ఉత్తమ్ ను ఒంటరి వాడిని చేసేస్తారా?

పీసీసీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సొంతపార్టీ నుంచే తీవ్రవ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ హైకమాండ్ ముందుకు వెళ్లాలని, దూసుకెళ్లాలని లైన్ క్లియర్ చేసినా ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చేసిన వ్యాఖ్యల తర్వాత ఉత్తమ్ కు పార్టీ నేతలు సహాయ నిరాకరణ చేస్తున్నారు. కుంతియా వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ లో గ్రూపు గొడవలు ఎక్కవయి పోయాయి. నిన్న మొన్నటి వరకూ ఆయన వెన్నంటి ఉన్న నేతలు కూడా ఇప్పుడు మెల్లగా జారుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిన్నటి వరకూ ఉత్తమ్ వెంటే ఉండేవారు. ఉత్తమ్ కు అండగా నిలచేవారు. అయితే ఇటీవల కాలంలో భట్టి సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యే సంపత్ ను ప్రోత్సహిస్తుండటంతో భట్టి విక్రమార్క ఉత్తమ్ కు కొంత దూరంగా వెళ్లిపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే తనకు, ఉత్తమ్ కు మధ్య విభేదాలేవీ లేవని మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నప్పటికీ ఆయన ఉత్తమ్ పై అసంతృప్తితోనే ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

జానారెడ్డి ప్రత్యేక గ్రూపు……..

అంతేకాకుండా మల్లుభట్టి విక్రమార్క తలపెట్టిన పాదయాత్రను కూడా ఉత్తమ్ అడ్డుకుంటున్నారని మల్లు అనుచరులు అనుమానిస్తున్నారు.ఇక పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న జానారెడ్డి కూడా ఉత్తమ్ తో టచ్ మీ నాట్ గా ఉంటున్నారు. జానా కొత్త వర్గాన్ని తయారు చేసుకుంటున్నారని చెబుతున్నారు. షబ్బీర్ ఆలి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే జానా వర్గంలో చేరిపోయి ఉత్తమ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎలాగైనా పీసీసీ చీఫ్ పదవి పొందాలని జానారెడ్డి తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీ సీనియర్లు కూడా జానారెడ్డికి అండగా నిలుస్తున్నారు. ఉత్తమ్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తనకు రాహుల్ ఆశీస్సులున్నాయన్న నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం కుర్చీ కోసం తన్నులాటలు ఆగేట్లు లేవు. అధికార పార్టీని ఎదుర్కొనడంపై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ నేతలతోనే యుద్ధం చేయాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు.