ఎర్రబెల్లి తన భార్యకోసం?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుకు ఉన్నంత పలుకుబడి పలువురు మంత్రులకు కూడా లేదని అధికార టీఆర్ఎస్‌లో టాక్. ఎర్ర‌బెల్లి తెలంగాణ రాజ‌కీయాల్లో మంచి వాయిస్ ఉన్న వ్య‌క్తి కావ‌చ్చు… క‌మ్యూనిటీ ప‌రంగా కావ‌చ్చు… ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కుడు కావడం కావ‌చ్చు. కార‌ణం ఏదైనా ఎర్ర‌బెల్లిపై కేసీఆర్‌కు మంచి గురి ఉంది. పాలకుర్తికి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ను రప్పించుకుని ప్రత్యేక నిధులు మంజూరు చేయించుకున్నారు.

దయాకర్ మొదటి స్థానంలో….

సీఎం కేసీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యేల పనితీరు సర్వేలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు మొదటి స్థానంలో ఉన్నారు. మంత్రి పదవి ఇస్తానన్నా.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అడిగిన నేతగా పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎర్రబెల్లి దయాకరరావు పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకరరావు బరిలో ఉంటారనీ ప్రచారం జరుగుతోంది.

జనగామ స్థానం నుంచి….

జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిపై జ‌నాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. కేసీఆర్ స‌ర్వేల్లోనూ ఆయ‌న‌కు ప్ర‌తిసారి మైన‌స్ మార్కులే ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎర్ర‌బెల్లి జ‌న‌గామ బ‌రిలో ఉంటార‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. జనగామకు ఎర్రబెల్లి వస్తే.. మరి పాలకుర్తిలో ఎవరనే దానిపై జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయ చర్చ జరుగుతోంది. అయితే కొద్ది రోజులుగా ఎర్రబెల్లి దయాకరరావు సతీమణి ఉషాదయాకర్ రావు పేరు కూడా వినిపిస్తోంది. పాలకుర్తి నుంచి ఈసారి ఆమె పోటీ చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఉషాదయాకర్ విస్తృతంగా పర్యటించి ప్రజలకు దగ్గరవుతున్నారు.

రోజుకు ఇరవై గ్రామాల్లో….

ఓ వైపు ఎర్రబెల్లి దయాకరరావు మరోవైపు ఆయన సతీమణి ఉషాదయాకర్ రోజుకు కనీసం ఇరవై గ్రామాల్లో పర్యటించడం గమనార్హం. ఇదిలా వుండగా జిల్లా కేంద్రమైన జనగామలో టీఆర్ఎస్ నుంచి బలమైన నేత ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా పలువురు నాయకులు అంటున్నారు. అయితే జనగామ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అటు ప్రజల్లో, ఇటు క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం వల్లే ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనగామకు ఎర్రబెల్లిని రప్పించి, పాలకుర్తి నుంచి ఉషా దయాకర్ కు అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి కోరిక నెరవేరదేమో….

ఇక ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌విపై కోరిక ఉంది. ఆ కోరిక‌తోనే ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఎర్ర‌బెల్లిది, కేసీఆర్‌ది వెల‌మ సామాజిక‌వ‌ర్గ‌మే. ఇప్ప‌టికే ఈ సామాజిక‌వ‌ర్గం నుంచి కేసీఆర్‌, జూప‌ల్లి, కేటీఆర్‌, హ‌రీశ్ మంత్రులుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఎర్ర‌బెల్లి మంత్రి ప‌ద‌వి ఆశించినా ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం క‌ష్టం. ఇవ‌న్నీ ఊహించే ఎర్ర‌బెల్లి ముందుగా రెండు అసెంబ్లీ సీట్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*