది. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 సీట్లు టీడీపీకి వచ్చాయి. ప్రత్యేక హోదా అంశాన్ని తన అజెండాలో పదిలంగా ఉంచుకున్న పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాపై దృష్టి సారించారు. ఇక్కడ్నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రకటించారు. అనంతపురం జిల్లాను మినహాయిస్తే కర్నూలు,కడప, చిత్తూరు జిల్లాల్లో వై.సి.పి. ఇంకా బలంగానే ఉందనేది ఆపార్టీ వర్గాల అంచనా. వీటితోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా కులపరమైన సమీకరణల ద్వారా వై.సి.పినే ఆధిక్యం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. రాయలసీమ లో పూర్తిస్థాయి పట్టు దక్కించుకోవాలంటే అనంతపురంలో బలాన్ని చాటుకోవాలి. పవన్ కల్యాణ్ ప్రత్యేక అజెండాను తాము చేజిక్కించుకుంటే యువతలో పార్టీకి ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువభేరిని ప్రత్యేక హోదా అజెండాతో అనుసంధానించి జగన్ శంఖారావం పూరించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీల రాజీనామాకు సంబంధించి చేసిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించి, టీడీపీ పై ఆధిక్యం, జనసేనను అదుపు చేయడం వంటి రాజకీయ సమీకరణలతో జగన్ ముందుకు వెళితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కమ్ వాట్ మే .. ఫలితం ఏదైనా కావచ్చు. తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఎంపీల రాజీనామాకు పూనుకుంటే పాదయాత్రలు, యువభేరీల అవసరం లేకుండానే జాతీయ అజెండాలోకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకురావచ్చు. జగన్ చిత్తశుద్ధి, విశ్వసనీయత కూడా ప్రజల్లో బలపడుతుంది. పవన్ కల్యాణ్ ను తనకు పోటీదారుగా భావించాల్సిన పరిస్థితి తప్పిపోతుంది. బీజేపీ, టీడీపీ లపై రాజకీయ చదరంగంలో పైచేయి సాధించడానికి జగన్ కు ఉన్న ఏకైక అస్త్రం అదే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*