ఎవరు ఉంటారో…? ఎవరు వెళతారో…?

కురువృద్ధుల్‌.. కురువృద్ధ బంధువుల్‌తో నిండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ర‌క్తానికి చోటు ద‌క్కుతోందా ? అధికార టీఆర్ ఎస్‌కు, ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టేలా రాజ‌కీయాలు ఊపందుకున్నాయా ? ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌క్షాళ‌న కూడా జ‌రుగుతోందా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. టీ కాంగ్రెస్‌లో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు జ‌రుగుతున్న‌ట్టుగా వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ధ్యేయంగా అడుగులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటవుతున్నాయి.

కొత్త వారికి బాధ్యతలు….

పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర‌స్తుతం పార్టీలో నెల‌కొన్న‌ నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేప‌డుతున్న‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారన్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయట‌! రాజ‌కీయ దిగ్గ‌జం కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డిని సీడబ్ల్యూసీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్రంలో యువరక్తమే…

కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్‌రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్‌ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు(వీహెచ్‌), మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. దీనిద్వారా తెలంగాణ‌లో కురువృద్దులుగా ఉన్న వీరిని జాతీయ రాజ‌కీయాల‌కు ప‌రిమితం చేసి.. రాష్ట్రంలోయువ ర‌క్తం నింపుతార‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా యువ‌కులు, ఉత్సాహ వంతులు అయితేనే కేసీఆర్‌, కేటీఆర్ వంటివారికి ధీటుగా స‌మాధానం చెబుతార‌ని భావిస్తున్నార‌ట‌.

కోమటిరెడ్డికి కీలక పదవి…?

ఈ నేప‌థ్యంలో రాష్ట్రస్థాయిలో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలని భావిస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన ప‌ద‌విని అప్ప‌గించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం కూడా జ‌రిగిపోయింద‌ని సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో అత్యున్న‌త ప‌ద‌విని ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని టాక్‌. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతోంద‌ని తెలుస్తోంది. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ను మ‌ట్టి క‌రిపించ‌డం ద్వారా అధికారం ద‌క్కించుకోవాల‌ని హ‌స్తం పార్టీ పెద్ద‌లు పావులు క‌దుపుతున్నార‌ట‌. మ‌రి ఎంత మేర‌కు విజ‌యం సాధిస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*