ఈ నేతలను మీడియా ముంచేస్తోంది…!

అటు ప్రభుత్వాన్ని , ఇటు ప్రజలను అప్రమత్తం చేసి వాస్తవిక ధోరణిలో నడిచేలా చూడాల్సిన మీడియా ప్రధాన రాజకీయపక్షాలను, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఈ విచిత్రమైన ధోరణి కారణంగా మీడియా తన విశ్వసనీయతను కోల్పోయింది. మరోవైపు వాచ్ డాగ్ పాత్రకు బదులుగా భజన బృందంగా ముద్ర వేసుకుంటోంది. గడచిన పది,పన్నెండు సంవత్సరాలుగా ప్రచార, ప్రచురణ, ప్రసార మాధ్యమాల పనితీరు నానాటికీ దిగజారుతూ వస్తోంది. అధికార పక్షాలు విమర్శనాత్మక వైఖరిని సహించలేక ప్రకటనల విషయంలో కోతలు విధిస్తూ పరోక్షంగా మీడియాను నియంత్రిస్తున్నాయి. తమ అదుపాజ్ణల్లో ఉండేలా చూసుకుంటున్నాయి. ప్రజలకు నష్టం వాటిల్లనంత వరకూ సర్కారు చర్యలను మెచ్చుకున్నా పర్వాలేదు. కానీ ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యనూ సమర్థిస్తూ ముసుగు వేసే ప్రయత్నంతో ముందుకు పోవడమే ఆక్షేపణీయమవుతోంది. తాత్కాలికంగా సంతోషం కలిగించినా వాస్తవాలను దాచి పెట్టడం వల్ల తాము మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు దీర్ఘకాలంలో చేటు తెచ్చిపెడుతోంది మీడియా. ప్రజల దృష్టి కోణంలో పనిచేస్తూ ప్రభుత్వానికి కళ్లు చెవులుగా ఉండాల్సిన మాధ్యమాలు తాబేదార్లుగా మారడంతో తందానాతాన అన్నట్లుగా మీడియా కథనాలు సాగిపోతున్నాయి. కేవలం ప్రజలకే కాదు, ఆయా ప్రభుత్వాలకూ ఈ చర్య నష్టదాయకమే. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ ఉదాత్త ఆశయాలను తుంగలో తొక్కేస్తున్న మీడియా ధోరణి తాజాగా రెండు రాష్ట్రాల్లో భూతల స్వర్గాలను ఆవిష్కరిస్తోంది. అసలు నిజాలకు పాతర వేస్తోంది.

