ఈసారి వెస్ట్ లో ఎవరు బెస్ట్?

గుంటూరు పట్టణంలోకి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించింది. ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర 127వ రోజుకు చేరుకుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్ తిరుపతి రెడ్డి నగర్, హౌసింగ్ బోర్డు కాలని, మల్లారెడ్డి నగర్ నుంచి శ్రీరామ్ నగర్ వరకూ పర్యటించారు. జగన్ రాత్రికి అక్కడే బస చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ కు పట్టున్న నియోజకవర్గం. కాపు, కమ్మ, ఆర్యవైశ్య, ముస్లిం, రెడ్డి సామాజికవర్గ ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.

కాంగ్రెస్, టీడీపీలకు….

గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసి విజయం సాధించారు. ఆయన టీడీపీ అభ్యర్థి చుక్కపల్లి రమేష్ పై కేవలం మూడు వేల ఓట్ల తేడాతోనే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాలరెడ్డి విజయం సాధించారు. అంతకు ముందు నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగులను అక్కడి నుంచి తప్పించి టీడీపీ అధిష్టానం వెస్ట్ సీటును కేటాయించింది. ఈ ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల రెడ్డి, వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై దాదాపు 18 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గం కావడంతో వైఎస్ జగన్ పాదయాత్ర ఇక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

త్రిముఖ పోటీతో….

జనసేన ఈసారి ఒంటరిగా పోటీ చేయడం తమకు లాభిస్తుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ మూడో ప్లేస్ లో నిలిచినా ఓట్ల తేడా పెద్దగా లేకపోవడం వారు ఉదహరిస్తున్నారు. ఈసారి ప్రజారాజ్యం స్థానంలో జనసేన వస్తుండటంతో తమకు లాభిస్తుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్రిముఖ పోటీలో తమదే విజయం అన్న ధీమా వ్యక్తమవుతోంది. ఈసారి ఎలాగైనా వెస్ట్ సీటును చేజిక్కించుకోవాలని వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జగన్ పాదయాత్ర వెస్ట్ నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొని అధినేతకు స్వాగతం పలికాయి.

నేటి జగన్ యాత్ర షెడ్యూల్….

ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 127వ రోజుకు చేరుకుంది. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి చుట్టిగుంట, అంకమ్మనగర్, ఎత్తురోడ్ సెంటర్ మీదుగా నల్ల చెరువు వరకూ సాగుతుంది. తర్వాత మూడు బొమ్మల సెంటర్, ఫ్రూట్ మార్కెట్, జిన్నా టవర్ సెంటర్ మీదుగా కింగ్ హోటల్ వరకూ ప్రజాసంకల్ప పాదయాత్ర సాగుతుందని వైసీపీనేతలు చెప్పారు. ఇప్పటి వరకూ జగన్ 1668 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*