ఏపీలో మరిన్ని ఎయిర్ పోర్టులు అవసరమా?

రాష్ట్రంలో మౌలికవసతుల కల్పన శరవేగంగా సాగినప్పుడే అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం తన కార్యాలయంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పవర్ ప్రాజెక్టులు, గ్యాస్ పైపులైన్ ఏర్పాటు, ఫైబర్ నెట్ వంటి మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్షించారు. కర్నూలు జిల్లా గనిలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పార్క్‌ సహా, అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట, తాడిపత్రి, కడపజిల్లాలోని గాలివీడు, మైలవరంలో నెలకొల్పుతున్న అల్ట్రా మెగా సోలార్ పార్కుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎదురు చూస్తున్నామని, విశాఖ విమానాశ్రయంలో కార్గో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా వున్నామని అధికారులు తెలిపారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 2,502 ఎకరాలకు గాను 2,210 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందని చెప్పారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ రెండింటిలో రెండో రన్ వే…లు…….

గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో రెండో రన్ వే ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారిలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. అనంతపురంలో ఏర్పాటు చేయదలచిన ఎనర్జీ యూనివర్సిటీ, కాకినాడలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ యూనివర్సిటీలపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఏపీ ఫైబర్ ప్రాజెక్టు ప్రారంభించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ నాటికి లక్ష ఐపీటీవీ సెట్‌టాప్ బాక్సులు అందుబాటులోకి తెస్తామని, 2018 మార్చి నాటికి 9.40 లక్షల బాక్సులను సిద్ధం చేస్తామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తిరుపతిలో నిర్మించ తలపెట్టిన సైన్స్ సిటీలో 1. ఇండోర్ రెయిన్ ఫారెస్ట్, బయోడైవర్సిటీ మ్యూజియం 2. ఎవల్యూషన్, ఆంత్రోపాలజీ మ్యూజియం 3. ఆర్ట్, సైన్సెస్ మ్యూజియం 4. చిల్డ్రన్ మ్యూజియం, ప్లానిటోరియం 5. మీడియా మ్యూజియం 6. ఎయిర్, స్పేస్, డిఫెన్స్ మ్యూజియం 7. ట్రాన్స్‌పోర్టు మ్యూజియాలు మరో సప్తగిరులుగా ప్రఖ్యాతి గాంచేలా డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ముఖ్యాంశాలు :

• రాష్ట్రంలో ఈ ఏడాది పోర్టులకు పెరిగిన రద్దీ, ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 8% వృద్ధి నమోదు.
• రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతేడాది కన్నా ఈ ఏడాది 16% వృద్ధి.
• 70 మె.వా. విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన 12 వేస్ట్ టు ఎనర్జీ(వ్యర్ధాల నుంచి విద్యుత్) ప్లాంట్లను 2018-19 నాటికి నెలకొల్పాలనేది లక్ష్యం.
• టెండర్ల దశలో కాకినాడ – విశాఖపట్నం మధ్య 180 కి.మీ. గ్యాస్ పైపులైను ఏర్పాటు ప్రక్రియ.
• సెప్టెంబర్ 5న తిరుపతిలో ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ ప్రారంభం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*