బాబూ..పైలం…

ఈనాడు గ్రూపు పత్రికలు తొలినాటి నుంచి టీడీపీ పార్టీకి మద్దతుగా ఉన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఎన్టీరామారావు పార్టీ పెట్టి అధికారంలోకి రావడం లో ఆ పత్రిక కీలక పాత్ర పోషించింది. నాదెండ్ల పుణ్యమాని ఎన్టీయార్ పదవి కోల్పోతే ప్రజాస్వామ్య ఉద్యమం పేరిట తిరిగి పునరధికారం వచ్చే వరకూ సాగినపోరులోనూ భాగస్వామిగా నిలిచింది. 1994లో తిరిగి ఎన్టీరామారావు మరోసారి అదికారంలోకి రావడానికి కూడా అండగా నిలిచింది. అదే ఎన్టీరామారావు 1995లో పదవీచ్యుతులు కావడంలోనూ, చంద్రబాబు గద్దెనెక్కడంలోనూ ఈనాడు నిర్వహించిన పాత్రను తోసిపుచ్చలేం. అయితే ఎన్టీరామారావు అధికారంలో ఉన్న కాలంలోనూ, తొలిదశలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న కాలంలోనూ ప్రభుత్వ పరమైన లోపాలను బయటపెట్టడంలో ఈనాడు వెనకడుగు వేయలేదు. ఒక రకంగా చూస్తే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ అధికారులు, మంత్రులు , ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతాలను కూడా వెలికి తీస్తుండేది. చంద్రబాబు నాయుడిని మినహాయించి మిగిలిన వారిని ఈనాడు సహించదని పేరు కూడా తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఈనాడు కథనాలు వరంగా చెప్పుకోవాలి. ఆయా అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి, ప్రజల నుంచి మద్దతు పొందడానికి వీలయ్యేది. అయితే రెండువేల సంవత్సరం తర్వాత అదే ఈనాడు తన ధోరణిని సవరించుకోవడంతో టీడీపీ డేంజర్ లో పడిపోయింది. ప్రభుత్వం చేసే పనులకు బాకాగా మారడంతోపాటు సర్కారును సమర్థించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2004 ఎన్నికలకు ముందు సర్వే నిర్వహించి తిరిగి తెలుగుదేశమే అధికారంలోకి వస్తోందంటూ మళ్లీ చంద్రహాసం అంటూ అంచనా వేసింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలై 47 సీట్లకే పరిమితమైంది. ఇందుకు ప్రదాన కారణం మీడియాగా తన బాధ్యతను విస్మరించడమే. యాజమాన్యం ప్రబుత్వానికి మద్దతుగా నిలుస్తోందని తెలిసిన సిబ్బంది సర్వేలను సైతం తమకు నచ్చినట్లుగా మౌల్డ్ చేయడంతో పత్రిక విశ్వసనీయతే ప్రమాదంలో పడింది. ఇదే నిజమని నమ్మిన చంద్రబాబు చివరి వరకూ తానే అధికారంలోకి వస్తున్నానని భ్రమ పడి నిండా మునిగిపోయారు. 2000 సంవత్సరం నుంచే ప్రజల్లో టీడీపీ ఆదరణ కోల్పోతున్న విషయాన్ని వెల్లడిస్తూ ప్రభుత్వ లోపాలను బయటపెట్టి ఉంటే చంద్రబాబు జాగ్రత్త పడి ఉండేవారు. ప్రభువును మెప్పించాలనే ఉద్దేశంతో అంతా బాగుందన్న పిక్చర్ ఇవ్వడంతో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. తాజాగా ఈనాడుకు ఆంధ్రజ్యోతి జతకట్టింది. రాజధాని డిజైన్లు, ఊహామేయమైన లక్షల కోట్ల పెట్టుబడులు, కల్పితమైన ఒక ప్రపంచాన్ని ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నాయి. ఇదే నిజమని నమ్మి మోసపోయేంత సత్తెకాలం ఓటరు నేడు లేడు. గ్రౌండ్ లెవెల్ లో అడుగు ముందుకు పడటం లేదు. ఎన్నికల నాటికి ఈ వాస్తవం ప్రజలు గ్రహించడం ఖాయం. తాత్కాలికంగా సర్కారును సంత్రుప్తి పరిచిన ఈరెండు పత్రికలకు వాటిల్లే నష్టం కంటే టీడీపీ కి జరిగే రాజకీయ నష్టం పూడ్చలేనిదిగా మిగులుతుంది. అందువల్ల ముఖ్యమంత్రి ఇప్పటికైనా అందలం ఎక్కించే మీడియాను నమ్ముకోకుండా అసలు నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.

కేసీఆర్ కు.. కుచ్చు టోపీ..

తెలంగాణలో కూడా మీడియాలో ఇదే ధోరణి ప్రతిబింబిస్తోంది. అధికారపక్షమైన టీఆర్ఎస్ ను విమర్శించే సాహసం చేయలేకపోతోంది. ప్రభుత్వ పాలనలోని లోపాలు, నూతనంగా ఏర్పాటైన జిల్లాల అడ్మినిస్ట్రేషన్ లోని అవకతవకలు, కొత్త రాష్ట్రంలో కొండంతగా పెరిగి పోయిన అవినీతి ప్రజల్లో అసంతృప్తి బీజాలను నాటుతున్నాయి. ఇక్కడి మీడియా మాత్రం పాలకపక్షానికే గంతలు కట్టేస్తోంది. అంతా బాగుంది. అద్భుతం అన్నట్లుగా రోజువారీ అభివ్రుద్ధి నివేదికగా పత్రికలు కనిపిస్తున్నాయి. ఇది నిజం కాదు. మీడియా గతంలో మాదిరిగా ప్రజాభిప్రాయాన్నిపెద్ద ఎత్తున ప్రభావితం చేసే పరిస్థితులు నేడు లేవు. వాణిజ్య ప్రకటనలు, ఇతర రూపాల్లో మీడియా సంస్థలను ప్రభుత్వాలు సంతృప్తి పరిచి అనుకూల వార్తలు రాయించుకోవచ్చు. కానీ సోషల్ మీడియా విజృంభిస్తున్న దశలో ఒక వార్త వెనుక ప్రతి కోణమూ చర్చనీయమవుతోంది. నాకు నువ్వు, నీకు నేను అన్నట్లుగా మీడియా, సర్కారు రాజీపడి కాపురం మొదలు పెడితే ప్రజలకు కష్టకాలం తప్పదు. దీర్ఘకాలంలోఅధికార పక్షం దెబ్బతింటుంది. మీడియా తన నమ్మకాన్ని కోల్పోతుంది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకం చూడటం లేదనుకుని భ్రమిస్తే నష్టమెవరికి ? తెలివైన రాజకీయ వేత్తగా గుర్తింపు పొందిన కేసీఆర్ పట్ల మొదటి రెండేళ్లు ఆంధ్రజ్యోతి పత్రిక విమర్శ నాత్మక ధోరణితో దిశానిర్దేశం చేసింది. తాజాగా ఆ పత్రిక కూడా తన పంథా మార్చుకుని మిగిలిన పత్రికల బాట పట్టింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత నష్టం చేస్తుంది.

