ఎర్రజెండా పట్టుకుని వెళితే చేయి కాలక?

బలమైన సిద్ధాంతం ప్రాతిపదికగానే పార్టీ నిలబడుతుంది. ప్రజల్లోకి వెళుతుంది. ఎత్తుగడలు, సమీకరణలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ మూలసిద్ధాంతం ప్రతిపార్టీకి చాలా ముఖ్యం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధన, బంగారు తెలంగాణ నిర్మాణం అని ప్రవచించినా, తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం అని గర్జించినా , తృణమూల్ కాంగ్రెస్ మా, మట్టి, మానుష్ అని నినదించినా ఉద్దేశం ఒకటే ప్రజల్లో నెలకొన్న ఆలోచనలు, ఆశయాలకు ఆయా పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్న భావన కల్పించడమే. జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీ కూడా ఒక బలమైన అజెండాతో మూడు న్నర దశాబ్దాల్లో దేశంలోనే అతిపెద్ద పార్టీగా రూపుదాల్చింది. ఉమ్మడి పౌరస్మృతి, రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాలు ఆ పార్టీకి మూల సూత్రాలు. వాటిని ఎంతవరకూ ఆచరిస్తున్నారు? అమలు చేస్తున్నారు అనే అంశాలను పక్కనపెడదాం. వాటిని వదిలేశామన్న సంగతిని మాత్రం బహిరంగంగా బీజేపీ ప్రకటించడం లేదు. అంటే ఇంకా వాటికి కట్టుబడి ఉన్నట్లుగానే సానుభూతిపరులైన ఓటర్లు భావిస్తూ ఉంటారు.

క్రమేపీ క్షీణిస్తున్న కాంగ్రెస్……

లౌకికవాదం పేరు చెబుతూనే మైనారిటీ ముస్లిం వర్గాలపై అవ్యాజప్రేమ కనబరుస్తూ ఓటు బ్యాంకును సృష్టించుకున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. కాంగ్రెసు తొలి నుంచీ మధ్యేవాద పార్టీ. సందర్బాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ చాకచక్యంగా రాజకీయాలు నడుపుకుంటూ వస్తోంది. అందుకే మెజార్టీ ప్రజల మద్దతు చూరగొనగలిగింది. భిన్న సంస్కృతులు, విభన్నమతాలు, భాషలతో కూడిన దేశంలో సంతులన శక్తిగా కాంగ్రెసు నిలవగలిగింది. పాన్ ఇండియా ముద్రతోపాటు దేశవ్యాప్తంగా బలమైన క్యాడర్ కలిగిన పార్టీ అయినప్పటికీ కాంగ్రెసు ప్రాబల్యం క్షీణిస్తూ వస్తోంది. దేశ రాజకీయాలకే ఇది పెను సంక్షోభంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మైనారిటీ ల మెప్పు కోసం పరితపించే లెఫ్టిస్టు కమ్యూనిస్టులు ఒకవైపు, హిందూ మెజార్టీ వాదాన్ని నమ్ముకున్న రైటిస్టు బీజేపీ ఒక వైపు భిన్నధ్రువాలుగా నిలుస్తుంటే తులాదండంలా మధ్యేవాద కాంగ్రెసుకు ఒక క్రెడిట్ ఉండేది. స్వీయ ప్రయోజనాలతో పాటు దేశ విశాల హితం కోసం ఒక్కో సందర్భంలో మైనారిటీలు సైతం కాంగ్రెసు పార్టీకి కొమ్ము కాసేవారు. రైటిస్టు బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించడంలో అన్ని శక్తులు ఏకమయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఎవరి ఓటు బ్యాంకు వారికి ఉండేది. సందర్బాన్ని బట్టి అన్నిశక్తులు ఏకం అవుతుండేవి. ఈ పొందికలో తేడాలు చోటు చేసుకోవడంతో రెండు దశాబ్దాలుగా కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం కోల్పోతోంది.

