ఎవరి వ్యూహాలు వారివే….!

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో పైచేయి ఎవరిదన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక హోదా గోదాలో దిగిన ఈ రెండు పార్టీలూ ఇప్పుడు సెంటిమెంట్ ను మరొకసారి ప్రజల్లో రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నాలుగేళ్లు తలాడించిన టీడీపీ ఇప్పుడు అడ్డంగా తలూపడానికి కారణం ఎన్నికలే అని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే ముద్దంటూ చెప్పిన చంద్రబాబు ప్యాకేజీ నిధులు కూడా సరిగా ఇవ్వడం లేదని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్లనే రాష్ట్రా భివృద్ధి జరగడం లేదంటున్నారు.

జగన్ ఇప్పటికే…..

చంద్రబాబు తెలివైన ఫక్తు రాజకీయ నాయకుడు. ఎక్కడ తగ్గాలో… ఎక్కడ నెగ్గాలో చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదు. గత పధ్నాలుగు రోజుల నుంచి ఏపీలో జరగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు, జగన్ లు దాదాపుగా యుద్ధానికి సిద్ధమయినట్లే కన్పిస్తోంది. మార్చి నుంచి ఇక వార్ జరగనుందని చెప్పక తప్పదు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన కార్యాచరణను ప్రకటించేశారు. మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 3వ తేదీన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాదయాత్ర, మార్చి 5వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ఆందోళన ఉధృతం చేయాలని నిశ్చయించిన జగన్ ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం లేదంటున్నారు. చిట్టచివరి అస్త్రంగా ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలన్నది జగన్ అభిప్రాయం.

ఎన్నికలకు ముందు తెగదెంపులేనా?

మరోవైపు చంద్రబాబు కూడా సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికల వరకూ కొంత ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను, సంస్థలను రాబట్టుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఎన్నికలకు ముందే విశాఖ రైల్వే జోన్, మిగిలిన హామీలు అమలయ్యేలా చూడాలని ఆయన గట్టిగా కేంద్రమంత్రులిద్దరైన సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు చెప్పారు. ఎంపీలకు కూడా ప్రతిరోజూ కేంద్రమంత్రులను కలసి ఫాలో అప్ చేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే చంద్రబాబు దాదాపు సిద్ధమయినట్లు సమాచారం. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీ ప్రజలు ఇప్పటికే బీజేపీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంత అంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను మించి బీజేపీ ఏపీలో వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నది వాస్తవం ఈ పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీతో వెళ్లే సాహసం చేయరన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మొత్తం మీద ఇరు పార్టీల నేతలు పైచేయి సాధించడానికి ఎవరు వ్యూహాలు వారు పన్నుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1