జగన్ … జర జాగ్రత్త…

ప్రభువును మించిన భక్తిని ప్రదర్శిస్తుంటారు అనుచరులు. ప్రత్యర్థులు చేసే చెరుపు కంటే సొంత వాళ్లు చేసే చేటు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. జగన్ పార్టీకి ఏపీలో అశేషమైన ఆదరణ ఉంది. అక్కడక్కడా లోపాలున్నాయి. లోపాల మరకలను కప్పి పుచ్చి మెరుపులను భూతద్దంలో చూపిస్తూ లార్జెర్ దేన్ లైఫ్ అన్నట్లుగా వై.సి.పి.ని ప్రొజెక్టు చేస్తూ వస్తోంది సాక్షి పత్రిక. ఇదే నిజమని మనసా,వాచా,కర్మణా నమ్ముతున్న జగన్ బోల్తా పడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు సాక్షి పత్రిక మూడుసార్లు సర్వేలు నిర్వహించింది. ప్రతి సర్వేలోనూ వై.సి.పి. గెలిచే స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతూ జగన్ లో అతివిశ్వాసానికి కారణమైంది. చివరి దశలో ఏపీలోని 175 స్థానాలకు గాను 150 స్థానాలు వై.సి.పి.కి వస్తున్నట్లుగా సాక్షి సర్వే తేల్చి చెప్పేసింది. టీడీపీ 20 నుంచి 25 స్థానాలకే పరిమితమవుతున్నట్లు కాకి లెక్కలు వేసింది. చివరికి జరిగింది అందరికీ తెలిసిందే. వై.సి.పి. 67 స్థానాలకే పరిమితమైతే, టీడీపీ సెంచరీ కొట్టేసింది. అధికారపు స్వప్నం తలకిందులైంది. ఇందులో సాక్షి పాత్ర కూడా తక్కువేం కాదు. అధినాయకుడినే తప్పుదారి పట్టించి అధికారాన్ని దూరం చేసేసింది. పార్టీ పరమైన లోపాలు, నియోజకవర్గ నాయకత్వ బలహీనతలు బయటపెట్టి మార్గదర్శకత్వం వహించి ఉంటే వై.సి.పి. అధికారానికి చేరువ అయ్యే అవకాశాలుండేవి. అందువల్ల మీడియా పార్టీలకు మేలు చేయడం కంటే పబ్బం గడుపుకోవడానికే ప్రయత్నిస్తోంది. మళ్లీ తాజాగా సాక్షి తన పాత పంథాను పునరుద్ధరించుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, తప్పిదాలను ఎండగట్టడానికి గడచిన మూడేళ్లుగా ప్రయత్నించిన సాక్షి కొంతమేరకు సక్సెస్ అయ్యింది. కొన్ని అతిశయోక్తులు, వండి వార్చిన కథనాలు ఉన్నప్పటికీ ఒక పత్రికగా తన పాత్రను పాక్షికంగానైనా సరైన మార్గంలో వినియోగించింది. జగన్ విషయం, వైకాపా కు ప్రజాదరణ వంటి అంశాలు వచ్చేటప్పటికి సాక్షి పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తోంది. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లుగా …

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*