ఏపీకి సొంతంగా అమరావతి ఎయిర్‌లైన్స్‌

ఏపీ ప్రభుత్వం తరపున సొంత ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఏపీలో గణనీయంగా పెరుగుతున్న ఎయిర్‌ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా సొంత విమానయాన సంస్థను ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక ఢిల్లీ –ఇండోర్-తిరుపతి- విజయవాడ-ముంబై, విజయవాడ-తిరుపతి-ఇండోర్- ఢిల్లీ మద్య జులై నెలాఖరు నుంచి జూమ్ ఎయిర్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా సర్వీసులు పెంచి అందరికి విమానయానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. విజయవాడ నుంచి దుబాయ్, హాంకాంగ్, కౌలాలంపూర్ లకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని సూచించారు. ప్రపంచ ప్రసిద్ద నగరాలన్నీ సొంత ఎయిర్ లైన్స్ కలిగి ఉన్నాయని, అమరావతి కూడా సొంత ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం మీద 18 శాతం ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదై ఆంధ్రప్రదేశ్ లో 35 శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో రన్ వే, రెండో టెర్మినల్ భవనాల పనులు త్వరిత గతిన పూర్తీ చేసి కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఓర్వకల్లు విమానశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తీ చేస్తామని చెప్పారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భూ సమస్యలను సత్వరం పరిష్కరించి నిర్మాణం ప్రారంభించి సంవత్సర కాలంలో పార్టి చేయాలన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్ లు నిర్మించాలని చెప్పారు. ప్రతి ఏటా విశాఖ, విజయవాడ, తిరుపతిలలో ఎయిర్ షో లు ఏర్పాటు చేయాలని కోరారు.

పోర్టుల నిర్మాణం వేగవంతం….

మచిలీపట్టణం, భావనపాడు గ్రీన్‌ ఫీల్డు పోర్టుల నిర్మాణం వేగంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, ఓడరేవుల అనుసంధానంతో ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చే అంశంపై ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కార్యాచరణ వేగవంతం చేయాలని సూచించారు. రూ.లక్షా 30 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్టు పనులు రాష్ట్రంలో జరుగుతున్నట్టు అధికారులు ఆయనకు తెలుపగా, రోడ్డు, రైలు, ఫిషరీస్, ఇండస్ట్రీస్ శాఖల సమన్వయంతో ఈ భారీ ప్రాజెక్టును నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని చెప్పారు. గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర పెట్రోలియంశాఖా మంత్రికి లేఖ రాయాలని అధికారులకు సీయం సూచనలిచ్చారు. తిరుపతిలో సైన్స్ సిటీ, విజయవాడలో సిటీ స్వ్కేర్ నిర్మాణాలను సత్వరం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1