తమకు అనుకూలంగా మార్చుకుని……

కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెసును వామపక్ష అనుకూల శక్తిగా మార్చేశాయి. దీంతో తన సొంత ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. లెఫ్ట్ కి, కాంగ్రెసుకు ఒకటే ఓటు బ్యాంకు అన్నట్లుగా మారడంతో మెజార్టీ ఓటు బ్యాంకు చేజారిపోయింది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ, కాంగ్రెసు కలిసినా హిందూ ఓటు బీజేపీ వైపు సంఘటితం కావడంతో ఘోరపరాజయం తప్పలేదు. పశ్చిమబంగ లో కాంగ్రెసు, కమ్యూనిస్టులు లోపాయి కారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఇక్కడ ఉన్న త్రుణమూల్ ఆ పార్టీలను మించి మైనారిటీ వర్గాలను ఆకట్టుకోవడం, సంత్రుప్తి పరచడంలో ముందుండటంతో వీరి ఎత్తుగడలు పారలేదు. నిన్నామొన్నటివరకూ పెద్దగా ప్రాచుర్యం లేని బీజేపీ ఇక్కడ బలమైన ఓటు బ్యాంకును సాధించగలిగింది. భవిష్యత్తులో మరింత బలోపేతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేరళలోనూ క్రమేపీ బీజేపీ ఓటింగు పెరుగుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెసు, కమ్యూనిస్టులు విడివిడిగా పోటీ చేస్తున్నా మైనారిటీ ఓటు వీరిద్దరికీ ముఖ్య వనరుగా మారింది. తెలిసో తెలియకో కాంగ్రెసు వేస్తున్న అడుగులు బీజేపీకి వరంలా మారుతున్నాయి.

గతంలో ఇలా లేదే?

గతంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్ , పీవీనరసింహారావుల సమయంలో ఇటువంటి పరిస్థితులు లేవు. దేశ సామాజిక సమీకరణలు, మతపరమైన భావనలపై వారికి సమగ్ర అవగాహన ఉంది. అందుకే మెజార్టీ వాదానికి మద్దతు ఇవ్వకపోయినా విపక్షాల వైపు ఓటర్లు సంఘటితం కాకుండా నిరోధించగలిగారు. సోనియా,రాహుల్ ల నేత్రుత్వంలో ఈ తెలివిడి కొరవడుతోంది. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ బ్యూరోక్రటిక్ ధోరణి మినహా రాజకీయపరమైన అంశాలను ప్రభావితం చేయలేకపోయారు. సోనియా కోటరీలో ప్రధాన సలహాదారులైన అహ్మద్ పటేల్ , గులాం నబీ అజాద్ వంటి వారు మైనారిటీ వర్గం వైపు పార్టీ విధానాలను మళ్లించగలిగారు. ముస్లిం మతతత్వాన్ని కలలో సైతం వ్యతిరేకించడానికి ఇష్టపడని సీతారాం ఏచూరి వంటి వామపక్ష నాయకులు కాంగ్రెసుకు దిశానిర్దేశకులుగా మారిపోయారు. వీరి చేతిలో కాంగ్రెసు అధినాయకత్వం కీలుబొమ్మగా మారిపోయింది. సోనియా, రాహుల్ ల రాజకీయ పరిణతి అంతంతమాత్రమే. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాల్లో పూర్తిగా ఆజాద్, అహ్మద్ పటేల్, ఏచూరి ని నమ్ముకోవడం కాంగ్రెసు కొంప ముంచుతోంది.

జోగి…జోగి….రాసుకుంటే….?

ఉద్యమ స్వభావం కలిగిన వామపక్షాలను కలుపుకొని పోవాలనే ఏకైక లక్ష్యంతో దీర్ఘకాలంలో పార్టీకి జరిగే నష్టాన్ని సోనియా అంచనా వేయలేకపోతున్నారు. అటు కమ్యూనిస్టు కోటలు బీటలు వారుతున్నాయి. వారి ఓటు బ్యాంకును త్రుణమూల్ వంటి పార్టీలు కొల్లగొట్టేశాయి. అందుకే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్న సామెత ఇప్పుడు కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలకు అతికినట్లు సరిపోలుతోంది. నెహ్రూ హయాంలో మెజార్టీ హిందూ ఓటింగు, ఇందిర హయాంలో సంక్షేమ పథకాల కారణంగా దళిత ఓటింగు, రాజీవ్ కాలంలో సందర్భాన్ని బట్టి మైనారిటీ ఓటింగు కాంగ్రెసుకు కలిసి వస్తుండేవి. ఇప్పుడు ఆయా వర్గాలన్నీ కాంగ్రెసును నమ్మలేని పరిస్థితి. అవ్వా పోయె, బువ్వా పోయె అన్నట్లుగా రెంటికీ చెడ్డ రేవడి గా మారింది కాంగ్రెసు పరిస్థితి. మధ్యేవాద పార్టీగా కాంగ్రెసు నిలదొక్కుకోవడం ఆ పార్టీకే కాదు దేశానికి కూడా అవసరం. కమ్యూనిస్టు- కాంగ్రెసు ముద్ర తొలగించుకోవాలి. వామపక్ష భావజాలం నుంచి బయటపడి సొంత సిద్దాంతాలను రూపొందించుకుని మెజార్టీ ఓట్లను తిరిగి తెచ్చుకునే వ్యూహం రచించుకోకపోతే కాంగ్రెసు భవిష్యత్తు అగమ్యగోచరం. భిన్నసంస్క్రుతుల భరతజాతికి అది అంధకారం.

 – ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*