ఎర్ర‌బెల్లికి నొప్పి లేకుండా కొండా బుల్లెట్ దింపుతారా…!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొద్ది కాలంగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం వేగంగా విస్తరించి కార్యకలాపాలు చేపడుతోంది. మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తోంది. ఈ సంఘం విస్తరణతో జిల్లా గులాబీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ సంఘం వెనక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? అసలు పెట్టుబడి పెట్టేది ఎవరు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే విస్తృతంగా కమిటీల ఏర్పాటు ఇస్తున్న సంకేతాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, చల్లా ధర్మా రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తించకుండా….

గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తి నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకరరావు పోటీ చేసి గెలిచారు. వీరిలో ధ‌ర్మారెడ్డికి మంచి మెజార్టీయే రాగా ఎర్ర‌బెల్లి మాత్రం ముక్కోణ‌పు పోటీలో స్వ‌ల్ప ఓట్ల తేడాతోనే విజ‌యం సాధించారు. అనంతరం వీరిద్ద‌రు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ మండల, గ్రామ స్థాయి పదవులన్నీ కూడా వారితోపాటు వచ్చిన టీడీపీ నాయకులకే కట్టబెట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులను, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిని కనీసం గుర్తించకుండా పక్కన పెట్టేశారు.

ఉద్యమకారుల సంఘం ఆవిర్భావంతో….

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పడింది. ఇందులో మెజారిటీగా మొదటి నుంచి టీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పైకి తాము కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నా… లోపల మాత్రం ఆ నాయకుల లక్ష్యం వేరే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, చల్లా ధర్మారెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు ఎక్కువగా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో దృష్టి సారిస్తున్నారు.

వాళ్లు కొండా శిష్యులేనా…?

ఇటీవల దేవరుప్పుల తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులను ఎర్రబెల్లి దయాకరరావు పిలిపించి మట్లాడడం గమనార్హం. ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పుకోవాలని, ఇలాంటి సంఘాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని పరోక్షంగా వారిని ఎర్రబెల్లి దయాకరరావు మందలించినట్లు సమాచారం. ఇదిలా వుండగా తెలంగాణ ఉద్యమకారుల సంఘం కీలక నాయకుడు ఎమ్మెల్సీ కొండా మురళి శిష్యుడని, కొండా దంపతులే ఎర్రబెల్లిని టార్గెట్ చేసి, సంఘాన్ని నడిపిస్తున్నారని పలువురు నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ఎత్తుకు పై ఎత్తులు…..

కొండా దంపతులు ఇంత సైలెంట్‌గా ఈ ప‌ని చేయ‌డం వెన‌క వారు ఎర్ర‌బెల్లి, ధ‌ర్మారెడ్డిని టార్గెట్ చేయ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఎర్ర‌బెల్లికి కొండా దంప‌తుల‌కు జిల్లాలో రెండు ద‌శాబ్దాలుగా వైరం ఉంది. వీరిద్ద‌రు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా క‌త్తులు నూరుకుంటున్నారు. తూర్పులో కొండాకు ఎర్త్ పెట్టేందుకు ఎర్ర‌బెల్లి త‌న సోద‌రుడు ప్ర‌దీప్‌రావును ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇక త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌లో ధ‌ర్మారెడ్డి పాగా వేయ‌డంతో ఆయ‌న‌కు కూడా ఎర్త్ పెట్టేందుకే కొండా దంప‌తులు తెర‌వెన‌క ఉండి ఈ తంతు న‌డుపుతున్నార‌న్న ప్ర‌చారం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*