ఈ భేటీతో సాధించిందేమీ లేదా …?

రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతుంది. ఏపీకి ఇచ్చిన హామీల్లో లోటు బడ్జెట్ కి 16 వేలకోట్ల రూపాయలు భర్తీ చేస్తామని చెప్పింది కేంద్రం. విభజన చట్టం లో సైతం ఈ అంశాన్ని పొందుపరిచారు. అయినా కానీ కేంద్రం ఇప్పటికి లోటు భర్తీ చేసేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి అయినప్పటికీ ఇప్పటివరకు గట్టిగా నిలదీయలేదు. ప్రధాని మోడీ తో భేటీ సందర్భంగా ఈ అంశాలన్నీ మరోసారి బాబు ప్రస్తావించారు కానీ ఎందుకు ఇన్నేళ్లు అయినా మిత్రపక్షానికి మొండి చెయ్యిని మోడీ చూపించారని, చట్టంలో పెట్టిన వాటికే దిక్కు మొక్కు లేకపోతే పెట్టకుండా నోటికొచ్చిన హామీల సంగతి గాలికి వదిలేసినట్లే భావించాలని గద్దించలేక వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. డిమాండ్, కమాండ్ చేయాలిసిన చోట బాబు బేరాలాడే పరిస్థితి ని ఏపీ ప్రజలు తప్పు పడుతున్నారు.

ఏది స్పష్టంగా సాధించలేదే…

ప్రధాని మోడీని ఏడాది తరువాత ఏపీ సీఎం కలబోతున్నారన్న ఆనందం వారిద్దరి కలయికతో క్లారిటీ లభిస్తుందన్న సంతోషం చంద్రబాబు మీడియా సమావేశం చూసిన తరువాత లోపల పని కాలేదన్న స్పష్టత వచ్చిందంటున్నారు విశ్లేషకులు. అమరావతి నిర్మాణంలో బాబు మరో వెయ్యి కోట్ల రూపాయలైనా బ్యాంక్ లనుంచి ఇప్పించాలని ప్రాధేయపడినట్లే చెప్పారు. ఇక రైల్వే జోన్ ఇస్తామంటున్నారని కానీ ఎప్పటిలోగా అన్నది చెప్పడం లేదన్నది సాక్షాత్తు సీఎం చెప్పుకోవాలిసి వచ్చింది. ఇక ప్రత్యేక హోదా అంశంపై మాటమార్చి ప్యాకేజీకి అంగీకరించిన ఏపీసీఎం ఆ ప్యాకేజి ఇంతవరకు అమలు కాలేదని మరోయేడాదే ఎన్నికలకు సమయం ఉన్నందున ఇబ్బందులు వస్తాయని పీఎం కి చెప్పడం హాస్యాస్పదం గా కొందరు పేర్కొంటున్నారు. నాలుగేళ్ళు గా టిడిపి, బిజెపిలు కలిసి ఏపీకి చేసింది ఇదా అని ఎన్నికల్లో ప్రజలు నిలదీస్తే ఇబ్బంది పడతామని బాబు మోడీకి విజ్ఞప్తి చేశారు తప్ప ఎందుకు ప్యాకేజి నిధులు ఇవ్వలేకపోయారని మోసం చేశారని కడిగేయలేకపోవడానికి కేసులు, సిబిఐ దాడులతో కేంద్రం ఇటీవల భయపెడుతున్న తీరుతోనే వెనక్కి తగ్గారంటున్నారు.

పోలవరం మరో ఏడాది పొడిగించిన బాబు …

2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అంటూ ప్రచారం సాగించిన చంద్రబాబు మరో ఏడాది వెనక్కి తగ్గారు. ప్రధాని మోడీతో భేటీ తరువాత పోలవరం పై బాబు ఈ విధంగా మాట్లాడటం పలు అనుమానాలకు తెరతీస్తోంది. కాఫర్ డ్యామ్ ఆలస్యం, టెండర్ల ప్రక్రియ గందరగోళం కారణంగా మరో ఏడాది తరువాత ప్రాజెక్ట్ పూర్తి అనే స్లోగన్ ఎత్తుకున్నారు చంద్రబాబు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు చేసిన సొమ్మును కలిపి చెబుతూ పోలవరానికి 12 వేలకోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు అయిందని ఏడువేల ఏడువందల కోట్ల రూపాయలు తాజాగా ఖర్చు చేస్తే కేంద్రం ఇచ్చింది సుమారు నాలుగువేలకోట్ల రూపాయలు మాత్రమే అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. త్వరితగతిన పిఎం ను నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించినా తొమ్మిదేళ్ళ గత ఉమ్మడి రాష్ట్ర సీఎం గా వున్న బాబుకి నేటి విభజిత ఎపి ముఖ్యమంత్రికి చాలా తేడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కమాండ్ చేసే స్థాయిలో వున్న సీఎం దయతలచి నాలుగు రూకలు విదల్చండి మహాప్రభో అన్న రీతిలో నేడు మారిపోయారని అంటున్నారు. పోలవరం పై నాబార్డ్ ద్వారా నిధులు ఇప్పించాలని ఏపీకి సాయం పై సైతం బ్యాంక్ లనుంచి రుణాలు ఇప్పించమనడం అంటే రాష్ట్ర ప్రజలపై రుణభారం మోపడమేనని కేంద్రమే విధిగా నిధులు చట్టప్రకారం ఇవ్వాలిసి వున్నా బాబు సాగిలపడటం చర్చనీయాంశం అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1