ఎవరు నాయకన్….?

తమిళనాడులో ఇప్పుడు కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఛరిష్మా ఉన్న నేతలు కాలం చేశాక రెండు పార్టీల్లోనూ ప్రజాదరణ గల నేతలు ఎవరు? ఈ ప్రశ్న అందరినీ వేదిస్తుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత ఆ పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ వారు ఒకప్పుడు అమ్మచాటు బొమ్మలే. స్వయంప్రకాశం లేనివారే. పార్టీని సమర్థవంతంగా నడపడంలోనూ, తమిళులను ఆకట్టుకోవడంలోనూ వీరిద్దరి వల్లా కాదన్నది అందరూ అంగీకరిస్తున్నదే. అధికారం ఉంది కాబట్టి మరో మూడున్నరేళ్లు పవర్ లో ఉండగలరేమో…. మరి ఆ…తర్వాత…. ఈ ప్రశ్నకు అన్నాడీఎంకే నేతల వద్దా సమాధానం దొరకడం లేదు.

కరుణ మరణంతో…..

ఇక తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి మరణించారు. ఆయన మరణం తర్వాత ఆ పార్టీ కూడా అన్నాడీఎంకే తరహాలోనే తయారవుతుందని వ్యాఖ్యలు ఉన్నాయి. కరుణ ఉన్నంత వరకూ ఆ పార్టీకి తిరుగులేదు. అనేక ఎన్నికల్లో ఓటమి చెందినా కరుణ ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకురాగలిగారు. కాని ఇప్పుడు డీఎంకే అధినేతగా ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ పదవీ పగ్గాలు చేపట్టనున్నారు. స్టాలిన్ కు పార్టీ నేతలు, క్యాడర్ తో దాదాపు నాలుగుదశాబ్దాల నుంచి అనుబంధం ఉన్నప్పటికీ స్టాలిన్ జనాకర్షక నేత కాదన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే. మరోవైపు కుటుంబంలో చిచ్చు ఏ క్షణాన్నైనా రేగొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కూడా వచ్చే ఎన్నికలలో గట్టెక్కడం కష్టమే. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే కనీస పోటీ ఇవ్వకపోవడాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

కమల్ నిలకడలేని……

ఇప్పుడు తమిళనాడులో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వారే భవిష్యత్తులో తమిళనాడును ఏలే అవకాశముందన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. కమల్ సీరియస్ గా రాజకీయాల్లోకి వచ్చారా? లేక పార్ట్ టైంగా వచ్చారా? అన్నది ఇంకా తేలలేదు. ఒక ఎన్నికలో మక్కల్ నీది మయ్యమ్ పోటీ చేస్తే తప్ప కమల్ విశ్వరూపం బయపడదు. కమల్ నిలకడలేని స్వభావి అన్నది అందరూ చెబుతోంది. ఏ నిమిషానికి ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదంటారు. అలాంటి కమల్ ఇటు లెఫ్ట్ పార్టీలతోనూ, అటు కాంగ్రెస్ తోనూ కరచాలనం చేస్తున్నారు. ఇలా కమల్ పార్టీ పెట్టిన నాటి నుంచే ఇతర పార్టీల వైపు చూస్తుండటాన్ని బట్టి నాయకుడిగా ఎదుగుతారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

రజనీకే ఛాన్స్ ఉందా?

ఇక అందరి దృష్టీ రజనీకాంత్ పైనే ఉంది. రజనీకాంత్ సినిమాల్లో నెంబర్ వన్ అన్నది ఎవరూ కాదనలేరు. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తానని ఇటీవలే ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదుపైనే ఆయన దృష్టంతా ఉంది. హడావిడిగా పరుగులు పెట్టడం కంటే, నిదానంగా అడుగులువేయడమే మంచిదని రజనీ భావిస్తున్నారు. రజనీకాంత్ కు రాజకీయ అనుభవం లేకపోయినా, ఆయనకున్న ఛరిష్మాతో తమిళ ప్రజల మనస్సులను గెలుచుకుంటారంటున్నారు. అయితే ఒంటరిగా బరిలోకి దిగితేనే ఇది సాధ్యమంటున్నారు. బీజేపీతో లోపాయికారీ చేతులు కలిపినా రజనీకాంత్ పార్టీకి ఆదిలోనే తమిళులు చుక్కలు చూపిస్తారనడంలో అతిశయోక్తి లేదు. తమిళనాడులో ఇద్దరు మహానేతల మరణం తర్వాత నాయకన్ కోసం ప్రజలు ఎదురు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*